అనంతపురం ఎడ్యుకేషన్: ఎంటీఎస్ టీచర్లను రెగ్యులర్ చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులకు కల్పించే అన్ని సౌలభ్యాలు అందించాలని ప్రభుత్వాన్ని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరప్ప, ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా సోమవారం ఎంటీఎస్ ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆందోళనకు యూటీఎఫ్ జిల్లా శాఖ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా కోటేశ్వరప్ప మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాల్సి ఉన్నా.. ప్రభుత్వం ఎంటీఎస్ ఉపాధ్యాయులతో వెట్టి చాకిరి చేయించుకోవడం దుర్మార్గమన్నారు. డీఎస్సీ–1998, డీఎస్సీ–2008లో ఎంపికై న ఉపాధ్యాయులకు అప్పట్లోనే నియామకాలు ఇవ్వకపోవడం నాటి ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. ముఖ్యంగా 2008 డీఎస్సీలో 30 శాతం ఎస్‌జీటీలకు, 70 శాతం బీఎడ్ అభ్యర్థులకు కేటాయింపుల కారణంగా మెరిట్ ఉన్న అనేక మంది నష్టపోయారని పేర్కొన్నారు. ఆ సమయంలోనే నియామకాలు జరిగి ఉంటే వారి కుటుంబాలు గౌరవప్రదమైన జీవనం సాగించేవన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 వేల మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు అన్యాయానికి గురవుతున్నారని, వారిని తక్షణమే రెగ్యులర్ చేసి అన్ని ప్రభుత్వ సౌలభ్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా రాష్ట్ర కార్యదర్శి దేవేంద్రమ్మ, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు రమణయ్య, గౌరవాధ్యక్షుడు వెంకట రామిరెడ్డి, సహాధ్యక్షుడు రామప్ప చౌదరి, కోశాధికారి రాఘవేంద్ర పాల్గొన్నారు.
హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్ టెక్నాలజీలో ప్రవేశాలు
అనంతపురం కల్చరల్ : తిరుపతిలోని ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్ టెక్నాలజీలో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఈ మేరకు జిల్లా చేనేత, జౌళీశాఖ అధికారి వరప్రసాద్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మూడేళ్ల డిప్లోమా కోర్సు అనంతరం ఉద్యోగ అవకాశాలతో పాటు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే అవకాశముంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సర్టిఫికెట్లను అందజేస్తారు. మరింత సమాచారం కోసం 93999 36872, 90102 43054 లో సంప్రదించవచ్చు.


