అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. జూన్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్–2026 పంటల సాగుకు సంబంధించి ఇప్పటి వరకు సన్నాహక చర్యలే చేపట్టలేదు. రాయితీ విత్తనాలు ఇస్తారా లేదా అనేది కూడా చెప్పే ప్రయత్నాలు చేయడం లేదు. జిల్లాకు 50 వేల క్వింటాళ్లు విత్తన వేరుశనగ ఇస్తామని సూత్రప్రాయంగా ప్రకటించినా... దానికి సంబంధించి ప్రక్రియ మొదలు పెట్టకపోవడంపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విత్తన సేకరణ ధర ప్రకటించకపోవడం చూస్తే ఈసారి కూడా సకాలంలో రైతులకు విత్తనం అందే పరిస్థితి కనిపించడం లేదు.
విత్తన ప్రణాళికే లేదు
వ్యవసాయశాఖ ఈసారి విత్తన ప్రణాళిక వెల్లడించలేదు. గతంలో ఫిబ్రవరి, మార్చిలోనే విత్తన ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి పంపితే ఏప్రిల్, మేలో అనుమతులు లభించేవి. ఈసారి 50 వేల క్వింటాళ్ల వేరుశనగ ఇస్తామని చెబుతున్నా... కంది, మొక్కజొన్న, ఆముదం, రాగులు, కొర్రలు, సజ్జలు, పెసలు, అలసంద, మినుము తదితర విత్తనాల గురించి మౌనంగా ఉన్నారు. అలాగే మేలోనే పంపిణీ చేయాల్సిన జనుము, జీలుగు, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలు (గ్రీన్ మెన్యూర్స్) గురించి ఇప్పటికీ స్పష్టత లేదు. కేటాయింపులు, ధరలు, సబ్సిడీలు ఇంకా ప్రకటించనేలేదు.
ముందస్తు సాగు కష్టమే
వర్షాలపై నమ్మకం లేని కొందరు రైతులు ఖరీఫ్‌లో తొలకరి వర్షాలకే ముందస్తుగా వేరుశనగ, ఇతర పంటలు సాగు చేస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ముందస్తుకు రెడీగా ఉన్నా.. విత్తన ప్రణాళికపై స్పష్టత లేకపోవడంతో వారు స్వంతంగా విత్తనం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మే మొదటి వారంలో విత్తన పంపిణీ ప్రక్రియ మొదలు పెడితేనే నాలుగో వారానికల్లా పంపిణీ పూర్తికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికీ ఎక్కడా సన్నాహక చర్యలు, ధర ప్రకటించకపోవడం వల్ల విత్తన సేకరణ, విత్తనశుద్ధి, సరఫరా, నిల్వ ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. మరో పక్క 2025 ఖరీఫ్, రబీలో సరఫరా చేసిన విత్తన వేరుశనగ, విత్తన పప్పుశనగ బకాయిలు రూ.110 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వలేదని.. ఆ బకాాయిలు చెల్లిస్తే కానీ ఈసారి సరఫరా చేయడం కష్టమని మిల్లర్లు, ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్వాహకులు తెగేసి చెబుతున్నారు.
మళ్లీ కంటితుడుపు చర్యలేనా..?
చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, వ్యవసాయశాఖ చేపడుతున్న సన్నాహక చర్యలు గమనిస్తే గతేడాది మాదిరిగానే ఈసారి కూడా రైతులకు కంటితుడుపుగా చివర్లో పంపిణీ చేసి చేతులు దులుపుకునే పరిస్థితి కనిపిస్తోంది. వ్యవసాయశాఖ మేల్కొనేలోపు జిల్లాలో రబీలో పండిన నాణ్యమైన వేరుశనగ ఇతర ప్రాంతాలకు తరలిపోయే పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇతర జిల్లాల నుంచి నాసిరకం సేకరించి రైతులకు అంటగట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని రైతులు చెబుతున్నారు. గతేడాది ఖరీఫ్‌లో వేరుశనగ, రబీలో పప్పుశనగ సాగు విస్తీర్ణం బాగా తగ్గడానికి సకాలంలో రాయితీ విత్తనం ఇవ్వకపోవడం కూడా కారణమని వాపోతున్నారు. కనీసం ఈసారైనా నాణ్యమైన విత్తనాలు అందించాలని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
సీజన్ సమీపిస్తున్నా విత్తన సేకరణ ధర ప్రకటించని వైనం
ఈపాటికి పచ్చిరొట్ట విత్తనాలు ఇవ్వాల్సి ఉన్నా ఆ ఊసేలేదు
విత్తన సేకరణ, విత్తనశుద్ధి, సరఫరా ఆలస్యమయ్యే పరిస్థితి


