సీఆర్డీఏ అధికారులను నిలదీస్తున్న పెదపరిమి రైతులు
నమ్మిన రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వాన్ని ఎలా నమ్మాలని నిలదీత
గతంలో భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదని మండిపాటు
తొలి విడతలో రైతులు పడిన ఇబ్బందులు తాము పడలేమన్న రైతులు
పదేళ్ల క్రితం నిర్దేశించిన 1,200 గజాలనే ఇప్పుడూ ఇస్తామంటే ఎలా?
1,500 గజాలు స్థలం, రుణమాఫీ రూ.3 లక్షలు చెల్లించాలి
బలవంతంగా భూములు తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిక
గ్రామసభలో సీఆర్‌డీఏ అధికారులను నిలదీసిన గుంటూరు జిల్లా పెదపరిమి రైతులు
తాడికొండ: అమరావతి రాజధానిలో రెండో విడత భూ సమీకరణపై రైతులు భగ్గుమన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పెదపరిమి యూనిట్–2లో సీఆర్డీఏ అధికారులు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో భాగంగా రైతులతో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. నమ్మిన రైతులను నట్టేట ముంచిన ఈ ప్రభుత్వాన్ని ఎలా నమ్మాలని నిలదీశారు. గతంలో భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను 12 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు అభివృద్ధి చేసి ఇవ్వలేదని, రెండో విడతలో భూములిచ్చే రైతులకు మూడు నెలల్లో ప్లాట్లు ఎలా ఇస్తారని మండిపడ్డారు. తొలి విడతలో భూములిచ్చిన రైతులు పడినట్టు తాము ఇబ్బందులు పడలేమని తేల్చిచెప్పారు. పదేళ్ల క్రితం రైతులకు ఇచ్చినట్టుగానే 1,200 గజాలు ఇస్తే ఎలా సరిపోతుందని నిలదీశారు.
తమకు 1,500 గజాల స్థలం, అప్పులు తీర్చుకునేందుకు రుణమాఫీ కింద రూ.3 లక్షలు ఇవ్వాలని స్పష్టం చేశారు. పక్కనే ఉన్న వెంకటపాలెం రైతులకు 1,450 గజాలు, మంగళగిరిలో అప్రూవల్ ప్లాట్లకు 1,800 గజాలు ఇస్తున్నప్పుడు తమకు 1,200 గజాలు ఇవ్వడం న్యాయమేనా అని మండిపడ్డారు. తమ భూములు ఇవ్వాలంటే స్పష్టమైన హామీ, సమయ పాలనతో కూడిన అగ్రిమెంట్ చేస్తేనే ఆలోచిస్తామని తేల్చి చెప్పారు. బలవంతంగా తమ భూములు తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌పై అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. గ్రామ కంఠాల పేరుతో కొంతమందికి దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు అలవెన్సులు ఇచ్చినప్పుడు భూములు త్యాగం చేసిన తమకు తాము కోరుకున్న విధంగా ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నల వర్షం కురిపించారు.
తొలి దశలో భూములిచ్చిన రైతులకు న్యాయం చేసిన తరువాతే తమ భూముల జోలికి రావాలని, మరికొందరు రైతులు అభిప్రాయం వ్యక్తం చేయగా.. అసలు భూములిచ్చేది లేదని మరికొందరు స్పష్టం చేశారు. రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని సీఆర్డీఏ అధికారులు తెలిపారు. గ్రామస్తులకు, మీడియాకు ముందస్తు సమాచారం లేకుండా గుట్టుచప్పుడు కాకుండా గ్రామ సభలు నిర్వహించడంపై పలువురు రైతులు మండిపడ్డారు. గ్రామసభలు జరిగే రైతులకు మాత్రం ముందురోజు సమాచారం ఇస్తుండటంతో రైతులంతా హాజరు కాలేని పరిస్థితి నెలకొంటోంది. కనీసం రెండు రోజుల ముందైనా సమాచారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.


