● పింఛన్ల కోసం ఎదురుచూపు
● పట్టించుకోని చంద్రబాబు సర్కార్
గుమ్మఘట్ట: మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి భరోసా అందడం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు పింఛన్ మంజూరు చేసి అండగా నిలిచారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు అవుతున్నా మత్స్యకారులకు ఎలాంటి భరోసాగానీ, భద్రత గానీ కల్పించలేకపోయింది. జిల్లా వ్యాప్తంగా పీఏబీఆర్, మిడ్‌పెన్నార్ (ఎంపీఆర్), బీటీపీ, చాగల్లు రిజర్వాయర్‌తో పాటు 150 చెరువులు ఉన్నాయి. ఇందులో 108 మత్సకారుల సహకార సంఘాలు, అందులో 5,120 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 50 సంవత్సరాల వయసు దాటినవారు 1,251 మంది ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలూ అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. అర్హత ఉండి కూడా పింఛన్‌కు నోచుకోకపోవడంతో ప్రతి నెలా రూ.4వేల చొప్పున మొత్తం రూ.50,04,000 కోల్పోతున్నారు. పింఛన్ మంజూరు చేయండని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారుల నుంచి ఎటువంటి స్పందనా లేదని వాపోతున్నారు.


