అనంతపురం: ఇంటికో ఉద్యోగం.. లేదా నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు హామీ ఏమైందంటూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి నిలదీశారు. అలవికాని హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను దగా చేయడం పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. నగరంలోని హెచ్చెల్సీ కాలనీలో గల వైఎస్సార్‌సీపీ జిల్లా నూతన కార్యాలయంలో అనంత మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 23 నెలల్లోనే రికార్డు స్థాయిలో రూ.3.61 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. ఆ డబ్బు ఎక్కడ ఖర్చు చేశారో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. ప్రభుత్వ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రూ.3.32 లక్షల కోట్లు అప్పు చేస్తే రూ.10 లక్షల కోట్లు అప్పు చేశారంటూ దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు డీబీటీ ద్వారానే రూ.2.73 లక్షల కోట్లు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. నాన్ డీబీటీతో కలుపుకుంటే రూ.4.58 లక్షల కోట్లు ప్రజలకు లబ్ధి కలిగిందన్నారు. చంద్రబాబు ఎన్నికల హామీ సూపర్ సిక్స్‌లోని నిరుద్యోగ భృతి, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్న హామీలు అమలు చేయకుండా దగా చేశారని మండిపడ్డారు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో పేదలకు ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందకుండా పోయాయన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు కళాశాలల్లో సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు ఇబ్బందులు పెడుతున్నాయన్నారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం పక్కనపెట్టి రెడ్‌బుక్ అమలుతో అరాచక పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలు బయటకు రాకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్నా జిల్లాలో రైతుల సమస్యలపై ప్రజాప్రతినిధులు సమీక్ష నిర్వహించడానికి కూడా తీరిక లేకపోయిందన్నారు.
హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేయాలి
హంద్రీ–నీవా కాలువను 11 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి అనుగుణంగా వెడల్పు చేయాలని అనంత డిమాండ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో 780 అడుగుల నుంచే రోజుకు 7 టీఎంసీల నీటిని తెలంగాణ తీసుకెళ్తోందన్నారు. 11 వేల క్యూసెక్కులతో హంద్రీ–నీవాను విస్తరిస్తే 40 రోజుల్లో 40 టీఎంసీలను తీసుకెళ్లే అవకాశం ఏపీకి ఉంటుందన్నారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని, జిల్లా కేంద్రం అనంతపురంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అమరావతి ఓ క్రెడిట్ కార్డు
రాష్ట్రంలో ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చిన సంపదనంతా ప్రభుత్వం అమరావతికి కేటాయిస్తోందని అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు. అమరావతి ప్రాంతం చంద్రబాబుకు క్రెడిట్ కార్డుగా మారిందని విమర్శించారు. 2014 నుంచి 2019 వరకు తాత్కాలిక సచివాలయం, హైకోర్టు పేరుతో నిధులు దోపిడీ చేశారని, ఇప్పుడు కూడా అమరావతిలో అభివృద్ధి పేరుతో దోపిడీ కొనసాగుతోందన్నారు.
పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
అనంతపురం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అనంత డిమాండ్ చేశారు. జిల్లాలో ఎండిపోతున్న పంటలకు రక్షక తడులు అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 70 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, బాధిత కుటుంబాలకు రూ.7 లక్షల ఆర్థికసాయం అందించాలనిడిమాండ్ చేశారు.
అనంతపురం అభివృద్ధికి సహకారం ఏదీ?
వైఎస్సార్‌సీపీ హయాంలో అనంతపురం నగరంలో రూ.310 కోట్లతో పంగల్ రోడ్డు నుంచి బళ్లారి బైపాస్ వరకు నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ చేపట్టినట్లు అనంత వెంకటామిరెడ్డి తెలిపారు. ఫ్లై ఓవర్, రోడ్డు పనులు పూర్తి చేశామన్నారు. ఇందులో భాగంగా టవర్ క్లాక్ వద్ద సర్వీస్ రోడ్డు, సప్తగిరి సర్కిల్ అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.40 కోట్లు మంజూరు అయ్యేలా కృషి చేశామన్నారు. ఎన్నికల తర్వాత సప్తగిరి సర్కిల్ అభివృద్ధి పనులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. రెండేళ్లయినా పట్టించుకునే వారే లేరన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం మంజూరు చేసిన నిధులు వెనక్కువెళ్లిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు.
ఖరీఫ్ సాగు అంచనా 3,43,399 హెక్టార్లు
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ –2026కు సంబంధించి పంటల సాగు అంచనాలు అధికారికంగా ప్రకటించారు. ‘ముంగారు’ వ్యవసాయం అత్యంత కీలకం. వర్షాధారంగా మెట్ట వ్యవసాయం అధికంగా ఉన్న జిల్లాలో లక్షల హెక్టార్లలో సాగు చేసే పంటలు నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలతోనే పండటం.. ఎండటం జరుగుతోంది. ఈసారి సూపర్ ‘ఎల్–నినో’ అంటూ భయపెడుతుండటంతో సాగు అంచనాలు ఎలా ఉంటాయనే దానిపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. గత ఐదేళ్ల ఖరీఫ్‌లో సాగులోకి వచ్చిన పంటల విస్తీర్ణం ఆధారంగా ప్రణాళికశాఖ, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రస్తుత ఖరీఫ్ పంటల సాగు అంచనాలు సిద్ధం చేశారు. ఈసారి అన్ని రకాల వ్యవసాయ పంటలు 3,43,399 హెక్టార్లు (8,58,497 ఎకరాలు)గా గుర్తించారు. అందులో ప్రధానపంట వేరుశనగ 1,47,382 హెక్టార్లు ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో కంది పంట 78,274 హెక్టార్లు, పత్తి 42,119 హెక్టార్లు, మొక్కజొన్న 21,659 హెక్టార్లు, ఆముదం 17,490 హెక్టార్లుగా అంచనా వేశారు. నీటి వసతి కింద 22,868 హెక్టార్లలో వరి నాట్లు వేసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇలా ఐదు ప్రధాన పంటలతో పాటు జొన్న, సజ్జ, రాగి, కొర్ర, పెసర, ఉలవ, అలసంద, మినుము, సోయాబీన్, పొద్దుతిరుగుడు సహా 20 నుంచి 22 రకాల పంటలు 3.43 హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి రావచ్చని అంచనా వేశారు.
గతేడాది తగ్గిన వేరుశనగ, పత్తి
గత ఖరీఫ్–2025లో సకాలంలో విత్తనం ఇవ్వకపోవడం, జూన్, జూలైలో సరైన వర్షాలు పడకపోవడంతో వేరుశనగ 1.82 లక్షల హెక్టార్లకు గాను 90 వేల హెక్టార్లకే పరిమితమైంది. అలాగే పత్తి కూడా 44 వేల హెక్టార్లకు గాను 29 వేల హెక్టార్లకు తగ్గిపోయింది. వీటి స్థానంలో కంది పంట 55 వేల హెక్టార్లు అంచనా వేయగా.. ఏకంగా 1.34 లక్షల హెక్టార్లకు ఎగబాకింది. మొక్కజొన్న కూడా 14 వేల హెక్టార్లు అంచనా వేయగా 42 వేల హెక్టార్లలో సాగు చేశారు. ఇలా గతేడాది పంట సాగు అంచనాలు పూర్తీగా తారుమారయ్యాయి. మొత్తం మీద గతేడాది 3.43 లక్షల హెక్టార్లకు గానూ 3.57 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చినట్లు ఈ–క్రాప్ నివేదిక వెల్లడి చేస్తోంది. 30 సంవత్సరాల జిల్లా చరిత్రలో తొలిసారిగా ప్రధానపంట వేరుశనగను అధిగమించి కంది మొదటి స్థానం ఆక్రమించడం గమనార్హం.
నైరుతిపై ఆశలు
జూన్ ఒకటి నుంచి అధికారికంగా ఖరీఫ్ (ముంగారు) మొదలు కానుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఖరీఫ్ సీజన్‌గా పరిగణిస్తారు. జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం 512.4 మి.మీ కాగా అందులో ప్రధానంగా ఖరీఫ్ నాలుగు నెలల కాలంలో 319.7 మి.మీ నమోదు కావాలి. జూన్‌లో 61 మి.మీ, జూలైలో 63.9 మి.మీ, ఆగస్టులో 83.8 మి.మీ, సెప్టెంబర్‌లో 110.9 మి.మీ సాధారణ వర్షపాతంగా నిర్ధారించారు. సమయం దగ్గర పడుతున్నా ఇటీవల అక్కడక్కడ నాలుగైదు మండలాలు మినహా ఇంకా తొలకర్లు పలకరించడం లేదు. ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. జూన్‌లో ప్రవేశించే నైరుతి రుతుపవనాల వల్ల కురిసే వర్షాలను బట్టి పంటల సాగు సరళి తెలుస్తుంది. అయితే ఈసారి సూపర్ ఎల్–నినో వల్ల రుతుపవనాలు బలహీనపడి పెద్దగా వర్షాలు పడకపోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
● మరోపక్క విత్తన వేరుశనగ, కంది, పెసలు, అలసంద, కొర్ర, రాగులు తదితర రాయితీ విత్తనాలపై ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
23 నెలల్లో రూ.3.61 లక్షల కోట్ల అప్పులతో ఏపీ రికార్డు
ఆరోగ్యశ్రీని నీరుగార్చారు.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ పెట్టారు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత
ప్రధానపంట వేరుశనగ 1.47 లక్షల హెక్టార్లకే పరిమితం
78 వేల హెక్టార్లకు పెరిగిన కంది, 42 వేల హెక్టార్లు పత్తి


