చుక్క గొరక.. సాగు ఎంచక్కా!

Chukka Goraka Fish Cultivation is successful in Andhra Pradesh - Sakshi

కృష్ణా జిల్లా పెద్దపాలెంలో ప్రయోగాత్మక సాగు విజయవంతం  

లాభాలనార్జించిన సాగుదారులు  

ఈ రకం చేపలకు కేరళలో భలే డిమాండ్‌  

రైతులకు సీఎంఎఫ్‌ఆర్‌ఐ సాంకేతిక సహకారం

సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లాలోని నాగాయలంక మండలం పెద్దలంకలోని సెంట్రల్‌ మెరైన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎంఎఫ్‌ఆర్‌ఐ) సహకారంతో ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘చుక్క గొరక’(పెరల్‌ స్పాట్‌) చేపల సాగు విజయవంతమైంది. రాష్ట్రంలో మొట్టమొదటి హేచరీని మత్స్యశాఖ నాగాయలంకలో ఏర్పాటు చేసింది. చేపల సాగును ఇతర ప్రాంతాలకు విస్తరించేలా సీఎంఎఫ్‌ఆర్‌ఐ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ఆక్వాలో అధిక దిగుబడులు, దేశీయ వినియోగంతో పాటు, విదేశీ ఎగుమతులకు అనువైన చేపల సాగుకు పూర్తి స్థాయిలో సాంకేతిక సహకారం అందిస్తోంది. దీనిలో భాగంగా కేరళలో పేరుగాంచిన కరమీన్‌ చేపల సాగు(స్థానికంగా చుక్క గొరక అంటారు) ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టి.. సాగుదారులకు శిక్షణ ఇస్తున్నారు. 

ఇలా సాగు చేశారు..  
నాగాయలంక మండలం పెద్దపాలెం యానాది తెగల గ్రూపునకు చెందిన చెరువులో పెరల్‌ స్పాట్‌ చేపల పెంపకాన్ని చేపట్టారు. 20 గ్రాముల పరిమాణం గల ఐదు వేల చేప పిల్లలను ఓ ఎకరం చెరువులో పెంచారు. తక్కువ ఖరీదైన చేపల మేత, బియ్యం ఊక కలిపి వాటికి మేతగా వాడారు. ఈ చేపలు పది నెలల తర్వాత సరాసరి 120 గ్రాముల పరిమాణానికి చేరుకున్నాయి. మొత్తంగా 83 శాతం చేప పిల్లలు బతగ్గా.. 510 కిలోల చేపల దిగుబడి వచ్చింది. కిలో రూ.225 చొప్పున అమ్మగా రూ.1.1 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది.

ఇందులో చేప పిల్లలకు, మేత ఇతర నిర్వహణ ఖర్చులకు దాదాపు రూ.55 వేలు పోగా, నికరంగా రూ.60 వేల వరకు లాభం వచ్చింది. తక్కువ వాడకంలో ఉన్న భూముల్లో అతి తక్కువ ఖర్చుతో చుక్క గొరక చేపల పెంపకాన్ని చేపట్టవచ్చని, అలాగే గణనీయమైన ఆదాయాన్ని పొందొచ్చని సాగుదారులు నిరూపించారు. వెనుకబడిన వర్గాల ఆర్థిక అభివృద్ధికి, ప్రత్యామ్నాయ జీవనోపాధికి ఈ చుక్క గొరక చేపల సాగు తోడ్పడుతుందని వారు నిరూపించారు.

యానాది తెగల సమూహానికి సీఎంఎఫ్‌ఆర్‌ఐ శిక్షణ ఇచ్చి చుక్క గొరక చేపల సాగును విజయవంతం చేసింది. ఈ చేపకు కేరళ రాష్ట్రంలో చాలా గిరాకీ ఉంది. 150 గ్రా పరిమాణం గలవి కిలో రూ.320 దాకా పలుకుతున్నాయి. మంచి నీరు, ఉప్పు నీటిలో జీవించే ఈ రకం చేప ఉప్పు నీటిలో బాగా పెరుగుతుంది.« వీటి పిల్లలు కాలువల్లో దొరుకుతాయి. వాటినే చేపల పెంపకానికి ఉపయోగిస్తారు. తక్కువ అలలు, ఎక్కువ నీటి పరిమాణం గల ఉప్పునీటిలో ఈ చేపల పెంపకానికి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు అనుకూలం.  

లాభదాయకం.. 
గతంలో మేము చేపలు, పీతల వేటకు వెళ్లే వాళ్లం. రోజూ కేవలం రూ.100–150 మాత్రమే వచ్చేవి. కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. సీఎంఎఫ్‌ఆర్‌ఐ వారు స్పెరల్‌ స్పాట్‌ సీడ్‌ ఇచ్చారు. వాటిని సాగు చేసి మంచి లాభాలు సాధించాం.  మా లాంటి వారికి శిక్షణ ఇచ్చి, చేప పిల్లలను ఇస్తే.. వాటిని పెంచుకుని జీవనోపాధి పొందుతాం.   
– భవనారి లక్ష్మీపవన్‌కుమార్, వి.కొత్తపాలెం, కోడూరు మండలం, కృష్ణా జిల్లా 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top