అనంతపురం క్రైం: అనంతపురం నగరంలో చెత్త నిర్వహణ ఇప్పుడు ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చవుతున్నా డంపింగ్‌యార్డులో పరిస్థితులు మాత్రం ఏమాత్రం మారడం లేదు. డంపింగ్ యార్డులో సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్తను శాసీ్త్రయంగా తొలగించేందుకు గతంలో రూ.12 కోట్ల వ్యయంతో జిగ్మా సంస్థకు పనులు అప్పగించారు. ఒప్పందం ప్రకారం 1,68,285 మెట్రిక్ టన్నుల చెత్తను ఆరు నెలల్లో ప్రాసెసింగ్ చేయాలని నిర్ణయించారు. రోజుకు 4 వేల టన్నుల చెత్తను శుద్ధి చేస్తామని సంస్థ హామీ ఇచ్చింది. కానీ ఆచరణలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపించింది. నాలుగు వేల టన్నుల లక్ష్యానికి గాను రోజుకు వెయ్యి టన్నుల చొప్పున మాత్రమే పనులు సాగినట్లు సమాచారం. అందుకే ఒప్పంద గడువు ముగిసినా పనులు పూర్తి కాలేదు.
నత్తనడకన చెత్త తరలింపు..
డంపింగ్ యార్డులో చెత్త తరలింపు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నెల ఆరో తేదీన విడుదలైన రోజువారీ పురోగతి నివేదికలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం డంపింగ్ యార్డులో 48,255.19 మెట్రిక్ టన్నుల మిశ్రమ చెత్త, 84,113.92 మెట్రిక్ టన్నుల మట్టి, రాళ్ల వ్యర్థాలు, 12,621.17 మెట్రిక్ టన్నుల ఆర్‌డీఎఫ్ వ్యర్థాలు మిగిలి ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రోజుకు 1,500 మెట్రిక్ టన్నుల చెత్త తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, కేవలం 518.660 మెట్రిక్ టన్నుల చెత్త తరలింపు మాత్రమే జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. మట్టి, రాళ్ల తొలగింపులో రోజుకు 1,500 మెట్రిక్ టన్నుల లక్ష్యం పెట్టినా, ఒక్క టన్ను కూడా తొలగించలేకపోయారు. ఆర్‌డీఎఫ్ వ్యర్థాల తొలగింపులో 150 టన్నుల లక్ష్యానికి బదులుగా కేవలం 74.59 టన్నుల మాత్రమే నిర్వహించారు. చెత్త తరలింపు పూర్తి కాకపోవడంతో నగరవాసులకు నరకయాతన తప్పడం లేదు.
రూ.30 కోట్ల దోపిడికి మరో ఎత్తుగడ!
తాజాగా రాష్ట్ర పరిశుభ్ర ఆంధ్ర సంస్థ ఆధ్వర్యంలో మరో భారీ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. రూ.30,55,50,557 వ్యయంతో తడి–పొడి చెత్త శుద్ధి కేంద్రాల నిర్మాణ బాధ్యతలను తిరుమల నిర్మాణ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో మరో రెండు సంస్థలకు అప్పగించారు. ఈ ప్రాజెక్టు కింద గుంతకల్లు నుంచి 80 టన్నులు, గుత్తి నుంచి 30 టన్నులు, అనంతపురం నుంచి 170 టన్నులు, తాడిపత్రి నుంచి 50 టన్నులు, రాయదుర్గం నుంచి 30 టన్నులు, కళ్యాణదుర్గం నుంచి వచ్చే 20 టన్నుల చెత్తను శుద్ధి చేయాల్సి ఉంటుంది. అధికారుల లెక్కల ప్రకారం ఈ కేంద్రాల ద్వారా రోజుకు మొత్తం 380 టన్నుల చెత్తను శాసీ్త్రయంగా శుద్ధి చేస్తారు. ఇందులో 209 టన్నుల తడి చెత్త, 171 టన్నుల పొడి చెత్త ఉంటాయి.
అసలు చెత్త అక్కడికి చేరుతుందా?
ప్రస్తుతం అనంతపురం నగరంలో చెత్త సేకరణ వ్యవస్థే సరిగా లేకపోవడం ప్రజలను కలవరపెడుతోంది. చెత్త తరలించే వాహనాలు తక్కువగా ఉన్నాయి. ఉన్న వాహనాల్లో డీజిల్ నింపేందుకు కూడా నిధులు లేవు. దీనికి తోడు కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. చెత్తను కేంద్రాలకు తీసుకెళ్లే వ్యవస్థను బలోపేతం చేయకుండా శుద్ధి కేంద్రాలు నిర్మిస్తే ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
రూ.కోట్లు కొల్లగొడుతున్న
ప్రజాప్రతినిధులు
నీళ్లప్రాయంగా నిధులు ఖర్చు చేసినా మారని దుస్థితి
పాత చెత్తకు దిక్కులేదు.. కొత్తగా రూ.30 కోట్లతో కొత్త ప్రణాళిక
ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్యే దగ్గుపాటి.. బిల్డప్పులిచ్చిన చైర్మన్ పట్టాభి
హామీలతో కాలయాపన.. అనంతపురం వాసులకు తప్పని నరకయాతన
అనగనగా ‘అనంత’ చెత్త కథ... నేతలు ప్రజాధనాన్ని ఎలా దోచుకు
తినాలో.. తింటున్నారో తెలిపే
వాస్తవ గాథ. స్థానిక ప్రజా ప్రతినిధి ‘అక్టోబరు 2 నాటికి స్పూన్ చెత్తకూడా అక్కడ ఉండదు.. ఇది నా హామీ’. ‘సంక్రాంతికి ఇక్కడ అద్భుతమైన పచ్చటి వనం ఏర్పాటు చేస్తామ’ని స్వచ్ఛాంధ్రప్రదేశ్ చైర్మన్ పట్టాభి ప్రగల్భాలు... వెరసి జిగ్మా కంపెనీ చేతిలో రూ.12 కోట్ల లెగసీ వేస్ట్ పనులు పెట్టారు. అవి పూర్తికాకనే ఇప్పుడు మరో ప్రణాళికతో రూ.30 కోట్లు దోచుకునేందుకు కొత్తగా వ్యూహం రచించడం విమర్శలకు తావిస్తోంది.


