రాయదుర్గంటౌన్: పట్టణంలోని కోట ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో శనివారం శ్రీవారి వసంతోత్సవం, మయూర వాహనోత్సవ సేవలను కనులపండువగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, స్వామి వారి వసంతోత్సవం, కంకణ విసర్జన, చక్రస్నానం, మహామంగళ హారతి వేడుకగా జరుపుకున్నారు. వసంతోత్సవాన్ని దేవాలయం వద్ద నుంచి లక్ష్మీబజార్ వరకు నిర్వహించారు. రంగుల నీళ్లు భక్తులపై చల్లుతూ వసంతాలు ఆడారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన మయూర వాహనంపై దేవేరులతో శ్రీవారిని ప్రత్యేక రథంపై ఆశీనులను చేసి పురవీధుల్లో ఊరేగించారు. చివరి రోజు ఆదివారం సప్తప్రాకారోత్సవం, శయనోత్సవ కార్యక్రమాలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిస్తాయని ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహారెడ్డి తెలిపారు.
ముగిసిన పెన్నహోబిలం బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ రూరల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ముగిసాయి. ఉదయం ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అభిషేకం, అర్చనలు, పూజల నిర్వహించారు. అనంతరం శోభాయమానంగా అలంకరించిన పల్లకీలో శ్రీదేవి భూదేవి సమేత నృసింహస్వామి ఉత్సవమూర్తులను కొలుదీర్చారు. అర్చకుల ఆధ్వర్యంలో ఊరేగింపుగా ఆమిద్యాలలోని పెన్నహోబిలేసుని ఆలయానికి చేర్చారు.
యువకుడిపై పోక్సో,
అట్రాసిటీ కేసు నమోదు
గార్లదిన్నె: మండలంలోని కల్లూరు కొండకింద కొట్టాలకు చెందిన యువకుడు రాజుపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. వివరాలను శనివారం ఆయన వెల్లడించారు. వారం రోజుల క్రితం తాను నివాసముంటున్న ప్రాంతంలోని ఓ బాలికను రాజు మాయ మాటలు చెప్పి తన వెంట పిలుచుకెళ్లిపోయాడు. ఘటనపై ఈ నెల 5న తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టారు. విషయం తెలుసుకున్న రాజు శుక్రవారం బాలికను వారి ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు. లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు బాలికకు సర్వజనాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. శనివారం సఖీ సెంటర్‌కు తరలించారు. ఘటనపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేసి, రాజు కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


