● నేడు రైతుల సమస్యలను
కలెక్టర్‌కు వివరిద్దాం
● వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త
సాకే శైలజానాథ్
శింగనమల: పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా శింగనమల నియోజకవర్గంలోని రైతుల సమస్యలను కలెక్టర్‌కు వివరించనున్నట్లు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజానాత్ తెలిపారు. సోమవారం ఉదయం పది గంటలకు కలెక్టరేట్‌కు తరలిరావాలని రైతులు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన శింగనమలలో విలేకరులతో మాట్లాడుతూ వరి, మొక్కజొన్నకు గిట్టుబాటు ధరలేక రైతులు కల్లాల్లోనే పంట ఉత్పత్తులు ఉంచుకున్నారన్నారు. అయినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. రోజులు గడిచే కొద్దీ ధాన్యం రంగుమారి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఇక నియోజకవర్గవ్యాప్తంగా వ్యవసాయ బోర్లలో నీరు తగ్గి పండ్ల తోటలు ఎండిపోతున్నాయన్నారు. అధికారులు పండ్ల తోటలను కూడా పరిశీలించలేకపోతున్నారని, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. రైతుల సమస్యలన్నింటినీ కలెక్టరుకు వివరించేందుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా నాయకులు హాజరవుతారని పేర్కొన్నారు.


