మనుషులకే కాదు.. చేపలకూ ఎండదెబ్బ తగులుతోంది. భానుడి ప్రతాపానికి చెరువులు,
కుంటల్లో నీరు వేడెక్కుతోంది. నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా చెరువులు, కుంటల్లో నీరు తగ్గి ప్రాణవాయువు కొరత ఏర్పడుతోంది. ఫలితంగా చేపలు మృత్యువాత పడుతున్నాయి.
రాయదుర్గం: భానుడి భగభగలకు జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోవు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో మనుషులతో పాటు పక్షులు, మూగజీవాలు, జలచరాలు సైతం వేసవి దెబ్బకు సలసల కాగిపోతున్నాయి. వేసవితాపం తట్టుకునేందుకు లోతైన ప్రదేశాల్లో గుంపుగా చేరి దాక్కుంటున్నాయి. చిన్న వయసు కలిగిన చేపలు ఎండదెబ్బకు చనిపోతున్నాయి.
దిగుబడిపై ప్రభావం..
జిల్లాలోని రాప్తాడు, ఆలమూరు, గుత్తి, వైటీ చెరువు, పీకే చెరువు, తోపుదుర్తి, బుక్కరాయ సముద్రం, శ్రీధరఘట్ట, మదిగుబ్బ, గూల్యం తదితర చెరువుల్లో 2.20 లక్షల చేప పిల్లలను మత్స్యకారులు సొంత ఖర్చుతో వదులుకున్నారు. పీఎంఎంఎస్‌వై పథకం కింద 40 శాతం రాయితీతో 80 లక్షల చేపపిల్లలు వదిలారు. ఇందులో 50 శాతం దిగుబడి లెక్కించినా 15 లక్షల కిలోల వరకు వలకు చిక్కుతాయి. కిలో రూ.100తో విక్రయించినా రూ.1.50 కోట్ల మేర ఆదాయం సమకూరుతుంది. అలాగే 350 మంది మత్స్య సహకార సంఘ సభ్యులు జీవనోపాధి పొందుతున్న బీటీపీ, మిడ్‌పెన్నార్ రిజర్వాయర్‌లో వంద శాతం రాయితీతో 24 లక్షల చేపపిల్లలు వదిలారు. 50 శాతం లెక్కిస్తే ఒక్కో రిజర్వాయర్‌లో 6 లక్షల కిలోల చేపల ఉత్పత్తి ఉంటుంది. రూ.6 కోట్ల ప్రకారం రెండు రిజర్వాయర్ల పరిధిలో రూ.12కోట్ల మేర ఆదాయం ఉంటుంది. అయితే ఎండదెబ్బకు మృత్యువాత పడుతున్న చేపల సంఖ్య పెరుగుతుండడంతో దిగుబడిపై ప్రభావం పడుతోంది.
చెరువులు, కుంటలు,
జలాశయాల్లో వేడెక్కుతున్న నీరు
తట్టుకోలేక మృత్యుఒడికి
చేరుతున్న జలపుష్పాలు
ఆందోళనలో మత్స్యకారులు
జాగ్రత్తలు తీసుకోవాలి
గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో చేపల ఉత్పత్తి దెబ్బ తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రిజర్వాయర్లు, చెరువుల్లో చేపల కదలికలపై నిఘా ఉంచాలి. చేపల ఎదుగుదలను పరిశీలిస్తూ ఉండాలి. లోపాలు కనిపిస్తే వెంటనే సంబంధిత మత్స్యశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ఈ నెలాఖరు వరకూ నీటి వనరుల వద్ద నిఘా ఉంచడం మంచిది. కిలో కంటే పెద్ద సైజులో ఉండే చేపలను పట్టి విక్రయించుకోవడం ఉత్తమం.
– లక్ష్మీనారాయణ, ఎఫ్‌డీఓ, పీఏబీఆర్


