● కలెక్టరేట్ ఎదుట రైతులు, రైతు సంఘం ధర్నా
అనంతపురం అగ్రికల్చర్: వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటిపోవడంతో ఏళ్ల తరబడి పెంచి పోషించిన చీనీ తోటలు నిలువునా ఎండుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని పండ్లతోటల రైతుల సంఘం, ఏపీ రైతు సంఘం నాయకులు మండిపడ్డారు. సోమవారం పలువురు చీనీ రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నాలో వారు మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 91 వేల ఎకరాల భారీ విస్తీర్ణంలో చీనీ తోటలు విస్తరించాయని, అన్ని ప్రాంతాల్లోనూ చీనీ తోటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. రూ.లక్షలు ఖర్చు చేసి కొత్తగా బోర్లు వేస్తున్నా ఫలితం దక్కడం లేదన్నారు. చీనీ తోటల సంరక్షణకు వెంటనే చర్యలు తీసుకోవాలని, ట్యాంకర్ల ద్వారా నీళ్ల సరఫరాకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలన్నారు. ఎండిపోయిన చీనీకి ఎకరాకు రూ. లక్ష పరిహారం చెల్లించాలని, పీఏబీఆర్ నుంచి మర్తాడు, కోటంక గ్రామాల పరిధిలో ఉన్న చెరువులను నింపి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అనంతరం గ్రీవెన్స్‌లో అధికారులకు అర్జీ సమర్పించారు. కార్యక్రమంలో పండ్లతోటల రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు వి.శివారెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బీహెచ్ రాయుడు, ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు బాలరంగయ్య, నాయకులు చెన్నారెడ్డి, విరూపాక్షి, రామసుబ్బారెడ్డి, రామయ్య, పెద్ద తాతయ్య, వెంకటేశ్వరరెడ్డి, దస్తగిరి, వెంకటేష్, పలువురు రైతులు పాల్గొన్నారు.


