ఇన్‌చార్జ్‌ జేడీఏగా మురళీధర్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

ఇన్‌చార్జ్‌ జేడీఏగా మురళీధర్‌రెడ్డి

May 13 2026 1:08 AM | Updated on May 13 2026 1:08 AM

అనంతపురం అగ్రికల్చర్‌: రెగ్యులర్‌ జేడీఏగా నియమితులైన బ్లాక్‌దిల్‌ సవ్యార్‌నంద్‌ డిప్యుటేషన్‌పై అల్లూరి సీతారామరాజు జిల్లాకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పదోన్నతిపై ఇక్కడికి డీడీఏగా వచ్చిన బద్వేలుకు చెందిన ఎం.మురళీధర్‌రెడ్డి ఇన్‌చార్జ్‌ జేడీఏగా మంగళవారం బాధ్యతలు తీసుకున్నారు. కాగా మురళీధర్‌రెడ్డి ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. వచ్చే నెల మరో అధికారి జేడీఏగా రానున్నారు. ఇన్‌చార్జ్‌ జేడీఏకు పలువురు ఏఓలు, ఏడీఏలు, కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.

డీలర్ల సమక్షంలోనే

బియ్యం తూకం

అనంతపురం అర్బన్‌: ఎంఎల్‌ఎస్‌ (మండలస్థాయి స్టాక్‌) పాయింట్లలో డీలర్లు లేదా వారి ప్రతినిధుల సమక్షంలో బియ్యం తూకం వేసి ఇవ్వాలి. ఈ–పాస్‌ యంత్రం ద్వారా అథెంటికేషన్‌ తీసుకుని చౌక దుకాణాలకు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించామని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ రమేష్‌రెడ్డి తెలిపారు. ‘పేదల బియ్యంలో బొక్కుడు’ అనే శీర్షికన ఈనెల 11న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. సరుకులు 100 శాతం తూకం వేసి, సంచి బరువు మినహాయించి ఇవ్వాలని జిల్లాలోని అన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ఇన్‌చార్జీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఏ తేదీల్లో సరుకులు ఇస్తారనే విషయాన్ని డీలర్లకు ముందస్తుగానే తెలియజేస్తామన్నారు. ఆయా తేదీల్లో డీలర్లు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు వచ్చి సరుకులు తూకం సరిచూసుకోవాలని కోరారు. అన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో నాలుగు టన్నుల సామర్థ్యం ఉన ఎలక్ట్రానిక్‌ వే స్కేల్‌ ఉందన్నారు. ఏదైనా పాయింట్‌లో డీలర్లకు తక్కువ తూకంతో సరుకులు ఇచ్చినట్లు నిర్ధారణ అయితే సంబంధిత పాయింట్‌ ఇన్‌చార్జ్‌పై చర్యలు తీసుకుంటామన్నారు.

ఉపాధి కల్పించకుంటే ఇంటికే

అనంతపురం టౌన్‌: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పనులు కల్పించి, వారికి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోకపోతే ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తమ గ్రామ పరిధిలో ఏడాదికి 7,500 పనిదినాలను కల్పించే ఫీల్డ్‌ అసిస్టెంట్లకు మాత్రమే కాంట్రాక్టు పొడిగించాలని ఆదేశించింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 500 మందికి పైగా ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉపాధి హామి పథకంలో పని చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement