ధాన్యం సేకరణపై సర్కారు మీనమేషాలు
అకాల వర్షాలతో తడిసిపోతున్న ధాన్యం.. కొనుగోలు కేంద్రాలు తెరిచినా వేధిస్తున్న సంచుల కొరత
ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ధాన్యాన్ని దళారులకు తెగనమ్ముకుంటున్న రైతులు
బస్తాకు రూ.427 నుంచి రూ.527 వరకు నష్టం..
ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పంటను ఒబ్బిడి చేసుకునేందుకు రైతుల తిప్పలు
రాయలసీమలో పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీరు పెట్టుకుంటున్న రైతులు
రబీలో ధాన్యం దిగుబడి అంచనా 65 లక్షల టన్నులు
25 లక్షల టన్నులు మాత్రమే కొంటామంటున్న ప్రభుత్వం
ఇప్పటివరకు సేకరించింది 13 లక్షల టన్నులే
సాక్షి, అమరావతి/నెట్‌వర్క్: మారుతున్న వాతావరణ పరిస్థితులు అన్నదాతల గుండెల్లో గుబులు రేపుతోంది. ఓ వైపు తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల రాయలసీమలో వరి పంట ఎండిపోతుంటే.. మరోవైపు విరుచుకుపడుతున్న అకాల వర్షాలు, ఈదురు గాలులకు కోత దశలో ఉన్న వరి చేలు నేలకొరిగి రైతుల ఆశలను చిదిమేస్తున్నాయి. మొక్కజొన్న రైతులను నిలువునా ముంచిన చంద్రబాబు ప్రభుత్వం వరి రైతులను కూడా నిలువునా దగా చేస్తోంది. వరి ధాన్యానికి మద్దతు ధర దక్కక రైతులంతా లబోదిబోమంటున్నారు. కనీసం గోనె సంచులను కూడా పూర్తి స్థాయిలో సమకూర్చలేని దుస్థితి నెలకొంది. అకాల వర్షాల బారినపడి తడిసి ముద్దవుతున్న వరిని చూసి రైతులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
రైతుల పుట్టి ముంచిన ప్రభుత్వం
రబీలో దాదాపు 23 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. ప్రస్తుతం ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. గోదావరి, కృష్ణా జిల్లాలో 70 శాతానికి పైగా పూర్తయ్యాయి. ధాన్యాన్ని ఆరబెట్టడంతో చాలావరకు పంట కళ్లాల్లోనే ఉండిపోయింది. ఈ దశలో మారిన వాతావరణ పరిస్థితులు రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది. కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో కళ్లాల్లో ఉన్న ధాన్యపు రాశులు రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు తడిసి ముద్దయ్యాయి. ఈదురుగాలుల కారణంగా ధాన్యంపై కప్పిన పట్టాలు ఎగిరిపోవడంతో ధాన్యమంతా తడిసిపోయింది.
ఈ దశలో యుద్ధప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. కళ్లాల్లో ఉన్న ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమైతే ముక్క విరుగుడు సమస్య తలెత్తుతుందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పెరిగిన సాగు విస్తీర్ణాన్ని బట్టి ఈ ఏడాది 65 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 25 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఇప్పటివరకు 13 లక్షల టన్నులు మాత్రమే సేకరించింది.
వేధిస్తున్న సంచుల కొరత.. దక్కని మద్దతు ధర
ధాన్యం సేకరణ కోసం 3.16 కోట్ల సంచులు సిద్దంగా ఉంచామని ప్రభుత్వం గొప్పలు చెబుతుండగా.. క్షేత్రస్థాయిలో సంచుల కొరత రైతులను వేధిస్తోంది. 40 కేజీల ఖాళీ గోతం రూ.18 వెచ్చించి రైతులు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే 20–30 శాతం మంది రైతులు సొంతంగానే సంచులు కొనుగోలు చేశారు. అంతేకాకుండా ధాన్యాన్ని సంచుల్లో నింపి తూకం వేసినందుకు ఒక్కొక్క బస్తాకు రూ.9 చొప్పున, బస్తాలను మిల్లులకు తరలించేందుకు ట్రాక్టర్‌కు టన్నుకు రూ.800 చొప్పున రైతులే చెల్లిస్తున్నారు. వాహనాల వెయిటింగ్ చార్జీలు సైతం రోజుకు రూ.1,000 చొప్పున భరిస్తున్నారు.
సొంత ఖర్చుతో సంచుల్లో నింపిన ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించేందుకు ప్రభుత్వం సకాలంలో వాహనాలు సమకూర్చడం లేదు. ఫలితంగా బస్తాల్లో నింపిన ధాన్యం సైతం కళ్లాల్లోనే తడిసిపోతోంది. వ్యయ ప్రయాసలకోర్చి కొందరు రైతులు మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తే క్వింటాకు 5నుంచి 8 కేజీల చొప్పున తరుగు కింద తీసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. 1,635 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 16వేల వాహనాలు సమకూర్చామని చెబుతున్నప్పటికీ పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు. డిమాండ్ మేరకు వాహనాలు అందుబాటులో లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు.
పుట్టికి రూ.3 వేలు నష్టపోయిన రైతులు
ఖరీఫ్ ఆలస్యంగా సాగయ్యే నెల్లూరు జిల్లాలో ధాన్యం రైతులు నిలువు దోపిడికీ గురయ్యారు. పుట్టి (850 కేజీల)కి కనీస మద్దతు ధర ప్రకారం ఫైన్ రకానికి రూ.20,136, సూపర్ ఫైన్ రకానికి రూ.20,380 చొప్పున చెల్లించాల్సి ఉండగా.. రైతులకు కేవలం రూ,17 వేల నుంచి రూ,18 వేల మధ్య దక్కింది. పైగా తరుగు పేరిట 48 కేజీలు అదనంగా తీసుకున్నారు. కొనుగోలు కేంద్రంలో అమ్ముకున్నా పుట్టికి రూ.20,300 చొప్పున చెల్లించినా కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) పేరిట అదనంగా 140 కేజీలు తీసుకున్నారు.కొనుగోలు కేంద్రంలో అమ్ముకున్నా, దళారులకు అమ్ముకున్నా పుట్టికి రూ.3 వేల వరకు నష్టపోయామని రైతులు చెబుతున్నారు.
పైగా కూలీ, రవాణా చార్జీలు పైసా కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. గోదావరి, కృష్ణా డెల్టాల పరిధిలోని రైతులూ నిలువునా దోపిడీకి గురవుతున్నారు. కనీస మద్దతు ధర కామన్ రకం క్వింటాకు రూ.2,369, గ్రేడ్–ఏ రకం రూ.2,389 కాగా.. 75 కేజీల బస్తాకు సాధారణ రకానికి రూ.1.725, గ్రేడ్–ఏ రకానికి రూ.1,777 చొప్పున దక్కాల్సి ఉంది. యంత్రాలతో కోసిన ధాన్యాన్ని రూ.1,250 నుంచి రూ.1,350 మించి కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ లెక్కన బస్తాకు రూ.427నుంచి రూ.527 వరకు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
గోతాలు ఇవ్వకపోగా తరుగు తీస్తున్నారు
ధాన్యం నింపేందుకు గోతాలు ఇవ్వకపోగా మిల్లుల దగ్గర క్వింటాకి ఐదు కేజీల చొప్పున తరుగు తీస్తున్నారు. గోతాలు లేక ధాన్యం రోజుల తరబడి కళ్లాల్లోనే ఉంచాము. ప్రభుత్వం గోతాలు ఇస్తుందనే నమ్మకం లేక ఒక్కొక్క గోతం రూ.18 చొప్పున కొనుగోలు చేసి ధాన్యం నింపి మిల్లులకు తరలించాం. రవాణా చార్జి టన్నుకు రూ.800, కాటా కూలీ గోతానికి రూ.9 చొప్పున అన్ని మేమే ఇచ్చాం. ఇలా అయితే రైతులకు మిగిలేది ఏమీ ఉండదు.
– వి.నర్శిరెడ్డి, రైతు, టేకులపల్లి, ఎన్టీఆర్ జిల్లా
సంచులు ఇవ్వడం లేదు
తేమ తక్కువ రావడం లేదనే సాకుతో సంచులు ఇవ్వడం లేదు. ధాన్యం ఆరబెట్టుకుని తేమ తక్కువ రావడం కోసం రోజూ శాంపిల్ తీసుకుని రైతు సేవా కేంద్రాలు చుట్టూ తిరగడమే సరిపోతోంది. వాతావరణం చూస్తుంటే భయమేస్తోంది. సంచులు ఇచ్చారనుకుంటే.. ధాన్యం పట్టేందుకు జట్టు దొరకడం లేదు. ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేక కష్టపడి పండించిన పంట అమ్మేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. గత సార్వాలో ట్రాన్స్‌పోర్టు చార్జీలు ఇప్పటివరకు ఇవ్వలేదు.
– నల్లమిల్లి రామిరెడ్డి, రైతు, జుత్తిగ, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి
సంచులు నేనే కొనుక్కున్నా
నాలుగు ఎకరాల్లో వరి పండించాను. సంచులు ఇవ్వకపోవడంతో ధాన్యాన్ని వారం రోజులు కళ్లాంలోనే ఉంచేశాను. చేసేది లేక రూ.18 చొప్పున 250 సంచుల్ని కొని ధాన్యం నింపి మిల్లుకు తరలించాను. మిల్లు దగ్గర మూడు రోజులు పడిగాపులు పడిన తర్వాత క్వింటాకి 5 కేజీల చొప్పున తరుగు తీశారు. తరుగు డబ్బులను ముందు చెల్లిస్తేనే ధాన్యం దింపుకున్నారు.
– శీలం కృష్ణారెడ్డి, రైతు, టేకులపల్లి
నెల రోజులైనా కొనడం లేదు
నెల రోజుల నుంచి సొసైటీల చుట్టూ తిరుగుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సంచులు కూడా ఇవ్వడం లేదు. ఇచ్చే సంచులు ఎందుకు పనికిరావడం లేదు. క్వింటాకు 5 కేజీల కోత పెడుతున్నారు. అయినా ధాన్యం కొనుగోలు చేయడం లేదు. చాలా ఇబ్బందిపడుతున్నాం.
– కోలా రామకృష్ణ, కోదాడ
ఐదు కేజీలు కోత వేస్తున్నారు
కోతలు కోసి నెల రోజులైంది. తేమ శాతం ఎక్కువ ఉందని ఆరబెట్టుకున్నాం. రోజూ రైతు సేవా కేంద్రం చుట్టూ తిరుగుతున్నా ఒక్క గోనె సంచి కూడా ఇవ్వలేదు. అడిగితే సీరియల్ ప్రకారం వస్తుంది కంగారుపడొద్దంటున్నారు. టీడీపీ వాళ్లకు చెందిన ధాన్యం తోలుతున్నారు. వాళ్ల దగ్గర ఒక్క కేజీ కూడా తరుగు తీసుకోలేదు. మా ధాన్యం తోలడం లేదు. ఎప్పుడు తోలుతారో కూడా చెప్పడం లేదు. సొంతంగా మిల్లుకు తోలాలంటే ఒక్కో కాటాకు రూ.7 వేల నుంచి రూ.8 వేల కిరాయి. పైగా క్వింటాకు 5 కేజీల తరుగు తీసుకుంటున్నారు. వాతావరణం గంటకో రకంగా మారిపోతోంది. వర్షం పడుతుంటే చాలు భయమేస్తోంది. ధాన్యం తడిసి ముద్దయితే ఎవరు కొంటారు. ఇదేనా కొనుగోలు చేసే తీరు
– చిరసాని ప్రమీల, రైతు, వావిలాల, ఎన్టీఆర్ జిల్లా


