అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 14న అనంతపురంలోని కేఎస్‌ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ప్రగతి తెలిపారు. ఈ మేరకు ఆమె సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి ప్రణాళికలో భాగంగా కళాశాల నోడల్ రిసోర్స్ సెంటర్ పరిధిలోని కళాశాలల్లో చదువుతున్న తృతీయ ససంవత్సరం విద్యార్థుల కోసం ఈ ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తృతీయ సంవత్సరం విద్యార్థినులతో పాటు ఇతర నిరుద్యోగ యువతీ యువకులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేకేసీ కోఆర్డినేటర్ బి.అనురాధ తెలిపారు. ఉద్యోగమేళాలో 11 కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. ఆసక్తిగల యువతీ యువకులు బయోడేటాతో పాటు, అర్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో ఆ రోజు ఉదయం 10 గంటలకు కళాశాలలో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 94407 98008 నంబరులో సంప్రదించాలని ప్రిన్సిపాల్ కోరారు.
గంజాయి విక్రేతలకు
పదేళ్ల జైలు
గుంతకల్లుటౌన్: అనంతపురం, కర్నూలు జిల్లాల్లో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు కొనసాగించిన నలుగురికి పదేళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ సోమవారం అనంతపురం జిల్లా మొదటి సెషన్సు కోర్టు జడ్జి తీర్పు వెలువరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గుంతకల్లు వన్‌టౌన్ సీఐ మనోహర్ మీడియాకు వెల్లడించారు. గుంతకల్లు పట్టణంలోని షికారి కాలనీకి చెందిన షికారీ నాగు, కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాజుమర్రి గ్రామానికి చెందిన బుడగజంగం నరసప్ప, అనంతపురం మండలం తాటిచెర్లకు చెందిన మేకల ప్రసాద్, రాఘవేంద్రకాలనీకి చెందిన ఎస్‌ఎం.నాసిర్‌హుసేన్ గంజాయి విక్రయిస్తూ 2024 ఫిబ్రవరి 23న గుంతకల్లు వన్‌టౌన్ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిపై అప్పటి సీఐ రామసుబ్బయ్య ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. దర్యాప్తు తరువాత అనంతపురం మొదటి ఏడీజే కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో పై నలుగురు ముద్దాయిలకు రూ.లక్ష జరిమానా, పదేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ అనంతపురం జిల్లా మొదటి సెషన్సు కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున వాదించిన స్పెషల్ పీపీ లేపాక్షినాయుడు, అప్పటి సీఐ రామసుబ్బయ్య, ప్రస్తుత సీఐ మనోహర్, కోర్టు మానిటరింగ్ సిస్టమ్ సీఐ విజయభాస్కర్, కోర్టు లైజన్ ఆఫీసర్ ఏఎస్‌ఐ మారెన్న, కోర్టు కానిస్టేబుల్ రజాక్ తదితరులను ఎస్పీ అభినందించారు.
ఈదురు గాలుల బీభత్సం
యాడికి: మండలంలో పలు గ్రామాల్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలుల ధాటికి లక్షుంపల్లి, కేవవరాయుని పేట గ్రామాలతో పాటు వ్యవసాయ తోటల వద్ద స్తంబాలు నేలకొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లక్షుంపల్లిలో సుంకులమ్మ దేవాలయం వద్ద మద్దిలేటి తోటలో సాగు చేసిన 3 ఎకరాల అరటి పంట పూర్తిగా నేలకొరిగింది. ఇదే గ్రామాంలో ప్రభాకర్‌రెడ్డికి చెందిన 20 నిమ్మచెట్లు, నాగేష్‌కు చెందిన 40 నిమ్మచెట్లు, జి.రంగారెడ్డికి చెందిన 10 నిమ్మ చెట్లు నేలమట్టమయ్యాయి,. కేశవరాయునిపేటలో రైతుల అరటి పంటలు కూడా దెబ్బ తిన్నాయి. దైవాలమడుగులో విద్యుత్ స్తంభాలు కిందపడ్డాయి. వ్యవసాయ తోటల వద్ద అరటి, తదితర పంటలపై విద్యుత్ స్తంభాలు నేలవాలాయి. చందన గ్రామంలో గంగమ్మ దేవాలయం ఎదురుగా ఉన్న వేప చెట్టు కొమ్మలు విరిగిపడటంతో సమీప నివాసాల వారు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు, సిబ్బంది ఘటనా స్థలాలకు వెళ్లి మరమ్మతులు చేపట్టారు. మండల వ్యవసాయ అధికారులు స్పందించి రైతులకు జరిగిన పంట నష్టాన్ని ఉన్నతాధికారులకు తెలిపి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.


