
శాసన మండలిలో పోడియం వద్ద నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ సభ్యులు
పీపీపీ విధానంపై చర్చకు వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం
తిరస్కరించిన చైర్మన్.. చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టిన వైఎస్సార్‌సీపీ.. పోడియం వద్ద ప్రతిపక్ష సభ్యుల ఆందోళన
ప్రైవేటీకరణను వెంటనే రద్దుచేయాలని డిమాండ్
రెండుసార్లు సభ వాయిదా వేసినా తిరిగి అదే పరిస్థితి
ఒకానొక దశలో పోడియం వద్ద టీడీపీ–వైఎస్సార్‌సీపీ సభ్యుల పోటాపోటీ నినాదాలు
గంటసేపు కూడా సాగని ‘కౌన్సిల్’
సాక్షి, అమరావతి: పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను చంద్రబాబు ప్రభుత్వం వెంటనే రద్దుచేయాలి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు శుక్రవారం శాసనమండలి సమావేశంలో పట్టుబట్టారు. సమావేశాలు జరుగుతున్నంతసేపూ వారు పోడియం ముందే నిలబడి పెద్దఎత్తున నినాదాలు, ఆందోళన చేశారు. దీంతో శుక్రవారం గంటపాటు కూడా సభ జరగలేదు.
వీరి ఆందోళనల మధ్యే ‘మండలి’ చైర్మన్ మోషేన్‌రాజు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు యత్నించారు. మధ్యలో రెండుసార్లు సభను తాత్కాలికంగా వాయిదా వేసి గందరగోళ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయినా, పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.
వాయిదా తీర్మానం, తిరస్కరణ..
అంతకుముందు.. ఉదయం సభ ప్రారంభం కాగానే ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ–పీపీపీ విధానం’ గురించి చర్చించేందుకు వైఎస్సార్‌సీపీ సభ్యులు మొండితోక అరుణ్‌కుమార్, సిపాయి సుబ్రమణ్యం, కుంభా రవిబాబు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినట్లు చైర్మన్ మోషేన్‌రాజు ప్రకటించారు.

ఇందుకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం తెలుపుతూ, ఈ అంశంపై సభలో చర్చ చేపట్టాలంటూ పోడియం వద్దకు చేరుకుని ‘ప్రజారోగ్యం ప్రైవేటీకరణా.. పేదలు చదువుకునే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సిగ్గుసిగ్గు’.. వంటి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు ఉపక్రమించారు.
ఈ గందరగోళ పరిస్థితుల మధ్య విద్యా శాఖకు సంబంధించిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ బదులిచ్చారు. బీఏసీలో చర్చించి ఈ అంశంపై నిర్ణయం తీసుకుందాం.. అప్పటివరకు సభ్యులు సహకరించాలని చైర్మన్ సూచించినప్పటికీ సభ్యులు శాంతించలేదు. దీంతో, ఆయన సభను కొద్దిసేపు వాయిదా వేశారు.
మళ్లీ అదే సీన్..
అనంతరం.. ఉ.10.44కు సభ తిరిగి ప్రారంభమయ్యాక మండలి చైర్మన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు తిరిగి పోడియం వద్దకు చేరుకుని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు కొనసాగించారు. ఇంతలో మరో రెండు ప్రశ్నలకు మంత్రులు బదులిచ్చారు. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో చైర్మన్ మోషేన్‌రాజు 11 గంటలకు మళ్లీ వాయిదా వేశారు. మండలి బీఏసీ సమావేశానంతరం సభ తిరిగి కొనసాగుతుందని ఆయన ప్రకటించారు.
టీడీపీ వర్సెస్ వైఎస్సార్‌సీపీ..
సభ తిరిగి మ.12.38కు ప్రారంభం కాగానే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు పోడియం వద్ద మళ్లీ తమ ఆందోళన కొనసాగించారు. మెడికల్ కాలేజీ అంశంపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం బీఏసీ సమావేశంలో అంగీకరించిందని.. సభ్యులు తమ సీట్లలోకి వెళ్లి కూర్చోవాలంటూ విజ్ఞప్తి చేసినా వారు అక్కడే ఉండిపోయారు. దీంతో ప్రశ్నోత్తరాల అజెండాల్లో ఉన్న అన్ని ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు ఉంచాలంటూ చెప్పి ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసినట్లు చైర్మన్ ప్రకటించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నోత్తరాలు కొనసాగించాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ పోడియం వద్దకు చేరుకోవడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది.
కొద్దిసేపటికి టీడీపీ సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లగా, వైఎస్సార్‌సీపీ సభ్యులు ఆందోళన కొనసాగిస్తూ పోడియం ముందే ఉండిపోయారు. ఈ సమయంలో జీఎస్టీపై ప్రభుత్వ ప్రకటన చేసేందుకు మంత్రి పయ్యావుల కేశవ్ యత్నించగా.. సభలో పరిస్థితులు చూసి సోమవారం ప్రకటన చేస్తానంటూ చెప్పారు. దీంతో.. మ.ఒంటిగంట ప్రాంతంలో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.