ఆయువు తగ్గిస్తున్న వాయువు

Air pollution in the country is in danger - Sakshi

తగ్గిపోతున్న ప్రజల సగటు ఆయుష్షు  

5.20 ఏళ్ల జీవితకాలాన్ని కోల్పోనున్న భారతీయులు 

ప్రపంచంలోనే రెండోస్థానంలో భారత్‌ 

సాక్షి, అమరావతి: దేశంలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. భారతీయుల ఆయుష్షును తగ్గించివేస్తోంది. ఏకంగా 5.20 ఏళ్ల సగటు జీవితకాలాన్ని హరించేస్తుందని షికాగో యూనివర్సిటీ తాజా అధ్యయనం వెల్లడించింది. 1998 నుంచి 2018 వరకు ప్రపంచవ్యాప్తంగా పెరిగిన వాయు కాలుష్యంపై ‘ఎయిర్‌ క్వాలిటీ లైఫ్‌ ఇండెక్స్‌’ పేరిట నిర్వహించిన అధ్యయనాన్ని ఆ యూనివర్సిటీ ఇటీవల విడుదల చేసింది. దీని తీవ్రతతో ప్రజలు జీవితకాలాన్ని కోల్పోతున్న దేశాల జాబితాలో.. ప్రపంచంలో బంగ్లాదేశ్‌ మొదటిస్థానంలో ఉండగా భారత్‌ రెండో స్థానంలో ఉందని వెల్లడించింది. 

► 1998–2018 మధ్యలో భారతీయులు సగటున 1.80 ఏళ్ల జీవితకాలాన్ని కోల్పోయారు.  
► 2018 నాటి వాయుకాలుష్యం కొనసాగితే.. రాబోయే ఏళ్లలో సగటు భారతీయుని జీవిత కాలం 5.20 ఏళ్లు తగ్గిపోతుంది.  దేశంలో 84 శాతం మంది నిర్దేశించిన వాయు కాలుష్య ప్రమాణాల కంటే దిగజారిన పరిస్థితుల్లో జీవిస్తున్నారు.  
► డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటే భారత్‌ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.  
► దక్షిణ భారతం కంటే ఉత్తర భారతంలో వాయు కాలుష్యం తీవ్రత చాలా ఎక్కువుగా ఉంది. అక్కడ 24.80 కోట్ల మంది భారతీయుల సగటు జీవితకాలం 8 ఏళ్లు హరించుకుపోతుంది.  
► దేశంలో ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నో వాసులు అత్యధికంగా ఆయుఃప్రమాణాన్ని నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుత వాయుకాలుష్యం కొనసాగితే ఇక్కడి వాసులు సగటున 10.30 ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోతారు.  
► దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం.. సగటున 9.20ఏళ్లు, భారత ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం అయితే 6.50 ఏళ్లు జీవితకాలాన్ని కోల్పోతారు.  
► దక్షిణ భారత దేశంలో తమిళనాడు మొదటిస్థానంలో ఉండగా తరువాత స్థానాల్లో వరుసగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ ఉన్నాయి. 
► లాక్‌డౌన్‌ కారణంగా వాయు కాలుష్యం చాలావరకు తగ్గింది. కానీ ఇది తాత్కాలికమే. మళ్లీ పూర్తిస్థాయిలో ఆర్థిక, పారిశ్రామిక కార్యకలాపాలు కొనసాగితే వాయు కాలుష్యం 2018 నాటి స్థాయికి చేరుకుంటుంది. 

పట్టణాల్లో హరితవనాలు పెంచడమే పరిష్కారం
‘వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. ఇందుకోసం మన రాష్ట్రంలో అడవులు, మడ అడవుల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. అదే విధంగా పట్టణాలు, నగరాల్లో పెద్ద ఎత్తున హరితవనాలను పెంచాలి. యూరోపియన్‌ దేశాల్లో చేసినట్టుగా నగరాలు, పట్టణాల శివారు ప్రాంతాల్లోని భూముల్లో  హరితవనాలను పెంచడం ద్వారా వాయు కాలుష్యాన్ని చాలావరకూ తగ్గించవచ్చు’. 
– మనోజ్‌ నలనాగుల, వాతావరణ శాస్త్రవేత్త 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top