ప్రత్యేక తరగతులకు హాజరైన వారికి ఆర్జిత సెలవులు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక తరగతులకు హాజరైన వారికి ఆర్జిత సెలవులు ఇవ్వాలి

May 12 2026 12:44 AM | Updated on May 12 2026 12:44 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ‘20 డేస్‌ యాక్షన్‌ ప్లాన్‌’కు హాజరవుతున్న ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం డీఈఓ ఎం.ప్రసాద్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌టీఏ నాయకులు మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలల్లో జరుగుతున్న అడ్మిషన్‌ ప్రక్రియలో పీఎస్‌ హెచ్‌ఎంలపై మండల విద్యాశాఖ అధికారులు అధిక ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా పీఎస్‌ హెచ్‌ఎంలపై కొన్ని మండలాల్లో తీవ్ర మానసిక ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డీఈఓను కోరారు. డీఈఓను కలిసిన వారిలో జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు అశోక్‌ కుమార్‌ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణప్ప, జిల్లా గౌరవ అధ్యక్షుడు గోపాల్‌, జిల్లా కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు.

జాతీయ కుస్తీ పోటీలకు

ఎంపిక

అనంతపురం టౌన్‌: జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఇటీవల గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో పామిడి మండలం గజరాంపల్లికి చెందిన నల్లబోతుల వాణి, రాఘవేంద్ర, శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం నాగినాయని చెరువు తండాకు చెందిన నవీన్‌నాయక్‌ ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి పాండురంగారావు, అనంతపురం డీఎస్‌డీఓ మంజుల అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement