అనంతపురం అర్బన్: వేసవి తీవ్రత నేపథ్యంలో ప్రజల ఆరోగ్యశ్రేయస్సు దృష్ట్యా కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు. భూసమస్యలపై అర్జీలను పరిష్కార వేదికలో భాగంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లో అందజేయాలన్నారు. కాల్‌సెంటర్ 1100కు ఫోన్ చేసి అర్జీ పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap. gov.in వెబ్‌సైట్‌లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు.
నేడు డయల్ యువర్ ఎస్‌ఈ
అనంతపురం టౌన్: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ విద్యుత్ శాఖ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఈ శేషాద్రి శేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 08554– 272943, 9154790350కు ఫోన్ చేసి సమస్యను తెలియజేస్తే సకాలంలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల స్థాపనకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం టౌన్: ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కుల స్థాపన కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగకుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన భూమిలో 60శాతం సొంత భూమి కచ్చితంగా ఉండాలన్నారు. మిగిలిన 40 శాతం భూమిని ఏపీఐఐసీ సమకూరుస్తుందన్నారు. ఆసక్తి ఉన్న పారిశ్రామిక వేత్తలు www. apindustries.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్న వివరాలకు 99492 19667, 91542 19850 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
13న జెడ్పీ సీఈఓ బాధ్యతల స్వీకరణ
అనంతపురం టవర్‌క్లాక్: ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ సీఈఓగా విజయలక్ష్మి ఈ నెల 13న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె ఉదయం 9 నుంచి 9:30 గంటల మధ్యలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. తరువాత జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేయనున్నారు. ఆ తరువాత కలెక్టరేట్‌కు చేరుకుని కలెక్టర్ ఆనంద్‌ను మర్యాద పూర్వకంగా కలవనున్నారు.
టన్ను మామిడి
రూ.35 వేలు
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక కక్కలపల్లి మార్కెట్‌లో ఆదివారంం టన్ను మామిడికాయలు గరిష్టంగా రూ.35 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్‌కుమార్ తెలిపారు. మార్కెట్‌కు 40 టన్నులు అమ్మకానికి రాగా, వాటిని వేలం వేశారన్నారు. అందులో బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.35 వేలు, కనిష్టంగా రూ.10 వేలు, సరాసరిన రూ.20 వేల ప్రకారం ధర పలికాయన్నారు. అలాగే హిమాయత్ రకం టన్ను గరిష్టంగా రూ.27 వేలు, కనిష్టంగా రూ.9 వేలు, సరాసరిన రూ.18 వేలు, మల్లికా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.17 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సరాసరిన రూ.11 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ వెల్లడించారు.


