మదనపల్లె టౌన్: ఐషర్‌ను లారీ ఢీకొనడంతో 16 మంది భక్తులకు గాయాలైన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో జరిగింది. రెండో పట్టణ సీఐ మహ్మద్ రఫి తెలిపిన మేరకు.. పుట్లూరు మండలం కడవకల్లు గ్రామానికి చెందిన 60 మంది భక్తులు బోయకొండకు ఐషర్, బొలెరో వాహనాల్లో బయలుదేరారు. మదనపల్లె బైపాస్‌లో ఉన్న రాయల్ ఉడ్ దగ్గర ఆదివారం వేకువజామున ఐషర్‌ను వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 16 మందికి గాయాలయ్యాయి. మిగిలిన వారికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు స్పందించి క్షతగాత్రులను ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు వెంటనే చికిత్స అందించడంతో వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
గాయపడిన వారు..
రోడ్డు ప్రమాదంలో రాజేశ్వరి, లక్ష్మీనారాయణకు తీవ్ర గాయాలు కావడంతో డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. స్వల్పంగా గాయపడిన వారిలో సహస్ర, అశ్వని, లక్ష్మీదేవి, రమాశ్రీ, అరుణ, పుల్లమ్మ, గంగాధర్, వెంకటరాయుడు, కుల్లాయమ్మ, శివశంకర్, లక్ష్మి, రాజా, లక్ష్మీదేవి, భవ్యశ్రీ మదనపల్లె ఆసుపత్రిలోనే చికిత్సలు పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ వాహనం వదిలేసి పరారయ్యాడు. టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి వద్దకు వచ్చి క్షతగాత్రులను విచారించారు. కేసు నమోదు అనంతరం సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ మహమ్మద్ రఫి, ఎస్‌ఐ నాగేశ్వర్ రావు తెలిపారు.
16 మంది భక్తులకు గాయాలు


