ఫోన్‌ మాట్లాడేందుకు సెల్‌ తీశాడని.. దాడి చేసిన కానిస్టేబుల్‌

Constable Allegedly Assaulted A Private Employee - Sakshi

అనంతపురం క్రైం: అనంతపురం త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌ కానిస్టేబుల్‌ అన్వర్‌ బాషా రెచ్చిపోయాడు. అకారణంగా ఓ ప్రైవేటు ఉద్యోగిపై దాడికి పాల్పడ్డాడు. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురంలోని రెవెన్యూ కాలనీలో నివాసముంటున్న సుదర్శన్‌ రెడ్డి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం నారాయణ కళాశాలలో చదువుతున్న తన కుమారుణ్ని తీసుకుని బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. సైఫుల్లా బ్రిడ్జి వద్దకు రాగానే ఓ బేకరీ వద్ద బండి ఆపి మిక్చర్‌ తీసుకున్నాడు. అదే సమయంలో అక్కడ త్రీటౌన్‌ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు బృందం వాహనాల తనిఖీ చేస్తోంది.

ఓ యువకుడి బైక్‌పై నాలుగు ఫైన్లు (చలానాలు) పెండింగ్‌ ఉండడంతో వాటిని చెల్లించాలని ఎస్‌ఐ సూచించాడు. అదే సమయంలో సుదర్శన్‌రెడ్డి ఫోన్‌ మాట్లాడేందుకు సెల్‌ తీశాడు. దీన్ని గమనించిన కానిస్టేబుల్‌ అన్వర్‌బాషా చెలరేగిపోయాడు. ‘ఏరా.. వీడియో తీస్తున్నావా’ అంటూ విచక్షణారహితంగా దాడి చేశాడు. తాను పలానా సంస్థలో ఉద్యోగినని చెప్పినా వినిపించుకోలేదు. అసభ్య పదజాలంతో దూషిస్తూ చెంపలపై ఇష్టానుసారంగా కొట్టాడు. కానిస్టేబుల్‌ అన్వర్‌బాషా తీరును అక్కడున్న వారు సైతం తప్పుబట్టారు.   

కొందరు పోలీసుల తీరు వివాదాస్పదం 
నగరంలో కొందరు పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. ప్రజలను, మరీ ముఖ్యంగా వాహనదారులను అకారణంగా దూషించడం, కొట్టడం పరిపాటిగా మారింది. విద్యావంతులు, ఉద్యోగుల పట్ల కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ప్రవర్తన హుందాగా ఉండాలని, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని ఉన్నతాధికారులు పదేపదే చెబుతున్నా..వీరిలో మాత్రం మార్పు కన్పించడం లేదు.  

(చదవండి: చింతకాయల కోసం వెళ్లి.. చిక్కుకుపోయి.. చివరికి..)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top