కంటితుడుపు జీఓలు వద్దు | - | Sakshi
Sakshi News home page

కంటితుడుపు జీఓలు వద్దు

May 12 2026 12:44 AM | Updated on May 12 2026 12:44 AM

న్యాయబద్ధమైన జీఓ ఇచ్చే వరకూ ఆందోళన

ధర్నాలో పీఏసీఎస్‌ ఉద్యోగులు

అనంతపురం అగ్రికల్చర్‌: కంటితుడుపు జీఓలు కాకుండా న్యాయబద్ధమైన జీఓ ఇచ్చే వరకూ ఆందోళన కొనసాగిస్తామంటూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ఉద్యోగులు తేల్చిచెప్పారు. పీఏసీఎస్‌ ఉద్యోగులకు అన్యాయం చేస్తూ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 322 ప్రతులను ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం దగ్ధం చేసే కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కొనసాగింది. రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతపురంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ప్రధాన కార్యాలయంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సహకార బ్యాంకుల ఎదుట పీఏసీఎస్‌ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సీఐటీయూ, రైతు సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు. స్థానిక డీసీసీబీ ఎదుట జీఓ 322 ప్రతులు దగ్ధం చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పీఏసీఎస్‌ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసులు, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ పి.హనుమంతరెడ్డి, కోశాధికారి ఎం.హనుమంతరెడ్డి తదితరులు మాట్లాడుతూ... తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు జేఏసీ పిలుపు మేరకు గత ఫిబ్రవరిన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె చేపట్టామని గుర్తు చేశారు. ఆ సమయంలో దిగివచ్చిన ప్రభుత్వం న్యాయం చేస్తామని హామీ ఇచ్చి.. నేడు కంటితుడుపుగా జీఓ 322 విడుదల చేసి అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఈ జీఓలో ఎక్కడేగానీ ఉద్యోగులకు న్యాయం చేకూరే అంశం కనిపించడం లేదన్నారు. తమకు న్యాయం జరిగేలా మరో జీఓ విడుదల చేసే వరకూ వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement