50 శాతం రాయితీతో పచ్చిరొట్ట విత్తనాలు | - | Sakshi
Sakshi News home page

50 శాతం రాయితీతో పచ్చిరొట్ట విత్తనాలు

May 13 2026 1:08 AM | Updated on May 13 2026 1:08 AM

అనంతపురం అగ్రికల్చర్‌: భూసారం పెంపు కోసం జనుము, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలు (గ్రీన్‌మెన్యూర్‌) ధరలు ఖరారు చేసినట్లు వ్యవసాయశాఖ ఇన్‌చార్జి జేడీ ఎం. మురళీధర్‌రెడ్డి, టెక్నికల్‌ ఏవో రాకేష్‌నాయక్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఖరీఫ్‌లో జిల్లాకు 474 క్వింటాళ్ల జనుము, 190 క్వింటాళ్ల జీలుగ, 95 క్వింటాళ్ల పిల్లిపెసర విత్తనాలు కేటాయించారన్నారు. జనుము కిలో పూర్తీ ధర రూ.154 కాగా 50 శాతం రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద కిలోకు రూ.77 ప్రకారం చెల్లించాలన్నారు. జీలుగ విత్తనాలు కిలో పూర్తీ ధర రూ.160 కాగా రైతులు తమ వాటా కింద రూ.80 ప్రకారం చెల్లించాలన్నారు. అలాగే పిల్లిపెసర కిలో పూర్తీ ధర రూ.196 కాగా రైతులు తమ వాటా కింద రూ.98 ప్రకారం చెల్లించాలని తెలిపారు. ఏపీ సీడ్స్‌ ద్వారా జిల్లాకు సరఫరా కాగానే ఆర్‌ఎస్‌కేల్లో రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

బాలుడి మృతదేహం లభ్యం

గుమ్మఘట్ట: మండలంలోని బైరవానితిప్ప ప్రాజెక్టులో అదృశ్యమైన బాలుడి మృతదేహం మంగళవారం లభ్యమైంది. వివరాలిలా ఉన్నాయి.. తాళ్లకెరకు చెందిన మారెన్న, సుమక్క దంపతులకు కుమారుడు ఉమేష్‌ (14), ముగ్గురు కుమార్తెలున్నారు. వారు గొర్రెలు మేపుకుని జీవనం సాగించేవారు. తండ్రికి తోడుగా ఉమేష్‌ గొర్రెలు మేపేందుకు సోమవారం గ్రామ సమీపంలోని బీటీపీ రిజర్వాయర్‌ దగ్గరకు వెళ్లాడు. సాయంత్రం 4 గంటల సమయంలో రిజర్వాయర్‌లోని ఓ గుంతలోకి ఉమేష్‌ ఈతకు వెళ్లాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి గల్లంతయ్యాడు. ఆలస్యంగా గమనించిన తండ్రి నీటిలో గాలించినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు కుటుంబసభ్యులకు అందజేశారు. ఒక్కగానొక్క కుమారుడు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement