పోలీసుల అరాచకాలకు ఆ హోటల్‌ అడ్డా! | Andhra Pradesh High Court Fires on Patamata Police Rackets | Sakshi
Sakshi News home page

పోలీసుల అరాచకాలకు ఆ హోటల్‌ అడ్డా!

May 9 2026 4:35 AM | Updated on May 9 2026 4:35 AM

Andhra Pradesh High Court Fires on Patamata Police Rackets

విజయవాడ పటమట పోలీసుల సెటిల్‌మెంట్ల కేంద్రం ‘కార్తికేయ ప్రైడ్‌’

సీబీఐ దర్యాప్తు కోరుతూ 70 ఏళ్ల వృద్ధుడు హైకోర్టులో పిల్‌ 

స్పందించిన హైకోర్టు సీజే ధర్మాసనం.. పోలీస్‌స్టేషన్‌తో పాటు కార్తికేయ ప్రైడ్‌ హోటల్‌ సీసీటీవీ ఫుటేజీని భద్రపరచాలని ఆదేశాలు

సాక్షి, అమరావతి: విజయవాడ పటమట పోలీసులు.. పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని ప్రైవేట్‌ హోటల్‌ ‘కార్తికేయ ప్రైడ్‌’ను అడ్డాగా చేసుకుని దందాలు చేస్తున్నారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ 70 ఏళ్ల వృద్ధుడు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై హైకోర్టు స్పందించింది. అనధికారికంగా హోటల్‌ను పోలీస్‌ స్టేషన్‌గా ఉపయోగిస్తూ వ్యక్తులను ఆ హోటల్‌కి తీసుకెళ్లి నిర్బంధించడం, కొట్టడం, బెదిరించి ఖాళీ స్టాంప్‌ పేపర్లపై సంతకాలు తీసుకోవడం.. సివిల్, ఆస్తి వివాదాల బలవంతపు రాజీలు చేస్తుండటం, చట్ట విరుద్ధంగా కాల్‌ డీటెయిల్‌ రికార్డులు సేకరించడం.. అనుమతి లేకుండా డిజిటల్‌ సర్వైలెన్స్‌ చేస్తుండటం వంటి పిటిషన్‌లోని ఆరోపణలు తీవ్రమైనవని హైకోర్టు స్పష్టం చేసింది. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు పోలీస్‌స్టేషన్, ఆ హోటల్‌ సీసీటీవీ ఫుటేజీల మొత్తాన్ని భద్రపరచాలని పటమట పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

సీనియర్‌ అధికారుల ప్రమేయం 
పల్నాడు జిల్లా, అందుకూరు గ్రామానికి చెందిన కర్నాటి వీరభద్రరావు హైకోర్టులో ఈ పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీజే జస్టిస్‌ లీసా గిల్‌ ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పొన్నేకంటి మల్లికార్జునరావు వాదనలు వినిపిస్తూ కార్తికేయ ప్రైడ్‌ హోటల్‌లో పోలీసుల సెటిల్‌మెంట్లన్నీ కూడా విజయవాడ అదనపు డిప్యూటీ కమిషనర్‌ ఎన్‌బీఎం మురళీకృష్ణ, పటమట సీఐ పవన్‌ల ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు. పిటిషనర్‌ వీరభద్రరావును సైతం పోలీసులు ఇదే రీతిలో కార్తికేయ ప్రైడ్‌ హోటల్‌లో నిర్బంధించి, కొట్టి, తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని తెలిపారు.

వాస్తవాలు తెలియాలంటే పటమట పోలీస్‌స్టేషన్‌తో పాటు హోటల్‌ సీసీటీవీ ఫుటేజీని భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.  పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) తిరుమాను విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ, ఈ పిల్‌కు విచారణార్హత లేదన్నారు. ఇవే అభ్యర్థనలతో పిటిషనర్‌ ఇప్పటికే ఓ పిటిషన్‌ దాఖలు చేశారని తెలిపారు.

పటమట పోలీసులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ పోలీసు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇచ్చారని, వాటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పిటిషనర్‌ ఆరోపణలపై పూర్తి వివరాలు తెప్పించుకుని కోర్టు ముందుంచుతామని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ,  పిటిషనర్‌ మేజి్రస్టేట్‌ ముందు కూడా ఇవే విషయాలను చెప్పారని గుర్తు చేస్తూ..  వాస్తవాలను నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉందని స్పష్టంచేసింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement