శింగనమల: జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ సీఎంను చేసుకుందామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం శింగనమలలో వైఎస్సార్‌సీపీ నూతన కార్యాలయాన్ని మాజీ మంత్రి, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ‘అనంత’ మాట్లాడుతూ పోరాటాలకు పురిటి గడ్డ శింగనమల అన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. పథకాలను పక్కాగా అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలకు మేలు చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లేదని, వ్యవసాయ బోర్లలో నీరు తగ్గిపోయి పంటలు ఎండిపోతున్నాయని, రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి స్వప్రయోజనాల కోసం పని చేస్తూ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఎక్కడ చూసినా ఇసుక, మట్టి దోపిడీ పెరిగిపోయిందని విమర్శించారు.
కార్యకర్తలే పార్టీకి వెన్నెముక:
మాజీ మంత్రి శైలజానాథ్
వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే వెన్నెముక అని, వారికి అన్నింటా ప్రాధాన్యత ఇస్తామని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను గ్రామ స్థాయిలోనే ఎండగట్టాలన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడికీ అండగా ఉంటామన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీద్దామన్నారు. ఐకమత్యంతో ఉండి, వైఎస్ జగన్‌ను సీఎంను చేసుకుందామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనరు పరంధామ రెడ్డి, నాయకులు సాకే రుత్విక్, వీరాంజినేయులు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శులు బొమ్మన శ్రీరామిరెడ్డి, తరిమెల వంశీ గోకుల్‌రెడ్డి, బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు దుద్దేకుంట భాస్కర్‌రెడ్డి, బెస్త గోపాలు, జిల్లా అధికార ప్రతినిధి ఎన్‌వీ నారాయణ, నూరు మహమ్మద్, మునేంద్ర, అబ్దుల్లా, నరసింహారెడ్డి, ఎస్‌పీ నారాయణరెడ్డి, వెంకటరమణ, బండి శ్రీనివాసులు, లలిత కళ్యాణి, శివమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఐకమత్యంతో ఉందాం..
ప్రజా సమస్యలపై పోరాడదాం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, మాజీ మంత్రి శైలజానాథ్ పిలుపు


