మరింత స్మార్ట్‌గా..

Development Of Municipal Schools As Part Of The Smart City Project - Sakshi

స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా మున్సిపల్‌ స్కూళ్ల అభివృద్ధి 

ఇప్పటికే 31 జీవీఎంసీ స్కూళ్లలో స్మార్ట్‌ క్లాసులు 

మరిన్ని పాఠశాలల్లో రూ.28.27 కోట్లతో పనులు

స్మార్ట్‌ క్లాసులు నిర్వహిస్తూ పేద విద్యార్థులకు సరికొత్త విద్యాబోధన అందిస్తున్న మహా విశాఖ నగర పాలక సంస్థ.. మరిన్ని స్కూళ్లలో సేవలు విస్తృతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. స్మార్ట్‌ క్లాస్‌ రూమ్‌లు, డిజిటల్‌ ల్యాబ్‌లు, ప్రొజెక్షన్‌ యూనిట్లు.. ఇలా స్మార్ట్‌ పాఠశాలలుగా అభివృద్ధి చేసేందుకు రూ.28.77 కోట్లతో పనులు చేపట్టింది. లాక్‌డౌన్‌ కారణంగా పనులు ఆలస్యం కావడంతో.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పేద విద్యార్థులకు స్మార్ట్‌ పాఠాలు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.    

సాక్షి, విశాఖపట్నం : మున్సిపల్‌ బడి అంటే.. దుంపల బడి అనే ఆలోచన నుంచి.. డిజిటల్‌ బడి అనేలా తీర్చిదిద్దుతున్నారు మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులు. కార్పొరేట్‌ స్కూల్‌ విద్యార్థులకు అందే ప్రతి సౌకర్యం పేద, మధ్య తరగతి విద్యార్థులకు అందాలనే లక్ష్యంతో జీవీఎంసీ వినూత్నంగా ఆలోచనలు చేస్తోంది. విద్యార్థుల్లో ఆవిష్కరణ, పరిశోధన నైపుణ్యం, సామర్థ్యం పెరగాలనే లక్ష్యంతో ప్రాథమిక స్థాయిలోనే వారికి సాంకేతికతను పరిచయం చేయాలని జీవీఎంసీ నిర్దేశించుకుంది. ఇందుకు అనుగుణంగానే స్మార్ట్‌ క్లాసులను 2017 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించింది. మొదటి 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు, స్మార్ట్‌ క్లాస్‌లు పరిచయం చేసిన జీవీఎంసీ ఇప్పుడు ఒకటి నుంచి 8 వరకూ స్మార్ట్‌ క్లాస్‌లనూ, 10వ తరగతి వరకూ డిజిటల్‌ తరగతులను బోధిస్తోంది. దీని ద్వారా పిల్లల్లో నేర్చుకోవాలనే తపన, పాఠ్యాంశాలపై అవగాహన, ఆసక్తి, ఉత్సాహం పెరుగుతోంది. 

మూడు విభాగాలుగా తరగతులు 
స్మార్ట్‌ క్లాస్‌ రూమ్‌ అనేది మూడూ విభాగాలుగా అమలు చేస్తున్నారు. మొదటిది ప్రతి క్లాస్‌కు డిజిటల్‌ బోర్డును అమర్చుతారు. ఈ డిజిటల్‌ బోర్డును టీచర్స్‌ వినియోగించి.. పాఠాలను బోధిస్తారు. ఇలా బోధించడం వల్ల విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమవుతాయి. గణితం, సైన్స్‌ డయాగ్రామ్స్‌ విద్యార్థులు స్పష్టంగా 3డిలో వివరిస్తే ఆసక్తిగా ఉంటుంది. రెండో దశలో విద్యార్థులకు క్రోమ్‌ బుక్స్‌ (మినీ ల్యాప్‌టాప్స్‌) ఇచ్చి వారికి కంప్యూటర్‌ పరిజ్ఞానం నేర్పుతారు. ఇందులో ప్రత్యేకం గూగుల్‌ క్లాస్‌ రూమ్‌. ఇది విద్యా రంగంలో డిజిటల్‌ క్లాస్‌లకు ముఖ్య భూమిక పోషిస్తోంది. దీని గురించి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నేర్పిస్తారు. మూడో దశలో గూగుల్‌ క్లాస్‌ రూమ్‌ గురించి నేర్చుకున్న తరువాత ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆన్‌లైన్‌లో హోమ్‌ వర్క్స్‌ ఇవ్వడం, పరీక్షలు నిర్వహిస్తారు. వారు చేసిన హోమ్‌ వర్క్స్, పరీక్షలకు ఫలితాలను వెంటనే వెల్లడవుతాయి. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సమయం ఆదాతో పాటు, బుక్స్‌లో లేని విషయాలను సైతం తెలుసుకునే అవకాశం ఏర్పడుతోంది. 

స్మార్ట్‌ ల్యాబ్‌లు.. డిజిటల్‌ క్లాసులు  
విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పడమే కాదు.. ఆన్‌లైన్‌లోనే పరీక్షలూ నిర్వహించేలా 2019–20 విద్యా సంవత్సరంలో యూనిట్‌ పరీక్షలు పైలట్‌గా చేపట్టి సఫలీకృతులయ్యారు. ఆన్‌లైన్‌ ద్వారా రివిజన్‌ ఎగ్జామ్స్‌ సైతం నిర్వహించారు. ఇలా ప్రతి అడుగూ స్మార్ట్‌గా వేస్తున్న జీవీఎంసీ మిగిలిన స్కూళ్లలోనూ ప్రాజెక్టు విస్తరిస్తోంది. రూ.28.27 కోట్లతో స్మార్ట్‌ స్కూళ్లు పనులు చేపడుతోంది. హైస్కూళ్లలో స్మార్ట్‌ క్లాస్‌ రూమ్‌లు, ప్రొజెక్షన్‌ యూనిట్లుతో పాటు ప్రాథమిక, ప్రాథమికోన్నత  పాఠశాలల్లో డిజిటల్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో పనులు ఆలస్యమయ్యాయి. వీటన్నింటినీ ఈ విద్యా సంవత్సరంలో పూర్తి చేసి, 2021–22 నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీవీఎంసీ ప్రయత్నిస్తోంది. 

జీవీఎంసీ పాఠశాలలోని డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లో నాలెడ్జ్‌ యంత్ర (కెయాన్‌) అప్లికేషన్‌ ద్వారా క్లాస్‌ వివరించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో కెయాన్‌ వినియోగిస్తున్నారు. కంప్యూటర్‌కు ప్రొజెక్టర్‌ అనుసంధానించి. ప్రొజెక్టర్‌ ఆన్‌ చేసి ఇంటెల్‌ స్పేస్‌ అనే స్మార్ట్‌ బోర్డును ఉపాధ్యాయులు వినియోగిస్తున్నారు. సుద్ద ముక్క లేకుండానే బోర్డుపై క్లాసులు చెప్పే సౌకర్యం ఉంది. అదే విధంగా ల్యాబ్‌లో కెయాన్‌తో పాటు 40 క్రోమ్‌బుక్స్‌ను విద్యార్థులకు ఇస్తారు. ఈ క్రోమ్‌బుక్స్‌లోనే పెన్ను పుస్తకాలతో సంబంధం లేకుండా విద్యార్థులు నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకునే సౌకర్యం కూడా అందుబాటులోకి రానుంది. 

చురుగ్గా స్మార్ట్‌ స్కూళ్ల పనులు 
జీవీఎంసీ విద్యార్థుల్లోనూ, ఉపాధ్యాయుల్లోనూ స్మార్ట్‌ క్లాసులు మంచి మార్పులు తీసుకొచ్చింది. డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ వల్ల విద్యార్థులు రివిజన్‌ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సైన్స్‌ వీడియోస్‌ ద్వారా విద్యార్థులకు పాఠాలపై పూర్తి అవగాహన కలుగుతోంది. స్మార్ట్‌ క్లాస్‌ రూమ్స్‌ వల్ల పోటీ పరీక్షలకు కూడా విద్యార్థులకు మంచి సహకారం లభిస్తోంది. పనులు చురుగ్గా సాగుతున్నాయి. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా అమలు చేస్తున్న స్మార్ట్‌ క్లాసులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం. దీనికి తోడు విద్యార్థుల్ని ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్‌ను ఎదుర్కొనేలా సంసిద్ధుల్ని చేస్తే భవిష్యత్తులో అన్ని పోటీ పరీక్షల్నీ సులువుగా అందిపుచ్చుకోగలరు. అందుకే పరీక్షలు కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించే విషయంపై కసరత్తు చేస్తున్నాం. 
– జి.సృజన, జీవీఎంసీ కమిషనర్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top