పేదల బియ్యంలో బొక్కుడు | - | Sakshi
Sakshi News home page

పేదల బియ్యంలో బొక్కుడు

May 11 2026 8:02 AM | Updated on May 11 2026 8:02 AM

అనంతపురం అర్బన్‌: అక్రమ సంపాదన కోసం కొందరు అధికారులు, సిబ్బంది పేదల బియ్యాన్ని నొక్కేస్తున్నారు. మండల లెవల్‌ స్టాక్‌ పాయింట్ల (ఎంఎల్‌ఎస్‌– గోదాము)లో ఈ తతంగం సాగుతోంది. 50 కిలోలు ఉండాల్సిన బస్తాను 46 నుంచి 47 కిలోలకే నింపి చౌకధాన్యపు దుకాణాల డీలర్లకు సరఫరా చేస్తున్నారు. ఇలా ప్రతి నెలా బస్తాల్లో నొక్కిన దాదాపు 50 వేల కిలోల (50 టన్నుల) బియ్యం బ్లాక్‌మార్కెట్‌లో కిలో రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు.

తూకం తగ్గినా నోరెత్తరాదు!

బియ్యం తూకం తగ్గినా డీలర్లు మాట్లాడకూడదు. మాట్లాడితే మరో రకమైన ఇబ్బందులు తప్పవని కొందరు డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చౌకదుకాణాలకు 50 కిలోల బస్తాలు సరఫరా చేస్తారు. వాస్తవంగా గోనె సంచితో కలిసి 50.500 కిలోలు ఇవ్వాలి. అయితే డీలర్లకు సరఫరా చేస్తున్న బస్తాల్లో బియ్యం 50 కిలోలు కూడా ఉండడం లేదు. బస్తాలో 47 నుంచి 46 కిలోలలోపే ఉంటోంది. డీలర్‌ ఇండెంట్‌ ఆధారంగా కోటా మేరకు బియ్యం సరఫరా చేయాలి. అయితే చౌక దుకాణానికి 150 క్వింటాళ్లకు 300 బస్తాలు ఇస్తున్నారు. బస్తాలో తూకం తక్కువ ఉన్నా 50 కిలోలు ఉన్నట్లుగానే నమోదు చేస్తున్నారు. దీంతో డీలరుకు నిర్దేశించిన కోటాలో రెండు నుంచి మూడు క్వింటాళ్ల బియ్యం తక్కువగా సరఫరా అవుతున్నట్లు సమాచారం.

కోత వేసి.. బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి..

జిల్లాలో 1,645 చౌక ధరల దుకాణాలు, 6.72 లక్షలు బియ్యం కార్డులు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 12 ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో నుంచి డీలర్ల ఇండెంట్‌ మేరకు చౌక దుకాణాలకు బియ్యం రవాణా చేస్తారు. ప్రతి నెలా కార్డుదారులకు 10.118 టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్కొక్క ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి సగటున 800 టన్నులు బియ్యం డీలర్లకు సరఫరా అవుతున్నాయి. కొన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలోని అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. డీలర్లకు ఇచ్చే బియ్యం బస్తాపై నాలుగు కిలోల మేర కొన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో నొక్కేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇలా ప్రతి నెలా దాదాపు 50 వేల కిలోల (50 టన్నుల) బియ్యం నొక్కేస్తూ బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపారులకు బియ్యం కిలో రూ.20తో విక్రయిస్తారని తెలిసింది. ఈ లెక్కన నెలసరి అక్రమార్జన రూ.10 లక్షల వరకు ఉంటుందని సమాచారం.

గోదాము నుంచే దర్జాగా...

మండలస్థాయి గోదాముల్లో డీలర్లకు సరఫరా చేసే కోటా నుంచి తూకాల రూపంలో నొక్కేస్తున్న బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలించేందుకు ప్రత్యేకంగా కొందరు వ్యాపారులు ఉన్నట్లు తెలిసింది. వీరు గోదాము నుంచి సరుకును దర్జాగా వేరే ప్రదేశాలకు తరలిస్తారని, అక్కడ బ్రాండెడ్‌ పేరున్న సంచుల్లో నింపి కర్ణాటకకు తీసుకెళ్లి విక్రయిస్తారని సమాచారం.

కొన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో నిర్వాకం

డీలర్లకు సరఫరా చేసే బియ్యంలో కోత

50 కిలోల బస్తాలో

3 కిలోల వరకు నొక్కుడు

ప్రతి నెలా 50 టన్నుల సరుకు

బ్లాక్‌మార్కెట్‌కు

అవును ఫిర్యాదులు వచ్చాయి

ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో బియ్యం తూకం తక్కువగా ఇస్తున్నట్లు డీలర్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీన్ని తీవ్రంగా పరిగణించాం. ఏయే తేదీల్లో ఏయే చౌక దుకాణాలకు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి బియ్యం సరఫరా చేయాలో ప్రత్యేక షెడ్యూల్‌ సిద్ధం చేశాం. దానిని ఈ నెల నుంచి అమలు చేస్తాం. నిర్దేశించిన తేదీలను డీలర్లకు తెలియజేస్తాం. ఆ ప్రకారం డీలర్లు వచ్చి వారి కోటా మేరకు బియ్యం తూకం వేయించుకుని లారీలో లోడ్‌ చేయించుకుని వెళ్లాలని చెప్పాం. – విష్ణుచరణ్‌, జాయింట్‌ కలెక్టర్‌

Advertisement
 
Advertisement
Advertisement