కళ్యాణదుర్గం రూరల్: పెళ్లి కాలేదన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దేవాదులకొండ గ్రామానికి చెందిన ఆనంద్, వసంత దంపతుల కుమార్తె సంగీత (22) ఉన్నత చదువులు అభ్యసించి, రెండు నెలల క్రితం కాంట్రాక్ట్ విధానంలో సైకాలజీ టీచర్‌గా బెళుగుప్ప మండలంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమై సంబంధాలు చూస్తున్నారు. అయితే ఏ ఒక్క సంబంధం కుదరకపోవడంతో ఇక తనకు పెళ్లి కాదని నిర్ణయించుకున్న ఆమె బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ప్లాట్‌ఫారంపై
వృద్ధుడి మృతదేహం
గుంతకల్లు: స్థానిక రైల్వేస్టేషన్‌లోని 7వ ప్లాట్‌ఫారంపై బుధవారం ఉదయం ఓ వృద్ధుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. సుమారు 60 ఏళ్లు పైబడి ఉంటాయి. చామనఛాయ రంగులో ఉండి, తెలుపు రంగు పుల్‌షార్ట్, తెల్లటి పంచ ధరించి ఉన్నాడు. కుడి చిటికెన వేలుపై నల్లటి పుట్టు మచ్చ ఉంది. ఆచూకీ తెలిసిన వారు 90145 86555 కు సమాచారం అందించాలని జీఆర్పీ ఏఎస్‌ఐ ప్రేమ్‌కుమార్ కోరారు.
గార్మెంట్స్ కార్మికుడి బలవన్మరణం
రాయదుర్గం టౌన్: స్థానిక మల్లాపురం ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న గార్మెంట్స్ కార్మికుడు శివకుమార్(55) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొంత కాలంగా తాగుడుకు బానిసైన శివకుమార్ అప్పుల పాలయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు మందలించారు. తాగుడు మానుకుని అప్పులు తీర్చాలని హితవు పలికారు. అయితే తాగుడు మానేయడం ఇష్టంలేని ఆయన బుధవారం తెల్లవారుజామున ఇంటి గుమ్మం వద్ద ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
జంతులూరు పంచాయతీ కార్యదర్శికి షోకాజ్
అనంతపురం ఎడ్యుకేషన్: బుక్కరాయసముద్రం మండలం జంతులూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ రఫీకి జిల్లా పంచాయతీ అధికారి నాగరాజనాయుడు షోకాజ్ నోటీసు జారీ చేశారు. శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఇచ్చిన మౌఖిక ఫిర్యాదు ఆధారంగా నోటీసు జారీ చేసినట్లు డీపీఓ వెల్లడించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, గ్రామ పంచాయతీ పరిధిలో విధులను సక్రమంగా నిర్వహించాలని హెచ్చరించారు.
కారు ఢీకొని విద్యార్థి మృతి
పెద్దవడుగూరు: కారు ఢీకొన్న ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... పామిడి మండలం చైతన్య కాలనీకి చెందిన ఓబన్న, లక్ష్మీ దంపతులు కుటుంబసభ్యులతో కలిసి పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు గ్రామంలో బుధవారం బంధువుల ఇంట జరుగుతున్న సీమంతం కార్యక్రమానికి వెళ్లారు. క్రిష్టిపాడు వద్ద 63వ జాతీయ రహదారిపై ఆటో దిగి రోడ్డు దాటుతుండగా రాయలచెరువు వైపు నుంచి శరవేగంగా దూసుకొచ్చిన కారు ఓబన్న కుమారుడు అబిలాష (7)ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం కర్నూలులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గంజాయి విక్రేతల అరెస్ట్
గుత్తి: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు మట్కా బీటర్లను అరెస్ట్ చేసినట్లు గుత్తి సీఐ రామారావు తెలిపారు. గుత్తి పీఎస్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ సురేష్‌తో కలిసి వివరాలను ఆయన వెల్లడించారు. గుత్తిలోని అమృత్ సినిమా థియేటర్ వెనుక ఉన్న ఎస్సీ కాలనీకి చెందిన మాతంగి రాము, నగదాని శివ, కంబగిరి, మరో ముగ్గురితో కలిసి బుధవారం గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరో ముగ్గురు పరారీ అయ్యారు. పట్టుబడిన వారి వద్ద నుంచి రూ. 3 లక్షల నగదు, 1,100 గ్రాముల గంజాయితో పాటు మట్కా పట్టీలు, బాల్ పెన్నులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


