కొల్లేరుకు మహర్దశ | Sakshi
Sakshi News home page

కొల్లేరుకు మహర్దశ

Published Sun, Jun 12 2022 5:27 PM

AP Govt Is Taking Steps Towards Clean Kolleru Lake - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: స్వచ్ఛ కొల్లేరు దిశగా సర్కారు అడుగులు వేస్తుంది. కొల్లేరువాసులకు కలగా ఉన్న రెగ్యులేటర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో పనులు చకచకా జరుగుతున్నాయి. ఉప్పుటేరులో మూడు ప్రాంతాల్లో రెగ్యులేటర్లు నిర్మించి ఉప్పునీరు కొల్లేరులో కలవకుండా అడ్డుకట్ట వేయనున్నారు. దీనికి సంబంధించి సాంకేతికపరమైన లాంఛనాలన్నీ పూర్తికాగా టెండర్ల ఆహ్వానానికి రంగం సిద్ధమైంది.  

ఉప్పునీటి ముప్పు తొలగించేలా..  
ఉప్పునీటితో కొల్లేరు సరస్సు కలుషితమవుతోంది. సరస్సుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. దీంతో కొల్లేరుపై రెగ్యులేటర్లు నిర్మించి సరస్సును పరిరక్షించాలనే డిమాండ్‌ సుదీర్ఘకాలంగా ఉంది. 2004లో దివంగత వైఎస్సార్‌ హయాంలో రెగ్యులేటర్ల నిర్మాణంపై దృష్టి పెట్టారు. అయితే ఆయన మరణానంతరం ఈ అంశం అటకెక్కింది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ కొల్లేరు పరిరక్షణపై దృష్టి సారించారు. రెగ్యులేటర్ల నిర్మాణానికి జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా ప్రభుత్వం ఆమోదం తెలిపిది.  

భూగర్భ జలాలు పెంచేలా..  
సముద్ర నీటిమట్టం నుంచి కొల్లేరు ఐదు మీటర్ల ఎత్తులో ఉంది. ఆటుపోట్ల నేపథ్యంలో సముద్రం నీరు కాలువల ద్వారా సరస్సులోకి చేరుతుంది. దీంతో సుమారు 10 మండలాల్లో వేలాది ఎకరాలు  ఉప్పునీటి కయ్యలుగా మారుతున్నాయి. రైతులు సాగుకు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో కొల్లేరుపై మూడుచోట్ల రెగ్యులేటర్లను నిర్మిస్తే ఉప్పు నీటిని కట్టడి చేయడం ద్వారా కొల్లేరుకు 113 కాలువల ద్వారా మంచినీరు చేరుతుంది. తద్వారా భూగర్భ జలాలు పెరగడంతో పాటు స్వచ్ఛ కొల్లేరు సాకారం కానుంది.  

13 నుంచి టెక్నికల్‌ బిడ్‌ 
ఈనెల 13 నుంచి 27 వరకు టెక్నికల్‌ బిడ్‌లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. సాంకేతిక బిడ్‌లను స్వీకరించి 28న టెక్నికల్‌ బిడ్‌ను ఫైనల్‌ చేసి 29న ప్రైజ్‌ బిడ్‌ను ఖరారు చేయనున్నారు. అనంతరం రెండు వారాల్లో మిగిలిన అధికారిక ప్రక్రియ పూర్తి చేసి టెండర్లు కేటాయించనున్నారు.   

రెగ్యులేటర్లు ఎక్కడెక్కడంటే..

     ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలో ఉప్పుటేరుపై 10.560 కిలోమీటర్ల వద్ద రూ.87 కోట్లతో రెగ్యులేటర్‌ నిర్మాణం. 
     మొగల్తూరు మండలం పడతడిక గ్రామంలో 1.400 కిలోమీటరు వద్ద రూ.136.60 కోట్లతో బ్రిడ్జి కమ్‌ లాక్‌ నిర్మాణం.  
     మొగల్తూరు మండలం మోళ్లపర్రు వద్ద 188.40 కోట్లతో బ్రిడ్జి కమ్‌ లాక్‌ నిర్మాణం.  
     ఈ మూడు రెగ్యులేటర్ల నిర్మాణానికి రూ. 412 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.  
     అధికారులు ఖరారు చేసిన డీపీఆర్, ప్రతిపాదనలను గతనెల 23న స్టేట్‌ లెవెల్‌ టెక్నికల్‌ కమిటీ ఆమోదించింది.  
     అనంతరం సిద్ధం చేసిన టెండర్‌ కాపీని జ్యూడి షియరీ ప్రివ్యూకు పంపి అక్కడి అనుమతితో టెండర్ల ప్రక్రియను ఖరారు చేశారు.  

Advertisement
Advertisement