అక్రమాలు వెలుగులోకి వచ్చేనా? | - | Sakshi
Sakshi News home page

అక్రమాలు వెలుగులోకి వచ్చేనా?

May 10 2026 7:52 AM | Updated on May 10 2026 7:52 AM

అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం (జేఎన్‌టీయూ–ఏ) పరిధిలోని ఇంజినీరింగ్‌ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థి– అధ్యాపక నిష్పత్తి, హాస్టళ్లు తదితర అంశాలను పరిశీలించడానికి నిజ నిర్ధారణ కమిటీ (ఫ్యాక్ట్స్‌ ఫైండింగ్‌ కమిటీ)లను యూనివర్సిటీ ఉన్నతాధికారులు నియమించారు. యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఆయా కళాశాలను నేరుగా సందర్శించి యూజీసీ నిర్దేశిత అంశాలనూ క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం యూనివర్సిటీకి నివేదికను సమర్పిస్తారు. ఎఫ్‌ఎఫ్‌సీ సిఫార్సల మేరకు బీటెక్‌, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో కోత విధించాలా? లేక గరిష్ట సీట్లు అనుమతించాలా? అనే అంశంపై యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంటుంది. అనంతరం ఏపీఈఏపీసెట్‌ అడ్మిషన్ల కన్వీనర్‌కు సీట్ల జాబితా పంపుతారు. ఈ మేరకు ఏపీ ఈఏపీసెట్‌లో అర్హత పొందిన విద్యార్థి ఆప్షన్‌ ఇచ్చుకుని సీటు పొందుతారు.

తనిఖీ నివేదికలన్నీ నామమాత్రమే..

జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌ 87, ఫార్మసీ 45, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు 28 ఉన్నాయి. ఈ కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాలు మదింపు చేయడానికి ఎఫ్‌ఎఫ్‌సీల నియామకం చేశారు. ఇప్పటికే కొన్ని కమిటీలు పర్యవేక్షణ పూర్తి చేశాయి. సింహభాగం కళాశాలల్లో సరిపడా బోధనా సిబ్బంది లేరనే అంశాన్ని గుర్తించారు. ప్రతి కళాశాలలోనూ విద్యార్థులు, అధ్యాపకుల నిష్పత్తిని కచ్చితంగా పరిశీలించాలి. బీటెక్‌లో ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ప్రొఫెసర్‌, ఒక అసోసియేట్‌, ఆరుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండాలి. ఎంటెక్‌లో ప్రతి బ్రాంచ్‌కూ అసిస్టెంట్‌, అసోసియేట్‌, ప్రొఫెసర్‌ ఒక్కొక్కరు ఉండాలి. ప్రొఫెసర్‌ లేకపోతే ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్లు తప్పనిసరి. ప్రొఫెసర్‌ డాక్టరేట్‌ పొంది ఉండాలి. మౌలిక సదుపాయాలు (అకడమిక్‌, నాన్‌ అకడమిక్‌, భవనాలు), లేబొరేటరీస్‌, కంప్యూటర్లు తగినన్ని ఉన్నాయా అనే అంశంపై ఆరా తీయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా లైబ్రరీ, హాస్టళ్లు, ట్రాన్స్‌పోర్ట్‌ సౌకర్యం, మెడికల్‌ ఫెసిలిటీని పరిశీలించాలి. గతేడాది క్యాంపస్‌ ఇంటర్వ్యూలు ఎంతమంది పొందారు.. ప్రవేశపెట్టిన కోర్సులు.. కొత్త కోర్సులు ఎన్ని ఉన్నాయి.. అనే అంశాన్ని క్షుణ్ణంగా పర్యవేక్షించాలి. ఇవన్నీ పరిశీలిస్తారు. కానీ ఫ్యాకల్టీ లేకపోయినా.. ఉన్నట్లుగానే నివేదికలో పొందుపరుస్తారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

ఆ కోర్సులకు ప్రొఫెసర్లు ఎక్కడ?

