మళ్లీ ‘సహకార’ పోరాటం | - | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘సహకార’ పోరాటం

May 11 2026 8:02 AM | Updated on May 11 2026 8:02 AM

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పరిధిలో పనిచేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ఉద్యోగులు మళ్లీ ఆందోళనకు సిద్ధమయ్యారు. సోమవారం అనంతపురంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోరుబాట కొనసాగిస్తున్న పీఏసీఎస్‌ ఉద్యోగులు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గత ఫిబ్రవరి 15 నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. దాదాపు 10 రోజుల పాటు సమ్మెబాట పట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి కొన్ని డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో విరమించారు. అయితే రెండు రోజుల కిందట ప్రభుత్వం ఇచ్చిన జీఓలో ఉద్యోగులకు న్యాయం జరిగేలా ఏమీ లేవని పెదవి విరుస్తున్నారు. దీంతో మరోసారి పోరాటమే శరణ్యమని చెబుతున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానుండటంతో మళ్లీ ఆందోళన కొనసాగిస్తే రైతులకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉందని చెబుతున్నారు. పంట రుణాల పంపిణీ, రెన్యువల్స్‌, వడ్డీలకు అపరాధ రుసుం చెల్లింపు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీ, అలాగే పశువుల దాణా పంపిణీకి ఇబ్బందులు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది.

డిమాండ్లు నెరవేర్చాలి..

జీఓ 36 అమలు చేయాలని, 2019, 2024 పీఆర్‌సీ ఇవ్వాలని లేదంటే 50 శాతం తగ్గకుండా మధ్యంతర భృతి ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే రూ.2 లక్షల గ్రాట్యుటీ సీలింగ్‌ ఎత్తివేయాలని, 2019 తర్వాత చేరిన ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, రిటైర్డు వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, లాభనష్టాలతో సంబంధం లేకుండా సంఘాల ఉద్యోగుల జీతాలు చెల్లించాలని, రూ.5 లక్షలు హెల్త్‌ ఇన్సూరెన్స్‌, రూ.20 లక్షల టర్మ్‌ ఇన్సూరెన్స్‌ అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో మరోసారి నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు పీఏసీఎస్‌ ఉద్యోగుల యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసులు, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ పి.హనుమంతరెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాసులు, కోశాధికారి ఎం.హనుమంతరెడ్డి తదితరులు తెలిపారు.

నేడు డీసీసీబీ ఎదుట

పీఏసీఎస్‌ ఉద్యోగులు నిరసన

Advertisement
 
Advertisement
Advertisement