హామీలను అమలు చేయాలని రాజకీయ పార్టీలను ఆదేశించలేం

కాపు రిజర్వేషన్లపై సీఎం జగన్‌ను ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు అభ్యంతరం
జోగయ్య పిటిషన్‌పై నేడు విచారణకు నిర్ణయం
సాక్షి, అమరావతి: రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలలో ప్రకటించిన హామీలను అమలు చేయాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ మేనిఫెస్టోలో పేర్కొన్న వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఆ హామీని నెరవేర్చడం లేదని, ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యుడిగా పేర్కొంటూ ఆయనను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ముఖ్యమంత్రిని ప్రతివాదిగా తొలగించాలని పిటిషనర్ చేగొండి హరిరామజోగయ్యను ఆదేశించింది.
అందుకు ఆయన తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ అంగీకరించడంతో ఈ వ్యాజ్యానికి నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నత వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యూఎస్) విద్య, ఉపాధి అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తెచ్చిన చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గతంలో చేసిన చట్టాన్ని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. ముఖ్యమంత్రిని ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తింది. నంబర్ కేటాయించేందుకు నిరాకరించింది. రిజిస్ట్రీ అభ్యంతరంపై ఈ వ్యాజ్యం సోమవారం జస్టిస్ రఘునందన్‌రావు ముందు విచారణకు వచ్చింది. హరిరామజోగయ్య తరఫు న్యాయవాది రాధాకృష్ణ వాదనలు వినిపిస్తూ.. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని వైఎస్సార్‌సీపీ తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందన్నారు.
అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని నెరవేర్చడం లేదన్నారు. జీవో జారీ చేసి చేతులు దులుపుకుందన్నారు. అందుకే ముఖ్యమంత్రిని బాధ్యుడిగా చేస్తూ ప్రతివాదిగా చేర్చామని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు. మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాజకీయ పార్టీలను తాము ఆదేశించలేమన్నారు. సీఎంను ప్రతివాదిగా చేర్చడం సరికాదన్నారు. ప్రతివాదుల జాబితా నుంచి సీఎం పేరును తొలగించాలని స్పష్టం చేశారు. ఇందుకు న్యాయవాది రాధాకృష్ణ అంగీకరించడంతో వ్యాజ్యానికి నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ రఘునందన్‌రావు విచారణ జరపనున్నారు.
మరిన్ని వార్తలు :