ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించండి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించండి

May 13 2026 1:08 AM | Updated on May 13 2026 1:08 AM

కణేకల్లు: ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని రాష్ట్ర డిప్యూటీ హెల్త్‌ కమిషనర్‌ సుజాత డాక్టర్లను ఆదేశించారు. స్థానిక సీహెచ్‌సీని మంగళవారం డీసీహెచ్‌ఎస్‌ సెల్వరాజ్‌తో కలిసి సుజాత ఆసుపత్రిని సందర్శించారు.ఇన్‌పేషెంట్‌ గది, బాలింతల గదిని సందర్శించి వైద్యసేవల గురించి రోగులను అడిగి తెలుసుకొన్నారు. స్కానింగ్‌ సెంటర్‌ను పరిశీలించిన ఆమె వారంలో ఎంత మంది గర్భవతులకు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ తీస్తున్నారని గైనిక్‌ డాక్టర్లను ప్రశ్నించారు. ఆసుపత్రి క్లీనింగ్‌ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన డీసీ మరింత శుభ్రంగా ఉంచాలని, ఎప్పటికప్పుడు శానిటేషన్‌ సిబ్బందితో అన్ని గదులను శుభ్రం చేయించాలన్నారు. డాక్టర్లు సమయపాలన పాటించాలని, ఓపీ తర్వాత డ్యూటీ డాక్టర్‌ తప్పనిసరిగా ఆసుపత్రిలో ఉండాలన్నారు. డాక్టర్‌ లేరనే ఆరోపణలు ప్రజల నుంచి రాకూడదన్నారు. అనంతరం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్స్‌, నర్స్‌ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకొంటామన్నారు. ఏబీడీఎం(ఆయుష్మాన్‌భారత్‌ డిజిటల్‌మిషన్‌)లో ప్రతి పేషెంట్‌ ఆరోగ్య వివరాలను భద్ర పరిచి వారికి మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకొంటున్నామన్నారు. భవిష్యత్తులో వారు దేశంలో ఎక్కడికెళ్లినా ఆన్‌లైన్‌లో ఆరోగ్య వివరాలు అందుబాటులో ఉంటాయని తద్వారా వారికి అవసరమైన మేర సేవలందుతాయన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ షరీఫ్‌, డాక్టర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement