బతుకు బరువు | - | Sakshi
Sakshi News home page

బతుకు బరువు

May 14 2026 12:31 AM | Updated on May 14 2026 12:31 AM

తెర మరుగు..
గతంలో ఓ వెలుగు వెలిగిన సినిమా థియేటర్లు ఓటీటీ దెబ్బకు మూతపడుతున్నాయి. సినిమా విడుదలైన మూడు, నాలుగు వారాల్లోనే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లపైకి అందుబాటులోకి వస్తుండడంతో థియేటర్‌కు వెళ్లేవారు కరువయ్యారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా థియేటర్లు మూత పడుతున్నాయి. ఫలితంగా కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. థియేటర్‌ కాస్త ఓ తియ్యని జ్ఞాపకంగా మిగలనుంది.

సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వారికి మా కష్టనష్టాలు తెలుస్తాయని భావించాం. కానీ డిప్యూటీ సీఎం వపన్‌కల్యాణ్‌ మా గురించి కనీసంగానూ స్పందించడం లేదు. పైరసీపై ప్రభుత్వ నియంత్రణ లేదు. దీంతో సినీ పరిశ్రమ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. వారానికి శ్యాటిలైట్‌ హక్కుల కోసం రూ.13 వేలు కట్టాలి. కానీ రోజుకు వెయ్యి రూపాయల ఆదాయం కూడా ఉండడం లేదు.

– ఎర్రిస్వామి గౌడ్‌,

మేనేజర్‌, నీలిమా థియేటర్‌

అనంతపురం కల్చరల్‌: కొత్త సినిమా విడుదలైతే థియేటర్ల వద్ద సందడి అంతా.. ఇంతా కాదు. అలాగే థియేటర్లలో పనిచేసే సిబ్బందికీ అంతే క్రేజ్‌ ఉండేది. టికెట్ల కోసం అభిమానులు పోటీ పడేవారు. ప్రస్తుతం పరిస్థితి తిరగబడింది. సినిమా విడుదలైన 15 రోజుల్లోనే సెల్‌ఫోన్లలో ప్రత్యక్షమవుతోంది. దీనికి తోడు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే బలమైన కథలు, భారీ చిత్రాలూ రావడం లేదు. అరకొర సినిమాలు కాస్త జనాదరణ పొందినా మల్టీప్లెక్స్‌లు, సింగిల్‌ స్క్రీన్స్‌లో టికెట్‌, తినుబండారాల ఖర్చులు సామాన్యుడికి భారం కావడంతో థియేటర్లకు వెళ్లేవారు కరువయ్యారు. దీంతో థియేటర్ల నిర్వాహకులకు విద్యుత్‌ బిల్లులు, సిబ్బంది జీతాలు, థియేటర్ల లీజు భారంగా మారాయి.

15 రోజులుగా తెర లేవలేదు

ప్రతి థియేటర్‌లో కనీసం 300 నుంచి 500 సీటింగ్‌ కెపాసిటీ ఉంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 74 థియేటర్లు ఉండగా, ప్రేక్షకాదరణ లేకపోవడంతో చాలా వాటిలో సినిమాలు ఆడడం లేదు. కొన్నింటిని యజమానులు మూతేశారు. ప్రస్తుతం అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో కేవలం 50 థియేటర్లు మిగిలుండగా, వీటిల్లోనూ ఎప్పుడో ఒకసారి మాత్రమే సినిమాలు ఆడిస్తున్నారు. అనంతపురంలోని శ్రీకంఠం, రఘువీరా, నీలం, కృష్ణా థియేటర్లు ప్రస్తుతం షాపింగ్‌ కాంప్లెక్స్‌లుగా మారిపోగా రమణ, రమేష్‌, రాజా, సంఘమేష్‌ థియేటర్లు కల్యాణమండపాలుగా రూపాంతరం చెందాయి. ఈ పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంది. అనంతపురంలో ప్రస్తుతం 11 థియేటర్లు ఉండగా, వాటిలో శాంతి, గౌరి, త్రివేణి, ఎస్వీ థియేటర్లు మినహా మిగతావన్నీ వారాల తరబడి మూతపడే ఉంటున్నాయి. త్రివేణి గ్రూపు థియేటర్లు వీ మెగా వారి ఆధ్వర్యంలో నడుస్తుండగా, శాంతి, గౌరీ కాంప్లెక్సులు సురేష్‌ ప్రొడక్షన్స్‌ వారు నడుపుతున్నారు. ఇక ఎస్వీ, నీలిమా (ఎన్‌ మాక్స్‌) థియేటర్లు కూడా కదిరికి చెందిన వారి ఆధీనంలో నడుస్తున్నాయి. వీటన్నింటిలో పెద్ద హీరోల చిత్రాలు రెండు వారాలకు మించి ఆడని పరిస్థితి. చిన్న సినిమాలైతే రెండోరోజుకే బంద్‌ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.

రోడ్డున పడుతున్న కార్మికులు

వెండి తెర వెలుగులీనుతున్న రోజుల్లో ఒక్కో థియేటర్‌లో 15 నుంచి 25 మంది కార్మికులు పనిచేసేవారు. ఈ లెక్కన అప్పట్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,110 కు పైగా కార్మిక కుటుంబాలు జీవనం సాగించేవి. ప్రస్తుతం ప్రేక్షకాదరణ లేక థియేటర్లు మూత పడుతుండడంతో కార్మికులు రోడ్డు పడుతున్నారు. ఓటీటీ, పైరసీ కారణంగా ఉపాధికి భద్రత లేక పోవడంతో చాలా మంది కార్మికులు ఆటో డ్రైవర్లుగా, కూరగాయల విక్రయాలతో జీవనం సాగిస్తున్నారు.

‘పవర్‌’ చూపని ‘స్టార్‌’

ప్రేక్షకుల్లో అత్యంత మాస్‌ ఇమేజ్‌ కలిగిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఉప ముఖ్యమంత్రి పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌తో సినీ పరిశ్రమ రూపరేఖలు మారిపోతాయని పలువురు ఆశించారు. పైరసీని అరికట్టడంతో పాటు రాయితీలతో థియేటర్ల యజమానులకు అండగా నిలుస్తారని భావించారు. అయితే రోజులు గడుస్తున్నా చలనచిత్ర పరిశ్రమ పరిరక్షణపై పవన్‌ కళ్యాణ్‌, బాలకృష్ణ ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంతో అందరిలోనూ నిరాస నిస్పృహలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ చేతకానితనంతో సినిమా విడుదలైన రెండో రోజే హెచ్‌డీ ప్రింట్లు అరచేతిలోకి వచ్చేస్తున్నాయి. దీని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తమందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. థియేటర్ల బాగు కోసం, కార్మికుల సంక్షేమానికి పవర్‌స్టార్‌ చేసిందేమీ లేదంటూ పెదవి విరుస్తున్నారు.

సినిమా థియేటర్లకు ప్రేక్షకాదరణ కరువు వారాల తరబడి మూతబడుతున్న థియేటర్లు

ప్రభుత్వ నియంత్రణ సరిగా లేదు

Advertisement
 
Advertisement
Advertisement