ISRO Launching New Rocket SSLV-D2 Today, Know Interesting Things About SSLV-D2 Launch - Sakshi
Sakshi News home page

SSLV-D2 Rocket Launch: ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ2 ప్రయోగానికి సర్వం సిద్ధం

Feb 10 2023 5:09 AM | Updated on Feb 10 2023 8:36 AM

All set for SSLV-D2 satellite launch into orbit - Sakshi

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భాతర అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సూళ్లూరుపేట సమీపంలో ఉన్న సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ2)ను శుక్రవారం ఉదయం 9.18 గంటలకు ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ ప్రయోగం ద్వారా ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్, జానుస్‌–1, ఆజాదీ శాట్‌–2 అనే మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు.

ఈ ప్రయోగానికి గురువారం అర్ధ­రాత్రి దాటిన తర్వాత (తెల్లవారితే శుక్రవారం) 2.18 గంటలకు కౌంట్‌ డౌన్‌ను ప్రారంభిస్తారు. ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ పర్యవేక్షణలో ఎంఆర్‌ఆర్‌ కమిటీ చైర్మన్‌ ఈఎస్‌ పద్మకుమార్‌ ఆధ్వర్యాన మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ సమావేశం గురువారం ఉదయం నిర్వహించారు.

అనంతరం లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డ్‌ చైర్మన్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఆధ్వర్యంలో మరో సమావేశాన్ని నిర్వహించి కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాలను అధికారికంగా నిర్ణయించారు. ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ1 పేరుతో గత ఏడాదిలో చేసిన మొ­దటి ప్రయోగం విఫలం కావడంతో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.  

రాకెట్‌ వివరాలు... ప్రయోగం ఇలా...  
ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ2 రాకెట్‌ 34 మీటర్లు పొడవు, రెండు మీటర్లు వెడల్పు, 119 టన్నుల బరువు కలిగి ఉంది. దీనిని నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. ఈ రాకెట్‌ మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 124 సెకన్లలో పూర్తిచేస్తారు. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 384.2 సెకన్లలో, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 674.9 సెకన్లలో పూర్తి చేయనున్నారు. నాలుగో దశలో మాత్రమే 0.05 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో 785.1 సెకన్లలో పూర్తి చేస్తారు.

మొదటిగా 156.3 కేజీల బరువు కలిగిన ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌(ఈవోఎస్‌–07)ను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఆంటారిస్‌–యూఎస్‌ఏకు చెందిన 10.2 కేజీల బరువు కలిగిన జానుస్‌–1 అనే ఉపగ్రహాన్ని 880.1 సెకన్లలో, అనంతరం 8.7 కేజీల బరువు కలిగిన ఆజాదీ శాట్‌–2 అనే ఉపగ్రహాన్ని 900.1 సెకన్లలో అంటే 15 నిమిషాలకు భూమికి 450 కిలోమీటర్లు ఎత్తులోని లియో ఆర్బిట్‌ (సూర్యునికి సమకాలిక కక్ష్య)లోకి ప్రవేశపెట్టడంతో ప్రయోగం పూర్తిచేసే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు డిజైన్‌ చేశారు. ఇది షార్‌ నుంచి 84వ ప్రయోగం కాగా, ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డి1 సిరీస్‌లో రెండోది కావడం విశేషం.  

ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ2కు ప్రత్యేక పూజలు 
తిరుమల: ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డి2కు తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఇస్రో శాస్త్రవేత్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇస్రో డైరెక్టర్‌ ఏకే పాత్ర, సభ్యులు తిరుమల శ్రీవారి పాదాల చెంత ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డి2 నమూనాను ఉంచి పూజలు చేశారు. ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ గురువారం సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని రాకెట్‌ నమూనాకు పూజలు నిర్వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement