గుంతకల్లు: రైలు ప్రయాణం సామాన్యులకు చుక్కలు చూపుతోంది. గుంతకల్లు మీదుగా సికింద్రాబాద్, విజయవాడ, బెంగళూరు, తిరుపతి తదితర నగరాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు రైళ్లలో సీట్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ఉన్న స్లీపర్ కోచ్‌లను సైతం కుదించి ఏసీ కోచ్‌లకే ప్రాధాన్యత ఇస్తుండడంతో అవస్థలు చెప్పనలవిగా మారాయి. కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేయగా కరోనా సమయంలో రద్దయిన ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించలేదు. బస్సులో కంటే రైళ్లలో తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయవచ్చనే ఉద్దేశంతో సామాన్యులు ఎక్కువగా ఇటువైపే మొగ్గు చూపుతారు. వేసవి సెలవులు కావడంతో రైళ్లలో వెయింటింగ్ లిస్ట్ వందల్లో దాటిపోతోంది. దీంతో తత్కాల్, ప్రీమియమ్ తత్కాల్ పేరిట వేలాది రూపాయలు చెల్లిస్తూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. రైల్వే యాజమాన్యం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చి సామాన్యులకు అందుబాటులో ఉన్న రైళ్లు, స్లీపర్ కోచ్‌లను తీసేస్తూ ప్రయాణం చేయాలంటేనే నరక ప్రాయమనేలా చేస్తోంది.
పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల రద్దు..
బెళగావి ఎక్స్‌ప్రెస్ రైళ్లు (07336/35)భద్రాచలం వెళ్లే భక్తులతోపాటు సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగించే వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. తొలుత స్పెషల్ రైళ్లు ప్రవేశ పెట్టి రద్దీ పెరిగిన కారణంగా వారంలో నాలుగు సార్లు రాకపోకలు సాగించేలా అనుమతులు ఇచ్చారు. అయితే తరువాత ఈ రైళ్లను ఉన్నపళంగా రద్దీ చేశారు. టాటానగర్–యశ్వంత్‌పూర్ మధ్య నడుస్తున్న వీక్లీ ఎక్స్‌ప్రెస్ బళ్లారి మీదుగా గుంతకల్లు బైపాస్ నుంచి సికింద్రాబాద్, విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తోంది. డివిజన్ కేంద్రమైన గుంతకల్లు జంక్షన్‌లోకి ప్రవేశించకుండానే బైపాస్ లైన్ మీదుగా వెళ్తోంది. ఈ రైలును గుంతకల్లు రైల్వేస్టేషన్‌లోకి మళ్లిస్తే అటు సికింద్రాబాద్, ఇటు విజయవాడ వెళ్లే ప్రయాణికులకు మరో రైలు లభించినట్లవుతుంది.
పట్టాలెక్కని పేదోడి రైళ్లు..
కరోనా సమయంలో రద్దయిన బెంగుళూరు– విజయవాడ ప్యాసింజర్ రైళ్లు నేటికీ పట్టాలెక్కలేదు. ఈ రైళ్లు విజయవాడ, బెంగళూరుకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు తక్కువ చార్జీతో అందరికీ సౌకర్యంగా ఉండేవి. 13 బోగీల్లో రెండు రిజర్వేషన్ స్లీపర్ కోచ్‌లు కూడా అందుబాటులో ఉండడం గమనార్హం. అదేవిధంగా గుంతకల్లు–ధర్మవరం మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దు చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నా ఈ రైళ్లను మాత్రం నడపడం లేదు.
స్లీపర్ బోగీలను కుదించారు..
గుంతకల్లు జంక్షన్ మీదుగా నడుస్తున్న పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్లీపర్ బోగీలను కుదించి ఏసీ బోగీలను పెంచారు. ఏసీ టికెట్ కొనుగోలు చేయలేని సామాన్య ప్రయాణికుడు స్లీపర్ టికెట్ కొన్నప్పటికీ అవి కూడా వందల సంఖ్యలో వెయిటింగ్ లిస్ట్‌లో ఉండడం, రైలు వచ్చే సమయానికి కూడా సీటు నిర్ధారణ కాకపోవడంతో చుక్కలు కనపడుతున్నాయి. జనరల్ బోగీల్లో ప్రయాణం మరీ దారుణం. ప్రయాణికులు కూర్చున్న సీటు నుంచి కదిలే పరిస్థితి ఉండదు. బెంగళూరు–భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18464/65), ఎంబీఆర్ చైన్నె సెంట్రల్ నుంచి ఛత్రపతి శివాజీ టెర్మినల్ (22100), వాస్కోడిగామా నుంచి జాసీదీ జంక్షన్ మధ్య నడిచే వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17321), కేసీఆర్ బెంగుళూరు–న్యూఢిల్లీ కర్ణాటక ఎక్స్‌ప్రెస్ (12627), యశ్వంత్‌పూర్–గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (12592) రైళ్లకు స్లీపర్ బోగీలు కుదించి ఏసీ బోగీలను పెంచారు.
కిక్కిరిసిపోతున్న జనరల్ బోగీలు..
ప్రతి రోజు ఆయా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రాకపోకలు సాగించడానికి ఒక్క గుంతకల్లు రైల్వేస్టేషన్‌లోనే దాదాపు 2,000 మంది ప్రయాణికులు టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో జనరల్ బోగీలు కిక్కిరిసిపోతున్నాయి. కేవలం రెండు జనరల్ బోగీలు ఉండడంతో బాత్‌రూమ్ కారిడార్ వద్దే పదుల సంఖ్యలో నిలబడి ప్రయాణాలు సాగిస్తుంటారు. బోగీల్లో వృద్ధులు, రోగులు, మహిళలు టాయిలెట్‌కి వెళ్లాలంటే కూడా సాధ్యమయ్యే పని కాదు. ఫుట్ బోర్డుపై ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. అయినప్పుటికీ రైల్వే యాజమాన్యం పట్టించుకోవడం లేదు. కేవలం ఆదాయం ఎలా పెంచుకోవాలనే తాపత్రయం తప్ప సామాన్యులకు సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు ప్యాసింజర్ రైళ్లను అందుబాటులోకి తెచ్చి స్లీపర్ బోగీల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు.
సామాన్యులకు చుక్కలు చూపుతున్న రైలు ప్రయాణం
పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
కరోనా సమయంలో రద్దయిన
ప్యాసింజర్లను పట్టాలెక్కించని వైనం


