అమ్మో.. అమరరాజా! రెండున్నర ఎకరాల శ్మశానాన్నీ వదల్లేదు

The Amaraja Factories In Chittoor Pollute The Environment - Sakshi

సాక్షి,తిరుపతి: అమరరాజా ఫ్యాక్టరీల నుంచి వచ్చే విషవాయువులు, జల కాలుష్యంపై సదరు యాజమాన్యం నిర్లక్ష్యం పరాకాష్టకు చేరుతోంది. దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అమరరాజా ఫ్యాక్టరీలో లెడ్‌ శాతం, ఇతర కాలుష్యం ప్రమాదకరంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి తోపాటు హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఎన్విరాన్మెంట్‌ ప్రొటెక్షన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఈపీటీఆర్‌ఐ) నివేదిక స్పష్టం చేసిన విషయాన్ని హైకోర్టు ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఇలా స్వయంగా ప్రభుత్వంతో పాటు హైకోర్టు కూడా కంపెనీ తీరుపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసినప్పటికీ జిల్లాకు చెందిన కొంతమంది అధికారులు మాత్రం నిబంధనల మేరకు ఆయా ఫ్యాక్టరీల జోలికి వెళ్లేందుకు కూడా సాహసించడం లేదు. ఫ్యాక్టరీలకు వెళ్లడం మాట అటుంచి.. కనీసం సదరు ఫ్యాక్టరీల గురించి మాట్లాడేందుకు కూడా ముందుకు రాకపోవడం గమనార్హం. 

అధికారుల మూగనోము 
దాదాపు ఎనిమిది ఎకరాల అటవీశాఖ భూములను కైంకర్యం చేసి ఫ్యాక్టరీ ప్రాంగణంలోకి కలిపేసుకుని ప్రహరీ గోడ కట్టుకున్న వైనంపై ఫారెస్ట్‌ అధికారులు బహిరంగంగా మాట్లాడేందుకు నిరాకరించారు. ఓ అధికారిని అడిగితే పై అధికారిని అడగమని.. ఆయన్ని అడిగితే ఈయన్ని అడగమని ఇలా కనీస సమాచారం చెప్పేందుకు కూడా ప్రయాసపడ్డారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (పీసీబీ) అధికారులు కూడా అదేమాదిరిగానే వ్యవహరిస్తున్నారు. ఫ్యాక్టరీ కాలుష్యంపై ఉన్నతాధికారులు ఏకంగా హైకోర్టును ఆశ్రయించగా.. ఇక్కడ కొంతమంది అధికారులు మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్‌ అవుతున్నారు.

ఎన్విరాన్‌మెంటల్‌ ఆడిటింగ్‌తో  కాలుష్యపు శాతం ఎంత ఉందో విచారించేందుకు ప్రభుత్వం తరఫున ఈ నెల 3వ తేదీన వచ్చిన చెన్నై ఐఐటీ నిపుణులతో పాటు పీసీబీ అధికారులను కంపెనీ యాజమాన్యం లోపలికి రానీయకుండా అడ్డుకుంటే... కేసు పెట్టేందుకు 16వ తేదీ వరకు పోలీసులను ఆశ్రయించడానికి ఆలోచించారంటేనే అసలు విషయం అర్థం చేసుకోవచ్చు. ఇక పోలీసులూ తక్కువేం కాదు.. ప్రభుత్వ అధికారులను అడ్డుకుని విధులకు ఆటంకం కలిగిస్తే.. చాలా సీరియస్‌గా స్పందించి బలమైన కేసులు పెడతారు. కానీ సదరు ఫ్యాక్టరీ అధికారిపై మాత్రం కేవలం స్టేషన్‌ బెయిల్‌ వచ్చే కేసు పెట్టారంటేనే ఖాకీల సీరియస్‌నెస్‌ అర్థమవుతోంది. రెవెన్యూ అధికారులు కూడా ఇదే గాటన ఉన్నారనే చెప్పాలి. అక్కడి భూముల స్థితి, చెరువుల పరిస్థితి గురించి ఇన్నాళ్లూ కనీసం ఆరా తీయలేదంటేనే .. అటువైపు కన్నెత్తి చూడని నిర్వాకం బయటపడుతోంది.

శ్మశానాన్నీ వదల్లేదు  
అమరరాజా ఫ్యాక్టరీ చుట్టుపక్కల చెరువులు, అటవీభూములు, స్థలాలు.. పొలాలు మింగేసిన అమరరాజా ఫ్యాక్టరీల యాజమాన్యం చివరికి శ్మశానాన్ని కూడా వదల్లేదు.. ఫ్యాక్టరీ గేటు ఎదురుగా ఉన్న రెండున్నర ఎకరాల శ్మశాన వాటిక భూములను కూడా కబ్జా చేసింది. కంపెనీ లారీల పార్కింగ్‌కు వాడుకుంటోంది. అమరరాజా కబ్జాల పర్వం పరాకాష్టకు ఇంతకు మించి చెప్పేదేముంది..?

గళం విప్పుతున్న స్థానికులు 
అధికారులే సదరు కంపెనీ అన్యాయా లు, అక్రమాలపై చూసీచూడనట్టు వ్యవహరిస్తుంటే.. ఇక అక్కడి సామాన్య ప్రజలు, ఆయా కంపెనీల్లో పనిచేసే కా ర్మికుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ‘అంత పెద్దపెద్ద వాళ్లే ఏమీ మాట్లాడడం లేదు.. మనకెందుకొచ్చిన గొడవ’ అని చాలామంది ఫ్యాక్టరీ ప్రస్తావనే ఎత్తడం లేదు. ప్రాణాల మీదకు వస్తున్నా సరే.. ఉన్నంతకాలంగా అలానే ఉందాం.. అని రాజీపడే ధోరణే చాలామందిలో కనిపిస్తోంది. అయితే కొంతమంది గ్రామస్తులు మాత్రం ఇప్పుడిప్పుడే తమ వాదనలను బలంగా వినిపిస్తున్నారు.

తారకరామానగర్‌కు చెందిన కార్పెంట ర్‌ ప్రసాద్, పదో తరగతి చదువుతున్న పూజ, గతంలో కంపెనీలో పనిచేసి మానివేసిన కేఈ చలపతి, అక్కడే 13 ఏళ్లుగా నివసిస్తున్న మహిళ లోకేశ్వరీరెడ్డి .. ఇలా చాలామంది కంపెనీ వెదజల్లుతున్న కాలుష్యంపై కొద్దిరోజులుగా గళం విప్పుతున్నారు. భూగర్భజలాల కాలుష్యం, విషవాయువులతో అంతుచిక్కని రోగాలపాలవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top