‘రాష్ట్రంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు సత్యసాయిబాబా రూ.కోట్లు వెచ్చించి తాగునీటి పథకాలు ఏర్పాటు చేశారు. ఆ పథకాల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ఆయనకు మాటిచ్చాను. పంచాయతీ రాజ్ శాఖ ఈ విషయంలో సమన్వయంతో వ్యవహరించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.’ ఇవీ ఈ నెల 8వ తేదీన అమరావతిలో కలెక్టర్ల సమీక్షలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.
కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో ట్యాంకరు వద్ద నీటిని పట్టుకుంటున్న దృశ్యం
కళ్యాణదుర్గం: గ్రామీణ ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. సత్యసాయి రక్షిత తాగునీటి పథకం కార్మికులు వేతనాల కోసం సమ్మెబాట పట్టడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తాగునీటికి కటకటలాడాల్సిన పరిస్థితి నెలకొంది. సుదూర ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు ప్రైవేటు ట్యాంకర్ల నుంచి బిందె రూ.10 నుంచి రూ.12 దాకా వెచ్చించి దాహం తీర్చుకుంటున్నారు.
● ఫ్లోరైడ్ సమస్య, నీటి కొరతతో పల్లె ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన భగవాన్ సత్యసాయిబాబా సేవా కార్యక్రమాల్లో భాగంగా బృహత్తర పథకానికి రూపకల్పన చేశారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా శ్రీసత్యసాయి రక్షిత తాగునీటి పథకం 1995లో ప్రవేశపెట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారో అక్కడి వరకు భారీ పైపులైన్ల ద్వారా నీటి సరఫరా ప్రారంభించారు. అప్పటి నుంచి గ్రామీణులకు శుద్ధమైన తాగునీరు అందుతోంది. ఇందులో భాగంగా అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వెయ్యి గ్రామాలకు సత్యసాయి తాగునీటి పథకం ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. ఈ పథకం కింద 550 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ పథకం నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. 1996 నుంచి రాష్ట్ర బడ్జెట్‌లో పథకం నిర్వహణ – కార్మికుల కూలీలకు సంబంధించి నిధులు కేటాయిస్తున్నారు. సాఫీగా సాగుతున్న పథకానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కష్టాలు మొదలయ్యాయి. 2025–206 ఆర్థిక సంవత్సరంలో పథకానికి రూ.35 కోట్ల నిధులు అవసరమైతే ప్రభుత్వం రూ.13.7 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంతో కార్మికుల వేతనాలకు ఆటంకాలు మొదలయ్యాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026–2027లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఐదు నెలలుగా కార్మికులకు వేతనాలు అందలేదు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియక చేతిబదులు తెచ్చుకునేవారు కొందరైతే.. వడ్డీకి తెచ్చుకునేవారు మరికొందరు. పిల్లల చదువుల ఖర్చులకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
యంత్ర సామగ్రి కొనుగోలుకూ కష్టమే
తాగునీటి పథకం నిర్వహణలో భాగంగా అవసరమైన యంత్ర సామగ్రి సైతం కార్మికులకు భారంగా మారింది. ముఖ్యంగా యంత్ర సామగ్రి, రవాణా ఖర్చు, క్లోరిన్, బ్లీచింగ్, పౌడర్, పంప్‌లకు అవసరమయ్యే ఆయిల్స్, గ్రీజ్‌లు, జాయింట్ బోల్ట్ అండ్ నట్స్ వంటి పలు కన్జూమబుల్ మెటీరియ్‌కు, రిపేరీ ఖర్చులకు కూడా భారంగా ఉండే పరిస్థతి ఏర్పడింది.
రేపు పుట్టపర్తికి చంద్రబాబు రాక
పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ నిర్మాణం కోసం భూమి పూజ చేయడానికి ఈ నెల 15న సీఎం చంద్రబాబు రానున్నారు. ఈ నేపథ్యంలో శ్రీసత్యసాయిబాబా తాగునీటి పథకం కార్మికుల వేతన బకాయిలకు ఏమైనా మోక్షం లభిస్తుందేమోనన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రజలు వేసవిలో తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో సీఎం తాగునీటి పథకంపై కరుణిస్తారో లేదో వేచి చూడాల్సిందే.
అరెస్టుల పేరుతో భయపెడుతున్నారు
అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు కార్మికులతో చర్చలు జరిపారు. రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెబుతున్నారు కానీ కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదు. కార్మికులను అరెస్టుల పేరుతో భయపెట్టే కుట్రలు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లకు కూడా అరకొర నిధులు ఇవ్వడంతో.. వాటిని వారే వాడుకుంటున్నారు. ప్రజలకు నీళ్లు ఉచితంగా ఇవ్వడంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. విద్యుత్ బిల్లులు కట్టడం లేదని విద్యుత్ శాఖ వాళ్లు అంటారు. ఇక పంచాయతీ రాజ్ శాఖ నుంచి పంచాయతీలకు నిధులు రావడం లేదు. పంచాయతీలకు నిధులు కేటాయిస్తే ఎలాంటి సమస్యా ఉండదు.
– గోవిందు, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు, అనంతపురం
‘సత్యసాయి’ కార్మికులకు 5 నెలలుగా అందని వేతనాలు
ఈ ఏడాది బడ్జెట్‌లో నిధుల కేటాయింపు శూన్యం
1000 గ్రామాలకు వారం రోజులుగా నీటి సరఫరా బంద్
చంద్రబాబు పర్యటనతోనైనా సమస్యకు పరిష్కారం చూపేరా?