ఇంజినీరింగ్‌ కళాశాలలను పరిశీలించినప్పుడు ఆశ్చర్యకరమైన ఘటనలు వెలుగులోకి వచ్చినట్లు కొంతమంది ప్రొఫెసర్లు వెల్లడించారు. డేటా సైన్సెస్‌కు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సులు అన్ని కళాశాలల్లోనూ అమలు చేస్తున్నారు. సింహభాగం విద్యార్థులు అడ్మిషన్లు ఈ కోర్సుల్లోనే పొందుతున్నారు. దీంతో ప్రతి కళాశాలలోనూ మూడు, నాలుగు సెక్షన్లు అనుమతి తెచ్చుకుని.. ధనార్జనే ధ్యేయంగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. అత్యధిక కళాశాలల్లో డేటా సైన్సెస్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ బోధించే అధ్యాపకులు లేరు. కారణం కొత్త కోర్సుల్లో అనుభవం లేకపోవడం.. ఇందులో పీహెచ్‌డీ చేసిన వారు తక్కువగా ఉండడమే. మల్టీడిసిప్లనరీలో ఇతర కోర్సుల్లో చదివిన వారు సైతం డేటా సైన్సెస్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సబ్జెక్టును కొద్ది రోజుల్లోనే నేర్చుకుని పాఠాలు చెబుతున్నారు. దీంతో విద్యార్థులకు పాఠాలు అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనల ప్రకారం ఆయా సబ్జెక్టుల్లోనూ పీహెచ్‌డీ పూర్తి చేసిన వారు ఉంటేనే అర్హుల కింద పరిగణించాలి. 20 నుంచి 30 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఈ సబ్జెక్టులను బోధించేవారే లేరని పరిశీలనలో తేలినట్లు ప్రొఫెసర్లు పేర్కొంటున్నారు.

అద్దె ప్రొఫెసర్లు

ఆయా సబ్జెక్టుల్లో నిష్ణాతులైన ప్రొఫెసర్లు లేకపోవడంతో అద్దె ప్రొఫెసర్లను దింపుతున్నట్లు తెలుస్తోంది. నిజనిర్ధారణ కమిటీల ముందు హాజరుపరిచి.. పర్యవేక్షణ పూర్తయ్యాక.. తిరిగి సొంత కళాశాలకు పంపించేస్తున్నారు. వాస్తవానికి ఒక కళాశాలలో పనిచేసే వారిని వివిధ కళాశాలల్లో పనిచేస్తున్నట్లుగా కమిటీల ముందు హాజరు పరుస్తున్నట్లు సమాచారం. ఆధార్‌ నంబరు లింక్‌ చేసి.. వెబ్‌సైట్‌లో ప్రొఫెసర్ల పేర్లు పొందుపరిస్తే.. ఇలాంటి మోసాన్ని పసిగట్టవచ్చునని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. గతంలో ప్రతి ప్రొఫెసర్‌కూ యూనివర్సిటీ పరిధిలో ర్యాటిఫికేషన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించేవారు. తాజాగా అలాంటి ఇంటర్వ్యూలకు మంగళం పాడేశారు. దీంతో తప్పిదాలకు ఆస్కారం ఏర్పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

క్షుణ్ణంగా పరిశీలించాలని కోరాం

ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో నాణ్యత ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించాలని నిజనిర్ధారణ కమిటీలను కోరాం. మదింపులో రాజీ పడేది లేదు. కచ్చితమైన డేటా ఇస్తారని ఆశిస్తున్నాం.

– ప్రొఫెసర్‌ బి.దుర్గాప్రసాద్‌,

డైరెక్టర్‌ ఆఫ్‌ అకడమిక్‌ అండ్‌ ఆడిట్‌, జేఎన్‌టీయూ(ఏ)

ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రొఫెసర్లు లేకున్నా ఉన్నట్లు మాయ

ఏఐ, డేటా సైన్సెస్‌ కోర్సులున్నా బోధన శూన్యం

అర్హత గల ప్రొఫెసర్లు లేకపోవడమే కారణం

నిజ నిర్ధారణ కమిటీల పరిశీలనలో గుర్తించేరా?

Advertisement
 
Advertisement
Advertisement