‘ఉపాధి’ కరువు | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ కరువు

May 11 2026 8:02 AM | Updated on May 11 2026 8:02 AM

అనంతపురం టౌన్‌: జిల్లాలో 31 మండలాలు 540 గ్రామ పంచాయతీల్లో తూతూ మంత్రంగా ఉపాధి పనులు కల్పిస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో 70 పంచాయతీల్లో 100 మందికి కూడా పనులు కల్పించలేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కూలీలకు పనులు కల్పించిన పాపాన పోలేదు. అనంతపురం రూరల్‌ మండలంలోని 6 పంచాయతీల్లో ఉపాధి పనులను అసలు ప్రారంభించనే లేదు.

అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో..

జిల్లా వ్యాప్తంగా 3.16 లక్షల జాబ్‌కార్డులు ఉండగా, 5.38 లక్షల మంది ఉపాధి కూలీలు ఉన్నారు. వీరిలో 3 లక్షల మందికి పైగా యాక్టివ్‌ ఉపాధి కూలీలు. కొన్ని గ్రామాల్లో అధికార టీడీపీలో వర్గ పోరు కారణంగా ఫీల్డ్‌ అసిస్టెంట్లను ఏర్పాటు చేయలేదు. గతంలో పనులు చేసిన కూలీల్లోనే ఒకరిని మేట్‌గా తీసుకొని ఉపాధి పనులు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నా వారిపై ఒత్తిడి తీసుకువచ్చి మేట్లను సైతం ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటూ ఉపాధి కూలీల కడుపుకొడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఉపాధి సీజన్‌లో సైతం పనులకు వచ్చే కూలీల సంఖ్యను పరిశీలిస్తే మండలానికి 2 వేల లోపు మాత్రమే ఉంది. ఈ విషయంపై వెంటనే అధికారులు దృష్టి సారించి పనులు ప్రారంభంకాని గ్రామాలతోపాటు జిల్లా వ్యాప్తంగా కూలీలకు పెద్ద ఎత్తున ఉపాధి పనులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జిల్లా వ్యాప్తంగా చాలా పంచాయతీల్లో ప్రారంభమే కాని ఉపాధి పనులు

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిలిచిన వైనం

అధికారులకు కూలీలు

విన్నవించుకున్నా ఫలితం శూన్యం

చేసేది లేక వలసలు పోతున్న పల్లెజనం

అనంతపురం రూరల్‌ మండలం కొడిమి, నరసనాయనికుంట గ్రామ పంచాయతీల్లో 700కు పైగా జాబ్‌కార్డులు, 1,500 మందికి పైగా ఉపాధి కూలీలు ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పంచాయతీల్లో ఉపాధి పనులు జరగలేదు. కూలీలకు ఒక్క రోజు పని కల్పించలేదు. ఆయా గ్రామ పంచాయతీల్లో ఇప్పటికీ ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను ఏర్పాటు చేయలేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పనులు కల్పించాలని అధికారులను స్థానికులు వేడుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది.

యల్లనూరు మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కూలీలకు ఉపాధి పనులు కల్పించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ కూలీలకు పనులు కల్పించిన పాపాన పోలేదు. ఈ పంచాయతీలో 600 మందికి పైగా కూలీలుఉన్నారు. పనులు కల్పించాలని అధికారులను వేడుకున్నా పట్టించుకోకపోవడంతో చేసేది లేక పలువురు పట్టణాలకు వలస వెళ్లారు. ఈ మూడు చోట్లే కాదు.. జిల్లా వ్యాప్తంగా చాలా పంచాయతీల్లో ఇలాంటి దుస్థితే నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement