చికెన్‌ ఖీమా దోసె.. తిన్నారంటే.. మామూలుగా ఉండదు మరి..

Chicken Keema Dosa Sudarshan Tiffin Centre At Srikakulam - Sakshi

శ్రీకాకుళం (కంచిలి): చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి.. అటు తమిళనాడు నుంచి పైన పశి్చమ బెంగాల్‌ వరకు ఎన్నో రుచులను పరిచయం చేస్తూ ఉంటుంది. వాటిలో సిక్కోలుకూ స్థానముంది. ఈ దారిలో ఒక్కో ఊరూ దాటిన కొద్దీ ఒక్కో రుచి ఆవిష్కృతమవుతూ ఉంటుంది. ఒకవేళ ఇచ్ఛాపురం వైపుగా మీ బండి వెళ్తుంటే.. కంచిలి మండలం భైరిపురం జంక్షన్‌లో కమ్మటి సువాసనలతో దోసెలు మనసు దోచేలా ప్రయాణికులను పిలుస్తూ ఉంటాయి. ‘సుదర్శన్‌ టిఫిన్‌ సెంటర్‌’ పేరుతో ఉండే ఈ టిఫిన్‌ సెంటర్‌లో దోసె తినకపోతే హైవే జర్నీ సంపూర్ణం కానట్టే లెక్క. 

ఒకప్పుడు ఫైవ్‌స్టార్‌ హొటల్‌లో చెఫ్‌గా పనిచేసిన సుదర్శన్‌.. ఆ తర్వాత సొంత ఊరికి వచ్చి ఈ టిఫిన్‌ సెంటర్‌ పెట్టుకున్నారు. ఆ ఏముందిలే.. అన్ని ఊళ్లలోనూ ఉన్నవే కదా అనుకుంటే.. తప్పులో కాలేసినట్టే. అన్ని హొటళ్లలా ఉండకపోవడమే దీని స్పెషాలిటీ. జిల్లాలో చాలా హొటళల్లో దోసెలు దొరుకుతాయి. అన్నీ కలిపి లెక్కేస్తే ఓ ఆరు రకాలు కూడా ఉండవు. కానీ సుదర్శన్‌ మాత్రం తన హొటల్‌ లో రకరకాల దోసెల రుచి చూపిస్తారు. 

ఇప్పుడు అదే ప్రత్యేక ఆకర్షణ అయ్యింది. ఈ టిఫిన్‌ సెంటర్‌లో ప్రత్యేకతను గుర్తించిన వినియోగదారులు అటు బరంపురం, ఇచ్ఛాపురం నుంచి ఇటు కంచిలి, సోంపేటల వైపు నుంచి వచ్చి ఈ రుచుల్ని ఆస్వాదించడం నిత్యం కనిపిస్తుంది.  రవ్వ దోసె, ఉల్లి దోసెతోపాటు పన్నీర్‌ దోసె, స్వీట్‌ కార్న్‌ దోసె, ఎగ్‌ ఖీమా దోసె, చికెన్‌ ఖీమా దోసె, సుదర్శన్‌ స్పెషల్‌ దోసెలు ఇక్కడ నోరూరిస్తాయి. రేటు కూడా మరీ ఎక్కువ కాదు. చికెన్‌ ఖీమా దోసె రూ.70 పెడితే వచ్చేస్తుంది. మిగతా దోసెలు కూడా రూ.40 నుంచి రూ.60 మధ్యలోనే ఉన్నాయి. అందుకే ఈ టిఫిన్‌ సెంటర్‌ ప్రయాణికులతో పాటు చుట్టుపక్కల వాసుల మనసు కూడా దోచింది. 

కస్టమర్ల సంతృప్తే ముఖ్యం 
నా టిఫిన్‌ సెంటర్‌కు వచ్చి తినే వినియోగదారుల సంతృప్తే నాకు దీవెనలు. ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో పనిచేసిన అనుభవంతో ఈ టిఫిన్‌ సెంటర్‌ను ప్రారంభించా. ఆ తరహాలో సౌకర్యాలు, రుచులతో నిర్వహించాలనే కోరికతో మాత్రమే నిర్వహిస్తున్నారు. లాభాపేక్ష నాకు లేదు. తక్కువ ధరలకే ఇలాంటి టిఫిన్స్‌ను అందించి, అందరి మన్ననలు అందుకోవడం నాకు కొండంత బలాన్నిస్తుంది. 
– సుదర్శన్, కుక్, టిఫిన్‌ సెంటర్‌ నిర్వాహకుడు 

రుచులు అమోఘం 
నేతితో తయారు చేసే వివిధ రకాల దోసెలు ఇక్కడ టిఫిన్‌ సెంటర్‌లో స్పెషల్‌. వీటి రుచులు కూడా అమోఘంగా ఉన్నాయి. కాస్త దూరమైనా అంతా ఇక్కడికి వచ్చి టిఫిన్స్‌ చేస్తుంటాం. ఇక్కడ తయారు చేస్తున్న దోసెల రుచి ప్రత్యేకం. జిల్లాతోపాటు, వివిధ పట్టణాల్లో సైతం దోసెలు తిన్నా కూడా, ఇక్కడ లభ్యమయ్యేవి చాలా బాగుంటాయి.    
– రంగాల సుమన్, వినియోగదారుడు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top