డాక్టర్‌ కలను చిదిమేశారు | - | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ కలను చిదిమేశారు

May 13 2026 1:08 AM | Updated on May 13 2026 1:08 AM

‘నీట్‌’ రద్దుతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన

అనంతపురం: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఈ నెల మూడో తేదీన నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌ యూజీ–2026)ను రద్దు చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరీక్షకు సంబంధించి కొత్త తేదీలను త్వరలో వెల్లడించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పేర్కొంది. నీట్‌లో విద్యార్థులు ఎదుర్కొన్న ప్రశ్నలను పోలిన 100 ప్రశ్నలు పరీక్ష ప్రారంభానికి ముందే లీక్‌ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాజస్థాన్‌ పోలీసులు విచారణ చేపట్టారు. ఏళ్ల తరబడి సన్నద్ధమై, కోచింగ్‌ తీసుకుని పరీక్ష రాస్తే ఇప్పుడు రద్దు చేశారన్న వార్త విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆవేదన కలిగించింది. ప్రశ్నలు సులువుగా ఉన్నాయి.. పరీక్ష బాగా రాశాం.. మంచి ర్యాంకు వస్తుంది.. ఎంబీబీఎస్‌ కల నెరవేరుతుందనే ఆశను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ చిదిమేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది విద్యార్థులు ఈ నిర్ణయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉత్తరాఖండ్‌, హర్యానా, కేరళ రాష్ట్రాల్లో ప్రశ్నపత్రం లీక్‌ అయితే.. అక్కడ పరీక్షను రద్దు చేయాలి కానీ ఆంధ్రప్రదేశ్‌లో రద్దు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో మొత్తం 2,534 మంది నీట్‌ యూజీ రాశారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement