‘జగనన్న తోడు’కు 8.9 లక్షల మంది గుర్తింపు

8 Lakh Above Applications Recieved For Jagananna Thodu In AP - Sakshi

వీధుల్లో చిరు వ్యాపారులకు రూ.10 వేలు చొప్పున వడ్డీ లేని రుణాలు

ఇప్పటిదాకా బ్యాంకులకు సమర్పించిన దరఖాస్తులు 7 లక్షలు

4.3 లక్షల మందికి రూ.431 కోట్లు వడ్డీ లేని రుణం మంజూరు

మిగతా వారందరికీ మంజూరు చేయించేందుకు చర్యలు

దరఖాస్తు దారులకు గుర్తింపు కార్డులు జారీ

వచ్చే నెల 6వ తేదీన పథకాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్‌ 

సాక్షి, అమరావతి : ‘జగనన్న తోడు’ పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసే ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. వీధుల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటికి అవసరమైన డాక్యుమెంట్లను జత చేసి బ్యాంకులకు పంపించే ప్రక్రియను గ్రామ, వార్డు వలంటీర్లు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు 8.9 లక్షల మంది చిరు వ్యాపారులను వడ్డీ లేని రుణాల కోసం లబ్ధిదారులుగా గుర్తించగా, వీరిలో 7 లక్షల మంది దరఖాస్తులను బ్యాంకులకు సమర్పించారు.

4.3 లక్షల మంది చిరు వ్యాపారులకు పది వేల రూపాయల చొప్పున రూ.431 కోట్లను బ్యాంకులు వడ్డీ లేని రుణంగా మంజూరు చేశాయి. రుణానికి అర్హులైన చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. బ్యాంకులకు సమర్పించిన మిగతా దరఖాస్తులకు కూడా వీలైనంత త్వరగా వడ్డీలేని రుణాలు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌ జైన్‌ తెలిపారు. ఈ పథకాన్ని నవంబర్‌ 6వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. 

వీళ్లందరూ అర్హులే.. 
- గ్రామాలు, పట్టణాల్లో సుమారు 5 అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పు స్థలంలో, అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకుని ఉండాలి.
- రోడ్డు పక్కన, పుట్‌పాత్‌ల పైన, ప్రజా, ప్రైవేట్‌ స్థలాల్లో తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకుంటున్న వారు,  తల మీద గంపలో వస్తువులు మోస్తూ అమ్ముకునే వారూ అర్హులే.
- సైకిల్‌, మోటార్‌ సైకిల్‌, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునే వారు.
- చిరు వ్యాపారి వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. కుటుంబ ఆదాయం గ్రామాల్లో నెలకు రూ.10 వేల లోపు, పట్టణాల్లో రూ.12 వేల లోపు కలిగి ఉండాలి.
- ఆధార్, ఓటరు కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఇతర గుర్తింపు కార్డు కలిగి ఉండాలి.
- అర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల నోటీసు బోర్డుల్లో ఉంచి సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. ఇప్పటి వరకు బ్యాంకు అకౌంట్‌ లేని వారికి కొత్తగా పొదుపు అకౌంట్‌ ప్రారంభించేలా వలంటీర్లే తోడ్పాటు అందిస్తారు.

జగనన్న తోడు ఎందుకంటే..
ఎండనక, వాననక ప్రతి రోజు వీధుల్లో చిల్లర వ్యాపారాలు చేస్తే గానీ ఆ రోజు గడవని వారిని గుర్తించి ఆదుకోవాలని ఆలోచన చేసిన తొలి సర్కారు వైఎస్‌ఆర్‌సీపీనే. అధిక వడ్డీకి అప్పు తెచ్చుకుని వీధుల్లో చిల్లర వ్యాపారం చేసుకునే వారి కష్టాన్ని తన పాదయాత్రలో స్వయంగా చూసిన ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌.. వారికి వడ్డీ లేకుండా రూ.పది వేల రుణం ఇస్తానని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ‘జగనన్న తోడు’ పథకానికి శ్రీకారం చుట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top