అప్పులు తీర్చే మార్గం కానరాక
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పంటల సాగుకు చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక క్రిమి సంహారక మందు తాగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
యాడికి: మండలంలోని లక్షుంపల్లికి చెందిన ఉద్యాన రైతు శ్రీనివాసులురెడ్డి (60)కి భార్య లక్ష్మీదేవి, ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పండ్ల మొక్కల సాగు, ముగ్గురు కుమార్తెల పెళ్లిళ్ల కోసమని ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.8 లక్షల వరకు అప్పులు చేశాడు. బోరు బావుల్లో నీరు తగ్గి తోటలో చెట్లు ఎండుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. అప్పు తీర్చకపోతే గ్రామంలో పరువు పోతుందని భావించిన శ్రీనివాసులురెడ్డి మంగళవారం రాత్రి క్రిమి సంహారక మందు తాగాడు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన కుటంబసభ్యులు వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం ఆయన మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
పామిడి: పామిడి మండలం రామరాజపల్లికి చెందిన రైతు చిన్నప్పరెడ్డి గారి ముత్యాలరెడ్డి (76)కి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. తనకున్న ఐదు ఎకరాల్లో పత్తి, కంది పంటలు సాగు చేసేవాడు. పంటల పెట్టుబడుల కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పు చేశాడు. అయితే వర్షాభావం కారణంగా పంటలు పండక అప్పలకు వడ్డీల భారం పెరుగుతూ దాదాపు రూ.15 లక్షల వరకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదంటూ మదనపడుతుండేవాడు. అప్పులు తీర్చక పోతే గ్రామంలో పరువు పోతుందని భావించిన ఆయన బుధవారం తన పొలంలో క్రిమి సంహారక మందు తాగి ఇంటికి చేరుకుని వరండాలో కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ముత్యాలరెడ్డి మృతి చెందాడు. ఘటనపై పామిడి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.


