● వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు
శ్రీనివాస్ నాయక్ ధ్వజం
అనంతపురం: చంద్రబాబు పాలనలో గిరిజనులకు రక్షణ కరువైందని వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్ నాయక్ అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు మండలం గొరిదిండ్ల గ్రామంలో బాలికను ఒక వ్యక్తి మాయ మాటలు చెప్పి తీసుకెళ్తే ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదంటే రాష్ట్రంలో గిరిజనుల పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా అర్థం అవుతోందన్నారు. అదే పోలీస్టేషన్‌లో ఓ కానిస్టేబుల్ టీడీపీ నాయకుల దగ్గరకు వెళ్తే న్యాయం జరుగుతుందని చెబుతున్నారంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి జిల్లాలో ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలపై ఇదో ఉదాహరణ మాత్రమే అన్నారు. గిరిజన బాలిక కుటుంబానికి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గోరంట్ల జెడ్పీటీసీ పాలే జయరాంనాయక్, జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు గోవింద్‌నాయక్, ప్రధాన కార్యదర్శి రాజనాయక్, గుజ్జల శివయ్య మట్లాడుతూ గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇలాగే పాలన సాగిస్తే ప్రజలే చంద్రబాబును తరిమికొడతారన్నారు. బాలికకు జరిగిన అన్యాయంపై జిల్లాకు చెందిన ఎస్టీ కమిషన్ సభ్యుడు స్పందించాలని డిమాండ్ చేశారు.
కుక్కల దాడిలో 52 గొర్రె పిల్లల మృతి
బెళుగుప్ప: మండల పరిధి లోని జీడిపల్లి గ్రామంలో ఆదివారం గొర్రెల కాపరి సోలాపురం ఎర్రిస్వామికి చెందిన 52 గొర్రె పిల్లలు కుక్కల దాడిలో మృత్యవాత పడ్డాయి. వివరాలు.. ఎర్రిస్వామి ఆదివారం గ్రామ సమీపంలోని ఓ రైతు పొలంలో తన గొర్రెలను మేపునకు తీసుకెళ్లాడు. చెట్టు నీడన కంచె వేసి పిల్లలను మందగా తోలాడు. సాయంత్రం మంద వద్దకు వచ్చి చూడగా 52 గొర్రె పిల్లలను కుక్కలు చంపివేశాయి. రూ.2.5 లక్షల నష్టం చేకూరిందని ఎర్రిస్వామి ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. హనిమిరెడ్డిపల్లి పశువైద్య సహాయకుడు ఎర్రిస్వామి బాధితుడి వద్ద వివరాలను సేకరించారు. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన మరో ఐదు గొర్రెలకు చికిత్స చేశారు.


