అన్నదాత ఆక్రందనలు పట్టవా? | - | Sakshi
Sakshi News home page

అన్నదాత ఆక్రందనలు పట్టవా?

May 10 2026 7:52 AM | Updated on May 10 2026 7:52 AM

అనంతపురం: అన్నదాతల ఆక్రందనలు చంద్రబాబు ప్రభుత్వానికి పట్టవా అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి నిలదీశారు. శనివారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేనిరీతిలో భూగర్భజలాలు అడుగంటిపోయాయని, మామిడి, చీనీ తోటలు కళ్లెదుటే ఎండిపోతుంటే రైతులు తల్లడిల్లిపోతున్నారన్నారు. ముగ్గురు మంత్రులు ఉన్నా రైతాంగానికి ఒనగూరిందేమీ లేదన్నారు. అనంతపురం జిల్లాలోని 20 మండలాల్లో నీటిమట్టాలు తగ్గిపోయాయని, ఏడు నుంచి ఎనిమిది మండలాల్లో పరిస్థితి దారుణంగా ఉందని గుర్తు చేశారు. జిల్లాలో హంద్రీ–నీవా ద్వారా 20 టీఎంసీల నీరు వచ్చినప్పుడే చెరువులకు నీరు చేరి భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. 60 టీఎంసీల నీరిచ్చామని ప్రజాప్రతినిధులు చెబుతున్నారని, అదే నిజమైతే మరి భూగర్భజలాలు ఎందుకు తగ్గాయో వారు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.

ఇన్‌పుట్‌ సబ్సిడీ లేదు.. బీమానూ లేదు

ప్రకృతి వైపరీత్యం, కరువు, తదితర కారణాలతో పంట నష్టం జరిగితే తక్షణమే ఉపశమనం కలిగించేది ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమానేనని అనంత అన్నారు. గత రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు చేయలేదన్నారు. ఉచిత పంటల బీమాకూ మంగళం పాడిందన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌లోనే రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. ఉచిత పంటల బీమాను పకడ్బందీగా అమలు చేశారన్నారు. అయితే ప్రస్తుత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు రైతుల గురించి ఆలోచించే తీరికలేకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజలకు ఏదో చేస్తున్నామని మభ్యపెట్టడానికే సీఎం కలెక్టర్లతో సమీక్షలు అంటూ డ్రామా ఆడుతున్నారన్నారు.

బాధితులకు పరిహారమేదీ?

చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలోనే 70 మందికి పైగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని, అయితే ఏ ఒక్క బాధిత కుటుంబాన్నీ ఆదుకోలేకపోయారని అనంత ధ్వజమెత్తారు. వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడిన అనంతపురం జిల్లాకు రెగ్యులర్‌ జేడీని నియమించలేకపోయారన్నారు. ఖరీఫ్‌ సమీపిస్తున్నా సరైన ప్రణాళిక లేదన్నారు.

గిట్టుబాటు ధరల కల్పనలో విఫలం

పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అనంత విమర్శించారు. ఎన్నడూ లేనివిధంగా మామిడి, అరటి, చీనీ ధరలు పతనమయ్యాయన్నారు. మొక్కజొన్న కనీస మద్దతు ధర క్వింటాలు రూ.2,400 ప్రకటించినా అందుకు అనుగుణంగా ప్రభుత్వం కొనుగోలు చేయలేదన్నారు. వరిని సైతం మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, సాంస్కృతిక విభాగం నగర కార్యదర్శి కేశవరెడ్డి, బీసీ సెల్‌ నాయకుడు రామచంద్ర, విద్యార్థి నాయకుడు కై లాష్‌ తదితరులు పాల్గొన్నారు.

చీనీ, మామిడి చెట్లు ఎండిపోతున్నా కనికరం లేదా..

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంతవెంకటరామిరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement