ఎమ్మెల్సీ అభ్యర్థులతో సీఎం జగన్‌ భేటీ.. చేయాల్సింది చేశానంటూ కీలక వ్యాఖ్యలు

AP CM YS Jagan Congratulate YSRCP MLCs Candidates - Sakshi

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ తరఫున స్థానికసంస్థల కోటా సీట్లకు ఎమ్మెల్యే అభ్యర్థులు, గవర్నర్‌ కోటాలో ప్రతిపాదిత వ్యక్తులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. ఎప్పుడూ జరగని విధంగా సామాజిక న్యాయాన్ని చేస్తున్నామని,  దేవుడి దయతో  అది మన పార్టీలో మనం చేయగలుగుతున్నామని, ఈ విషయాన్ని మనం గర్వంగా చెప్పుకోగలమని ఈ సందర్భంగా ఆయన వాళ్లను ఉద్దేశించి పేర్కొన్నారు. 

ఇవాళ మొత్తం 18 మంది పేర్లను ఖరారు చేశాం. వీళ్లలో 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన వాళ్లే ఉన్నారు. మిగిలిన వాళ్లకు నాలుగు సీట్లు ఇచ్చాం. ఇందులో కూడా ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కటి ఇచ్చాం. మనం చేస్తున్న సామాజిక న్యాయం ప్రతి గడపకూ తెలియాలి. ప్రతి నియోజకవర్గంలో చెప్పాలి. ఇంత గొప్ప మార్పు ఎప్పుడూ జరగలేదు అని అభ్యర్థులను ఉద్దేశించి సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

ఎమ్మెల్సీలుగా బాధ్యతలు తీసుకుంటున్నవాళ్లు… పార్టీకోసం ఏం చేయగలుగుతామో? అనే అడుగులు వేయాలి. నేను చేయాల్సింది.. నేను చేశాను. ఇవ్వాల్సింది ఇచ్చాను. కానీ,  పార్టీ పరంగా మీ బాధ్యతను నిర్వర్తించాలని, మీ తరఫు నుంచి కోరుతున్నాను. పదవులు పొందుతున్న వారందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పదవులు ఆశించిన వారు ఇంకా చాలా మంది ఉన్నారు. ఉన్న పదవులు తక్కువ కాబట్టి.. అందర్నీ సంతృప్తి పరచలేం. ఆశావహులందరికీ చెప్పే రీతిలో చెప్పుకుంటూ, వారి కన్విన్స్‌ చేసుకుంటూ పోవాలి అని ఆయన తెలిపారు.

ఇంత పారదర్శకంగా బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారులకు లంచాలకు తావులేకుండా పథకాలు అందిస్తున్నాం. విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో మంచి మార్పులు తెచ్చాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఈరోజు మనం చేసింది ఒక ఎత్తు. పదవులు తీసుకున్న వారు యాక్టివ్‌గా ఉండాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 లాంటి వారు ఒక్కటైన సందర్భంలో మనం కూడా అదే స్థాయిలో మన వాణిని వినిపించాలి అని అభ్యర్థులకు సీఎం జగన్‌ సూచించారాయన.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనే పార్టీని స్థాపించాం.. అధికారంలోకి వచ్చాం. దేవుడి దయవల్ల మంచి పరిపాలన కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో 175కి 175 , వై నాట్‌ అనే రీతిలో పరిపాలన కొనసాగుతోంది. గత ఎన్నికల్లో మెజార్టీ కంటే.. అత్యధిక మెజార్టీ సాధిస్తాం. మరింత మందికి మేలు చేస్తాం. ఈసారి మనం వడ్డీలకు, వడ్డెరలకు అనే కులాలకు ఇచ్చాం. మిగిలిన కులాలకు తదుపరి దఫాలో తప్పకుండా ఇస్తాం అని సీఎం జగన్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top