మీ పాప లేదా బాబు బొద్దుగా ముద్దొస్తున్నారండీ.. అంటే మురిసిపోకండి! పిల్లల ఆరోగ్యం గుల్లచేస్తున్నదేంటో తెలుసుకోండి..

Childrens health Damage with packaged food - Sakshi

‘మీ పాప లేదా బాబు బొద్దుగా ముద్దొస్తున్నారండీ’ అని ఎవరైనా అంటే వారి తల్లిదండ్రులు తెగ మురిసిపోతు­న్నారు. బాల్యంలోనే బొద్దుగా తయారవడం వల్ల వచ్చే దుష్ప్రభావాలను అసలు గుర్తించలేకపోతున్నారు. పిల్లలు ఏం తింటున్నారు, వారు తినే ఆహారంలో పోషకాలు ఏ మాత్రం ఉంటున్నాయనే విషయంపై ఆలోచించే వారైతే చాలా అరుదే.

పంజాబ్‌లోని బటిండా, ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) వైద్యులు అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. మార్కెట్‌లో లభించే ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలనే పిల్లలకు పెట్టేందుకు తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తేలింది.  పిల్లలకు పెట్టే ఆహారంలో ఉండాల్సిన పోషక విలువలపై తక్కువ అవగాహన ఉంటోందని గుర్తించారు. 
– సాక్షి, అమరావతి

53.9 శాతం అధికంగా కొలెస్ట్రాల్‌
పాఠశాలల్లో చదివే 14–18 సంవత్సరాల మధ్య వయసు పిల్లలు 722 మంది, వారి తల్లిదండ్రులను ఎయిమ్స్‌ బృందం అధ్యయనానికి ఎంచుకుంది. ఆ పిల్లల్లో జంక్‌ ఫుడ్, ప్యాక్‌ చేసిన ఆహారం కారణంగా చిన్న వయసులోనే ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్‌ వ్యాధుల బారినపడేలా చేస్తున్నాయని గుర్తించారు. పిల్లలు తినే ఆహారాల (ప్యాకేజీ ఫుడ్‌) తయారీలో 53.9 శాతం అధికంగా కొలెస్ట్రాల్‌ పదార్థాలు ఉంటున్నాయని తేల్చారు. ఇది విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావంచూపుతోందని తేల్చారు.

ప్రకటనలతో ప్రభావితం 
టీవీలు, డిజిటల్‌ మీడియాలలో వచ్చే ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాల వైపు పిల్లలు ఆకర్షితులు అవుతున్నారని 273 మంది తల్లిదండ్రులు (37.8 శాతం) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 184 (25.5 శాతం) మంది ప్రచారం చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో పోషకాల నాణ్యతకు సంబంధించిన సమాచార కచ్చితత్వంపై సందేహాలు వ్యక్తం చేశారు.

దాదాపు 45 శాతం మంది తల్లిదండ్రులు ప్రసిద్ధ వ్యక్తులు జంక్‌ ఫుడ్స్‌ను ప్రమోట్‌ చేస్తుండటాన్ని వ్యతిరేకించారు. జంక్‌ ఫుడ్‌పై కంపెనీలు ఆఫర్లు ఇస్తుండటాన్ని 34 శాతం మంది తప్పుపట్టగా.. ప్రైమ్‌ టైమ్‌లో జంక్‌ ఫుడ్‌ ప్రకటనలు వేయకూడదని 40 శాతం మంది కోరారు.

గడువు తేదీని చూడని వారే అధికం
అధ్యయనంలో పాల్గొన్న విద్యార్థుల్లో 352 మంది (48.8 శాతం) విద్యార్థులు తినే ఆహార ప్యాకెట్లపై కనీసం గడువు తీరే తేదీని (ఎక్స్‌పైరీ డేట్‌)పరిశీలించడం లేదు. 526 మంది (72.9 శాతం) కేవలం ధరలను పరిశీలిస్తుండగా.. 518 మంది (71.7 శాతం) విద్యార్థులు కొనుగోలు చేసే ముందు ఆ ఆహారం వెజ్, నాన్‌–వెజ్‌ అనేది మా­త్రమే చూస్తున్నారు.

మార్కెట్‌లో లభించే ఆహార ప్యాకెట్లపై తయారీకి వినియోగించిన పదార్థాలు, వాటిలో ఉండే పోషకాలకు సంబంధించిన లే­బుల్స్‌పై సమాచారాన్ని కేవలం 50 మంది వి­ద్యా­ర్థులు (6.9 శాతం) మాత్రమే అర్థం చేసుకుంటు­న్నారు. 356 మంది విద్యార్థులు (49.30 శాతం) లేబుల్‌ చూసి తాము ఆహార పదార్థాల వైపు ప్రభావితం అవలేదని, 424 మంది (58.7 శాతం) లేబుల్స్‌ కారణంగా తమ కొనుగోలు ప్రవర్తనను ఎప్పుడూ మార్చుకోలేదని నివేదించారు. 

ఇంట్లోనే చేసి పెట్టాలి
పిల్లలకు ఇంటి ఆహారం అలవాటు చేయాలి. పూర్వం తల్లిదండ్రులు పిల్లల కోసం ఇంట్లోనే చక్రాలు, కజ్జికాయలు, అరిసెలు వంటి ఆహార పదార్థాలు చేసేవారు. ఆ తరహా పద్ధతులను ఇప్పుడు కూడా పాటించాలి. వీలైనంత వరకూ కూరగాయలు, పళ్లు తినడాన్ని చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేయాలి.

జంక్‌ ఫుడ్, ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. చైల్డ్‌ ఒబెసిటీ వస్తుంది. దీనివల్ల ఆస్తమా, ఫ్యాటీ లివర్, టైప్‌–2 డయాబెటిస్‌ వంటి సమస్యల బారినపడతారు. ఈ ఆహారంలో కలిపే పదార్థాల కారణంగా త్వరగా పిల్లల్లో కౌమార దశ మొదలవుతుంది.
– డాక్టర్‌ నాగచక్రవర్తి,  అసిస్టెంట్‌ ప్రొఫెసర్, జనరల్‌ మెడిసిన్, విజయవాడ జీజీహెచ్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top