ప్రేమ విఫలమై యువకుడి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమై యువకుడి బలవన్మరణం

May 11 2026 8:02 AM | Updated on May 11 2026 8:02 AM

గుమ్మఘట్ట: ప్రియురాలు తన ప్రేమను నిరాకరించడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయదుర్గం మండలంలోని టీ.వీరాపురం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. టీ.వీరాపురానికి చెందిన రామాంజినేయులు, శ్రీమతి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. వ్యవ సాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి చిన్న కుమారుడు శివకుమార్‌ (19) శనివారం రాత్రి గ్రామంలోని తమ పాత ఇంట్లో నిద్రించేందుకు వెళ్లాడు. ఆదివారం ఉదయం తల్లి శ్రీమతి ఆ ఇంటి వద్దకు వెళ్లి ఎన్నిసార్లు తలుపుతట్టినా గడియ తీయలేదు. దీంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా విగతజీవిలా ఉరికి వేలాడుతూ కనిపించాడు. శివకుమార్‌ మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడు శివకుమార్‌ ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు తెలిసింది. ఆమె ప్రేమను నిరాకరించడంతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను ఆడియో రికార్డింగ్‌ చేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పామిడి: 44వ నంబర్‌ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పామిడి పోలీసు స్టేషన్‌ జమేదారు వెంకటేష్‌నాయక్‌ తెలిపిన మేరకు.. ఆదివారం స్థానిక టీచర్స్‌ కాలనీకి చెందిన నాగిరెడ్డి (56) హైవేలోని అయ్యప్పస్వామి దేవాలయం వద్ద నుంచి తన ఇంటికి నడుచుకుంటూ బయలుదేరాడు. ఆ సమయంలో గుత్తి వైపు నుంచి వేగంగా దూసుకువచ్చిన ఓ లారీ నాగిరెడ్డిని ఢీకొని లాక్కెళ్లింది. దీంతో తీవ్ర గాయాలైన ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య నవనీత, కుమారుడు ధీరజ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. నాగిరెడ్డి స్థానిక సరస్వతీ ఉన్నత విద్యామందిరంలో ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇటీవలే కుమారుడు ధీరజ్‌కుమార్‌రెడ్డికి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం లభించడంతో ఉద్యోగాన్ని మానుకున్నాడు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

విద్యుత్‌ షాక్‌తో

వ్యక్తికి తీవ్రగాయాలు

రాయదుర్గంటౌన్‌: పట్టణంలో జెడ్పీ బాలికోన్నత పాఠశాల సమీపంలోని 11 కేవీ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ బుష్‌ రాడ్‌ను తాకడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయలైన ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలు.. కోటమారెమ్మ ఆలయం వద్ద నివాసముంటున్న హమాలీ బసవరాజుకు భార్య లక్ష్మీదేవి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బసవరాజు కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఆదివారం మద్యం మత్తులో బాలికోన్నత పాఠశాల సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద అదుపు తప్పి బుష్‌రాడ్‌ను తాకడంతో షాక్‌కు గురై అక్కడే ఉన్న డ్రైనేజీలో పడ్డాడు. స్థానికులు అతన్ని సమీపంలో గల ఏరియా ఆస్పత్రికి తరలించి బంధువులకు సమాచారం చేరవేశారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బసవ రాజును అనంతపురం తీసుకెళ్లారు. ఈ ఘటనతో పట్టణంలో గంటపాటు కరెంటు సర ఫరాలో అంతరాయం ఏర్పడింది. లైన్‌మెన్లు సమస్యను పరిష్కరించి పునరుద్ధరించారు.

మూగ మహిళపై అత్యాచారయత్నం

పుట్లూరు: కూలీ పనులకు వెళ్లిన ఓ మూగ మహిళపై అరటి తోట యజమాని అత్యాచార యత్నం చేశాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేంద్రబాబు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మూగ మహిళ ఈ నెల 8న అదే గ్రామానికి చెందిన రమణారెడ్డి అరటి తోటలోకి కూలీ పనులకు వెళ్లింది. పనులు చేస్తున్న సమయంలో మహిళపై గాలి రమణారెడ్డి అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

పేకాటరాయుళ్ల అరెస్టు

యాడికి: మండల కేంద్రంలోని పచ్చారుమేకలపల్లి రహదారిలో ఆదివారం పేకాట స్థావరంపై సీఐ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి దాడి చేశారు. 9 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి వద్ద ఉన్న రూ. 24,350 నగదుతో పాటు 50 పేక ముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement