
‘వారిది బాధ – మాది బాధ్యత’ కాబట్టి, ఈ సభ ద్వారా ప్రజల ముందు వాస్తవాలు ఉంచుతున్నా. మూడు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాలను చూస్తున్న వారంతా మిగతా వారికి, యంగ్ జనరేషన్‌కూ బాబు అండ్ కో గురించి చెప్పాలి. ప్రజలు బాగుంటే చంద్రబాబు బాధగా, కోపంగా ఉంటాడని.. ప్రజలు బాధగా ఉంటే ఆనందంగా ఉంటాడని చెప్పాలి. అధికారంలో ఉండగా ప్రజలకు మంచి చేసిన చరిత్ర చంద్రబాబుకు లేనే లేదు. అందుకే రాష్ట్రానికి ఏం మంచి జరిగినా తట్టుకోలేక ఒకటే ఏడుపు. ఇలా ఏడ్వటంలో చంద్రబాబును మించిన వారు లేరు.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధిని చూసి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా తట్టుకోలేక రాష్ట్ర ప్రగతిని అడ్డుకునే విధంగా దుష్ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. వాళ్ల వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో లేడన్న దుర్బుద్ధితో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబులతో కూడిన దుష్టచతుష్టయం రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేసేలా నీచమైన రాతలు రాస్తున్నారని విమర్శించారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసినా, ఇది తన పథకమని చెప్పుకోవడానికి ఒక్కటీ లేదని, అదే రాష్ట్ర ప్రగతిని అడ్డుకునే విధంగా ఏమి చేశారని అడిగితే చెప్పడానికి అనేక అంశాలున్నాయన్నారు. సోమవారం ఆయన శాసనసభలో ‘పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి’ అనే అంశంపై స్వల్ప కాలిక చర్చ ముగింపు సందర్భంగా మాట్లాడారు. ‘మన ఆర్థిక వ్యవస్థ గురించి, పారిశ్రామిక రంగం గురించి రోజుకో రీతిన దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో మీడియా పూర్తిగా పోలరైజ్ కావడం బాధాకరమైన వాస్తవం. చంద్రబాబు పాలనలో కంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మన పాలనలో బాగుందని ఏకంగా కాగ్ గణాంకాలతో వివరిస్తే.. చంద్రబాబు కంటే ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలకు ఎక్కువ కోపం వచ్చింది. వీళ్ల పేపర్లలో రాతలు, టీవీలలో చర్చలు చూస్తుంటే వీళ్లు ఎంతలా జీర్ణించుకోలేకపోతున్నారో ఆశ్చర్యం కలిగిస్తోంద’న్నారు. ఇంకా సీఎం జగన్ ఏం చెప్పారంటే..
వారిది ఫెవికాల్ బంధం
బాబు మీద ఈగ వాలినా కూడా వీళ్లకు కోపం వచ్చేస్తుంది. వీరి బంధం ఫెవికాల్ కంటే పటిష్టమైనది. దోచుకో, పంచుకో, తినుకో అని పూర్తిగా చంద్రబాబునాయుడు దోచేయడం, తర్వాత ఈనాడుకి ఇంత అని, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇంత, దత్తపుత్రుడుకి ఇంత అని పంచుకునేవారు. ఒక పద్ధతి ప్రకారం జరిగేది కాబట్టి.. ఎవరూ రాయరు, ఎవరూ చూపించరు, ఎవరూ మాట్లాడరు.
అయితే దేవుడు, ప్రజలు వారికి మొట్టికాయలు వేశారు. వారి ప్రభుత్వం పోయి, మన ప్రభుత్వం వచ్చింది. వచ్చే ఆదాయం పోయింది కాబట్టి.. సహజంగానే జీర్ణించుకోలేక బీపీలు, టెన్షన్‌లు బయట పడుతున్నాయి. ఒక్కోసారి వాళ్ల రాతలు, టీవీల్లో వారి డిబేట్లు చూసి భయమేస్తుంది. అది ఎలాంటి భయమంటే.. ఎక్కడ వాళ్లకు గుండెపోటు వస్తుందేమోనని. ఎందుకంటే ఒక మనిషి మీద ఆ స్థాయిలో ఈర‡్ష్య పెట్టుకోవడం ఎక్కడా కనీ వినీ ఎరుగం.
వీటన్నింటికీ ఒకే సమాధానం.. చంద్రబాబు
వ్యవసాయాన్ని దండగ అన్నది ఎవరంటే.. బాబే అంటారు. రైతును దారుణంగా దెబ్బ తీసింది.. పల్లెల్ని ఘోరంగా దెబ్బ తీసింది, కరువుకు కేరాఫ్ అడ్రస్, మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను మోసాలుగా మార్చింది, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి ప్రథమ శత్రువు, మన అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్నీ తప్పింది ఎవరు అంటే.. సమాధానం పెత్తందారీ చంద్రబాబే అని ఎవరైనా చెబుతారు.
ఇవి కాకుండా సొంత పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది, సీఎం పదవి, ట్రస్టు, పార్టీ... అన్నింటినీ లాక్కున్న పుణ్య పురుషుడు, ఆంధ్రప్రదేశ్ విభజనకు తొలి ఓటు వేసింది ఎవరంటే, ఆ తర్వాత రాష్ట్రానికి 10 సంవత్సరాలు రావాల్సిన ప్రత్యేక హోదాను పోగొట్టింది, ప్రత్యేక హోదాను వదులుకుని... పరిశ్రమల్ని, ఉద్యోగాల్ని కూడా తాకట్టు పెట్టి ఈ రాష్ట్రానికి, ఇంటింటికీ ద్రోహం చేసింది, పోలవరం ప్రాజెక్టు కమీషన్ల కోసం ప్రత్యేక హోదాను వదులుకుని ప్రత్యేక ప్యాకేజీ అంతకంటే గొప్పది అని పాంప్లెట్లు వేసి ప్రెస్‌మీట్లు పెట్టి, అసెంబ్లీని సైతం వాడుకుని, రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టిందెవరంటే కూడా బాబే అని చెబుతారు.
ఎయిర్‌బస్, హైపర్ లూప్, ఒలింపిక్స్, మైక్రోసాప్ట్, అమరావతి మొత్తానికి ఏసీ ఇలా రాని పెట్టుబడులను వచ్చాయని చూపించి దొంగ లెక్కలు వేయటంలో అంతర్జాతీయ నిపుణుడు.. 10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయితే... ఓటుకు కోట్లిస్తూ దొరికిపోయి పారిపోయి వచ్చింది.. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో వేల కోట్లు నొక్కేసే డిజైన్‌గా రాజధాని అనే పేరుతో డిసైడ్ చేసి డ్రామా ఆడింది.. ఆ వేల కోట్లు రావన్న భయంతో ఇప్పుడు యాత్రలు పెట్టింది.. ఇలా ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం ఒక్కటే.. చంద్రబాబు అని.
ఇదీ చంద్రబాబు నాయుడు గుణశీల సంపద. ఇదీ ఆయన క్యారెక్టర్. ఇటువంటి వ్యక్తి గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా కూడా తక్కువే. ఇటువంటి చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లో తిరిగి అధికారంలోకి తీసుకుని రావాలి, లేకపోతే దోచుకో, పంచుకో, తినుకో అన్నది ఉండదు.. అని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడి తాపత్రయం. ఇంత మందితో యుద్ధం చేయగలుగుతున్నామంటే దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలే.
మంచి జరుగుతుంటే ఒకటే ఏడుపు!
బాబు అండ్ కో దుష్టచతుష్టయం మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే ఏడుస్తారు. మన గ్రోత్‌రేట్‌ను చూసి ఏడుస్తారు. మన ఆర్థిక పరిస్థితి వారి హయాంలో కన్నా మెరుగ్గా ఉందని అర్థమవుతుంటే ఏడుస్తారు. మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద వర్గాలకు రూ.1.65 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించాం అంటే ఏడుస్తారు. పేద పిల్లలకు గవర్నమెంట్ బడిలో ఇంగ్లిష్ మీడియం సీబీఎస్‌ఈ చదువులు చదివిస్తాం అంటే ఏడుస్తారు. మూడు ప్రాంతాల ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ డీ సెంట్రలైజేషన్ చేస్తాం అంటే ఏడుస్తారు. మన పాలనలో వర్షాలు బాగా పడితే, పంటలు బాగా పండుతుంటే కూడా ఏడుస్తారు. మన రిజర్వాయర్లు వరుసగా నాలుగో ఏడాది నిండితే ఏడుస్తారు. ఇలాంటి ప్రతిపక్షంతో, ఇలాంటి దుష్టచతుష్టయంతో మనం వేగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చంద్రబాబు పోషించిన పాత్ర ఏమిటంటే నాలుగు ఉదాహరణలు కూడా దొరకవు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడంలో ఆయన పాత్ర ఏమిటంటే ఉదాహరణలు కోకొల్లలు.