విభిన్న ప్రతిభావంతుల వసతి గృహాల ప్రవేశాలకు దరఖాస్తు | - | Sakshi
Sakshi News home page

విభిన్న ప్రతిభావంతుల వసతి గృహాల ప్రవేశాలకు దరఖాస్తు

May 13 2026 1:08 AM | Updated on May 13 2026 1:08 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల, వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతిగృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సహాయ సంచాలకులు అర్చన కోరారు. 3వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న శారీరక, బధిరులు, అంధ విద్యార్థులు 100 మందికి హెచ్‌ఎల్‌సీ కాలనీ సమీపంలోని హాస్టల్‌లో అవకాశం ఉంటుందన్నారు. బాలికల కోసం అరవిందనగర్‌లోని ఏర్పాటు చేసిన హాస్టల్‌లో 50 మందికి అవకాశం ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 78935 77797, 94927 60438 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

వ్యక్తి బలవన్మరణం

గుంతకల్లు టౌన్‌: కుటుంబ కలహాల కారణంగా పట్టణంలోని మోమినాబాద్‌కు చెందిన కె.రవికుమార్‌ (36) మున్సిపల్‌ పాత ఎస్‌ఎస్‌ ట్యాంక్‌లో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన మేరకు... మెయిన్‌రోడ్డు మున్సిపల్‌ ఆఫీసు ఎదురుగా తోపుడు బండిని ఏర్పాటు చేసుకుని బొప్పాయికాయలను విక్రయిస్తూ జీవనాన్ని సాగిస్తున్న రవికుమార్‌కు భార్య సంధ్య, ఐదుగురు పిల్లలున్నారు. 9వ తేదీ (శనివారం) భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన రవికుమార్‌ మంగళవారం ఉదయం పాత రిజర్వాయర్‌లో శవమై తేలాడు. మున్సిపల్‌ వాటర్‌ వర్క్స్‌ సిబ్బంది నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమివ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మనోహర్‌ తెలియజేశారు.

రెండో రోజూ కొనసాగిన ఏసీబీ తనిఖీలు

అనంతపురం క్రైం: నగరపాలక సంస్థలో రెండో రోజు మంగళవారం కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సోమవారం లంచం తీసుకుంటూ పట్టుబడిన నరసింహులు, జూనియర్‌ అసిస్టెంట్‌ సందీప్‌లను విడివిడిగా విచారించారు. మూడు బృందాలుగా విడిపోయి వారి నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించారు. నగదు, పలు ఆస్తి పత్రాలు లభించినట్లు సమాచారం. మరోవైపు నగర పాలక సంస్థ కమిషనర్‌ను కూడా కార్యాలయానికి పిలిపించి ఇన్‌చార్జ్‌ ఎంహెచ్‌ఓకు సంబంధించి వివరాలు సేకరించారు. ఎంహెచ్‌ విభాగానికి సంబంధించిన పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కొందరు సిబ్బంది, జూనియర్‌ అసిస్టెంట్లు, కాంట్రాక్టర్లు, ప్రైవేట్‌ వ్యక్తుల మధ్య భారీ స్థాయిలో జరిగిన ఫోన్‌పే లావాదేవీలను కూడా గుర్తించినట్లు సమాచారం. ఎంహెచ్‌ఓ నరసింహులు ఇంట్లో 15 తులాల బంగారు నగలతో పాటు రూ.లక్ష నగదు, నాలుగు చోట్ల ఆస్తులు కొనుగోలు చేసిన పత్రాలు లభించినట్లు తెలిసింది. పట్టుబడిన ఇద్దరినీ ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి తెలిపారు.

యానిమేటర్‌ భర్త ఘరానా మోసం

బ్రహ్మసముద్రం: ఓ యానిమేటర్‌ భర్త ఘరానా మోసానికి పాల్పడిన విషయం మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని ఎర్ర కొండాపురం గ్రామంలో 16 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. యానిమేటర్‌గా గ్రామానికి చెందిన అంజలి ఉన్నా ఆమె భర్త, టీడీపీ కార్యకర్త శ్రీకాంత్‌ అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. 8 సంఘాలకు చెందిన రూ.3 లక్షలకుపైగా పొదుపు సొమ్మును తన తల్లి తిమ్మక్క, భార్య అంజలి ఖాతాల్లో వేసుకున్నాడు. మంగళవారం గ్రామానికి చెందిన పలువురు మహిళలు తమ సంఘాలకు సంబంధించి లావాదేవీలపై వేపులపర్తి యూనియన్‌ బ్యాంక్‌లో ఆరా తీయగా శ్రీకాంత్‌ బాగోతం వెలుగుచూసింది. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు బాధిత మహిళలు బ్రహ్మసముద్రం వెలుగు కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయంలో అధికారులు లేకపోవడంతో నిరసన తెలియజేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

టన్ను మామిడి రూ.44 వేలు

అనంతపురం అగ్రికల్చర్‌: కక్కలపల్లి మార్కెట్‌లో మంగళవారం టన్ను మామిడి కాయలు గరిష్టంగా రూ.44 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్‌ కమిటీ సెక్రటరీ రూప్‌ కుమార్‌ తెలిపారు. హిమాయత్‌ రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.44 వేలు, కనిష్టంగా రూ.20 వేలు, సరాసరిన రూ.30 వేలు, బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.41 వేలు, కనిష్టంగా రూ.15 వేలు, సరాసరిన రూ.28 వేలు పలికాయని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement