● శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ కార్మిక యూనియన్ నేతలు
కూడేరు: వేలాది ప్రజల దాహార్తిని తీరుస్తున్న శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ కార్మికులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆ ప్రాజెక్ట్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎర్రిస్వామి, కార్మికులు మండిపడ్డారు. కూడేరు మండలం పీఏబీఆర్ వద్ద ఉన్న శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ పంప్ హౌస్ వద్ద శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోలో వారు మాట్లాడారు. నెలల తరబడి జీతాలు చెల్లించకపోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. న్యాయబద్ధంగా చెల్లించాల్సిన పీఎఫ్ సొమ్మునూ పెండింగ్‌లో ఉంచారని మండిపడ్డారు. ఈ క్రమంలో సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని పలు దఫాలుగా అధికారులను అభ్యర్థించినా కనీసంగానూ స్పందించలేదని, చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మెలోకి వెళితే... మోటార్లు ఆన్ చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కార్మిక సంఘం నేతలు కొండారెడ్డి, రామాంజనేయులు, శ్రీనివాసులు రెడ్డి, వన్నూరుస్వామి, రమేష్, సత్యనారాయణ పాల్గొన్నారు.
యువతి ఆత్మహత్య
విడపనకల్లు: మండలంలోని పాల్తూరు గ్రామానికి చెందిన వెంకటేశులు కుమార్తె పవిత్ర(18) ఆత్మహత్య చేసుకుంది. ఐదేళ్లుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతున్న ఆమెకు కుటుంబసభ్యులు పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా నయం కాకపోవడంతో క్షణికావేశానికి లోనైన ఆమె శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పాల్తూరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, పవిత్ర మృతి విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వకర్త వై.విశ్వేశ్వరరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవిత్ర కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. అలాగే చిరుప్రాయంలోనే పవిత్ర ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వై.మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రి మార్చరీలో ఉంచిన పవిత్ర మృతదేహాన్ని ఆయన పరిశీలించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఎంపీపీ నరసింహులు, వైఎస్సార్‌సీపీ నాయకులు అశోక్‌కుమార్, లత్తవరం గోవిందు, కడవలకుంట సురేష్, సుంకన్న, చాబాల మాజీ సర్పంచ్ జగదీష్ తదితరులు ఉన్నారు.
విద్యుదాఘాతంతో
యువకుడి మృతి
గుమ్మఘట్ట: రాయదుర్గం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పురుషోత్తం (26) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఆయనకు భార్య లిఖిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. వ్యవసాయంతో జీవనం సాగిస్తున్న పురుషోత్తం శనివారం వేకువజామున గ్రామ శివారున బహిర్భూమికని వెళ్లాడు. అయితే శుక్రవారం రాత్రి వీచిన పెనుగాలులకు విద్యుత్ తీగలు తెగి పడి ఉన్న విషయాన్ని గుర్తించని ఆయన వాటిపై కాలు పెట్టడంతో ఒక్కసారిగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇద్దరు యువకుల మరణం
అనంతపురం సెంట్రల్: నగరంలో చోటు చేసుకున్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్ కడప జిల్లా అజాద్‌నగర్‌కు చెందిన షేక్ కరీముల్లా కుమారుడు షేక్ మహబూబ్‌బాషా(20), అనంతపురంలోని రాణినగర్‌కు చెందిన బాబావలి కుమారుడు ఖాసీంవలీ(18) బంధువులు. రెండు రోజుల క్రితం మహబూబ్ బాషా అనంతపురానికి వచ్చాడు. శుక్రవారం ఖాసీంవలీతో కలిసి విద్యుత్‌నగర్ సర్కిల్ నుంచి సంఘమేష్ సర్కిల్ వైపుగా ద్విచక్ర వాహనంపై వెళుతూ రమణ రమేష్ థియేటర్ సమీపంలోకి చేరుకోగానే నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొన్నారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకులను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఖాసీంవలీని కర్నూలుకు వైద్యులు రెఫర్ చేశారు. అనంతపురం ఆస్పత్రిలోనే మహబూబ్‌బాషాకు చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం పరిస్థితి విషమించి ఇద్దరూ మృతి చెందారు. ఘటనపై అనంతపురం ట్రాఫిక్ సీఐ వెంకటేష్ నాయక్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
16న శనీశ్వర
ఆవిర్భావ దినోత్సవం
పావగడ: ఈ నెల 16న పావగడలో శనీశ్వరస్వామి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌కే సంఘం అధ్యక్షుడు అనిల్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 15న విశేష పుష్ప యాగం, దీపాలంకృత ఉత్సవం ఉంటుంది. ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయి.
పురుషోత్తం (ఫైల్)


